Minister K. J. George
-
చల్లారని ప్రజాగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల నిరసనలు బెంగళూరులో యడ్యూరప్ప నేతృత్వంలో కొడవల ధర్నా బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటన పై విపక్షాలతో పాటు ప్రజాసంఘాల నిరసనలు మంగవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్‌ను మంత్రి మండలి నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీతో పాటు వివిధ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ గణపతి ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో పాటు కే.జే జార్జ్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీ.వీ ఇంటర్వ్యూలో పేర్కొని అటుపై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీ నాయకులతో పాటు కొడవ రక్షణ వేదిక నాయకులు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. బెంగళూరులోని మౌర్య సర్కిల్ వద్ద బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో పాటు కొడవ సముదాయానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప అధికార కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. నీతి, నిజాయితీలతో పనిచేసే అధికారులకు సిద్ధు సర్కార్‌లో గుర్తింపు లేక పోగా వారిపై రాజకీయ నాయకులు తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారన్నారు. దీంతో అధికారులు ఉద్యోగాలను వదిలివేయడం కాని లేక ఆత్మహత్యలకు పాల్పడటం కాని జరుగుతోందని పేర్కొన్నారు. ఇందుకు డీఎస్పీ అనుపమా షణై, గణపతిల ఉదంతాలే ప్రత్యక్ష ఉదాహరణలన్నారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు సంబంధించిన ఘటనలో మంత్రి కే.జే జార్జ పై ఆరోపణలు వచ్చినందువల్ల ఆయన్ను రక్షించడం కోసం కేసును కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. జార్జ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్, పార్లమెంటు సభ్యురాలు శోభాకరంద్లాజే తదితరులు పాల్గొన్నారు. -
దర్యాప్తులో 150 మంది అధికారులు
బెంగళూరు : ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన నలుగురు వ్యక్తుల విచారణ, కేసుల దర్యాప్తులో హోం శాఖలోని వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 మంది అధికారులు పాల్గొంటున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ వెల్లడించారు. సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద ఆరోపణలపై ఇస్మాయిల్ అఫత్, సద్దామ్ హుస్సేన్, సబూర్, రియాజ్‌ల నుంచి నిబంధనల ప్రకారమే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అసహనం వ్యక్తం చేశారు. ఈ నలుగురు నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్న దృష్ట్యా ఈ దర్యాప్తులో భాగస్వాములైన అధికారుల బదిలీల ప్రస్తావన ఇప్పట్లో ఉండబోదన్నారు. కర్ణాటక ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగంలో ఇంజనీర్ల కొరతను పరిష్కరించేందుకు గాను త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి అవాంతరం తలెత్తకుండా రాష్ట్ర హోం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని కె.జె.జార్జ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.