The investigation of the case
-
పోలీసుల అదుపులో బాంబు కేసు నిందితులు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో పోలీసులు ఐదుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన చిత్తూరు కోర్టులో బాంబు పేలడం, ఓ న్యాయవాది గుమస్తా గాయపడిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అనుచరులను, కటారి వర్గీయులను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 2007లో చిత్తూరు సీకే.బాబుపై మందుపాతర దాడి ఘటన కేసులో ప్రధాన నిందితులుగా కటారి మోహన్, చింటూ, కటారి ప్రవీణ్‌లతో పాటు మాజీ నక్సల్స్ కూడా ఉన్నారు. శుక్రవారం చిత్తూరు కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. కేసు విచారణకు చింటూ తప్ప మిగిలిన నిందితులు హాజరయ్యారు. వీరిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదుగురిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీకే.బాబుపై జరిగిన మందుపాతర ఘటన, కోర్టులో జరిగిన బాంబు పేలుడు రెండూ ఒకేలా ఉండడంతో వీరికి సంబంధాలు ఉన్నాయా..? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
దర్యాప్తులో 150 మంది అధికారులు
బెంగళూరు : ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన నలుగురు వ్యక్తుల విచారణ, కేసుల దర్యాప్తులో హోం శాఖలోని వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 మంది అధికారులు పాల్గొంటున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ వెల్లడించారు. సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద ఆరోపణలపై ఇస్మాయిల్ అఫత్, సద్దామ్ హుస్సేన్, సబూర్, రియాజ్‌ల నుంచి నిబంధనల ప్రకారమే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అసహనం వ్యక్తం చేశారు. ఈ నలుగురు నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్న దృష్ట్యా ఈ దర్యాప్తులో భాగస్వాములైన అధికారుల బదిలీల ప్రస్తావన ఇప్పట్లో ఉండబోదన్నారు. కర్ణాటక ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగంలో ఇంజనీర్ల కొరతను పరిష్కరించేందుకు గాను త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి అవాంతరం తలెత్తకుండా రాష్ట్ర హోం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని కె.జె.జార్జ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.