దర్యాప్తులో 150 మంది అధికారులు
బెంగళూరు : ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన నలుగురు వ్యక్తుల విచారణ, కేసుల దర్యాప్తులో హోం శాఖలోని వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 మంది అధికారులు పాల్గొంటున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ వెల్లడించారు. సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద ఆరోపణలపై ఇస్మాయిల్ అఫత్, సద్దామ్ హుస్సేన్, సబూర్, రియాజ్‌ల నుంచి నిబంధనల ప్రకారమే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అసహనం వ్యక్తం చేశారు.
ఈ నలుగురు నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్న దృష్ట్యా ఈ దర్యాప్తులో భాగస్వాములైన అధికారుల బదిలీల ప్రస్తావన ఇప్పట్లో ఉండబోదన్నారు. కర్ణాటక ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగంలో ఇంజనీర్‌ల కొరతను పరిష్కరించేందుకు గాను త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు.
బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి అవాంతరం తలెత్తకుండా రాష్ట్ర హోం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని కె.జె.జార్జ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.