సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం నాడు చెలరేగిన అల్లర్లు ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఆది, సోమ వారాల్లో ఇరువురు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్న కేంద్ర హోం శాఖ అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై తక్షణమే నివేదికను సమర్పించాల్సిందిగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బలపడుతున్న భారతీయ జనతా పార్టీ హిందువుల ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం గతేడాది నుంచి శ్రీరామ నవమి సందర్భంగా ఆయుధాలు ధరించి హిందూ సంఘాల కార్యకర్తలతో బెంగాల్ వీధుల్లో ప్రదర్శన నిర్వహిస్తోంది.
గతేడాది ప్రదర్శనల్లో పాల్గొన్న ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు రాష్ట్రంలో జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా హిందువులంతా ఏకం కావాలంటూ నినాదాలు చేశారు. వారిని అదుపుచేయడంలో నాడు విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సారి మరింత ఘోరంగా విఫలమైంది. దానికి కారణం బీజేపీ–ఆరెస్సెస్ ప్రదర్శనలకు పోటా పోటీగా ఆయుధాలు ధరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని ప్రదర్శనలు నిర్వహించడమే. వీలు చిక్కినప్పుడల్లా తాను లౌకికవాదినంటూ ప్రచారం చేసుకునే మమతా బెనర్జీ హిందువుల ఓట్ల కోసం ఇలాంటి ఎత్తుగడలు వేస్తారా? అంటూ దేశంలోకి లౌకిక రాజకీయ శక్తులు కూడా ఆశ్చర్య పోతున్నాయి. రాష్ట్రంలో 67 శాతం హిందువులు ఉండగా, 30 శాతం ముస్లింలు ఉన్నారు.
ఈసారి శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారని, అసలు ఆయుధ ప్రదర్శనలను చట్టపరంగా నిషేధిస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. గతేడాది ఆయుధాల ప్రదర్శనలకు నాయకత్వం వహించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌యే ఈసారి కూడా ఆయుధ ప్రదర్శనలకు నాయకత్వం వహించారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. ఎందుకంటే తృణమూల్ పార్టీ ఆధ్వర్యాన కూడా కత్తులు, కటార్లు ధరించి శ్రీరామ నవమి జెండాలతో ప్రదర్శనలు నిర్వహించడమే. మమతా బెనర్జీ ముస్లింల పక్షపాతంటూ బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం కూడా ప్రజలపై ప్రభావం చూపుతోంది.
ఈ పరిస్థితుల్లోనే మమతా బెనర్జీ తన సహజ వైఖరిని మార్చుకున్నట్లు ఉన్నారు. ఇటీవల బీర్భమ్ జిల్లాలో ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సమ్మేళనంలో ఆమె స్వయంగా పాల్గొనడమే కాకుండా సమ్మేళనంలో పాల్గొన్న వారందరికి భగవద్గీతలను పంచి పెట్టారు. ఇలాంటి జిమ్మికుల వల్ల హిందువులు అంత తొందరగా ఆమెను విశ్వసించక పోవచ్చు. దేశ స్వాతంత్య్ర యోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ విగ్రహాన్ని శ్రీరామ నవమి నాడు బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలు కూల్చేస్తే కూడా ఆమె దాన్ని నేరుగా ఖండించలేకపోయారు. అంటే ఆమె గందరగోళ రాజకీయ పరిస్థితుల్లో పడిపోయినట్టున్నారు.
రాష్ట్రంలో ఎలాగైన హిందూత్వను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆమె తొలుత ప్రాంతీయ సంస్కృతి వాదాన్ని తీసుకొచ్చారు. బెంగాల్‌కున్న ప్రత్యేక సంస్కృతిని రక్షించాలంటూ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. నవమి సందర్భంగా ఆయుధ ప్రదర్శనలు జరపడం బెంగాలీ సంస్కృతి కాదని, పూర్తి పరాయి సంస్కృతి అంటూ విమర్శించారు. బెంగాల్‌కున్న ప్రత్యేక సంస్కృతిని రక్షించడంలో ఆమె మేధావులను, పండితులను, కళాకారులను కలుపుకోలేకపోయారు. ఒంటరిగా పోరాడి లాభం లేదనుకొని పంథా మార్చుకొని మరీ పల్టీ కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రం నివేదికను డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఎలాంటి సమాధానం ఇస్తారో ఆమెకే తెలియాలి. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ముందునుంచి ఉన్నందున ముందే వ్యూహాత్మకంగాద కేంద్ర హోం శాఖ సహాయాన్ని ఆమె కోరి ఉండాల్సింది. త్రిపురలో విజయం సాధించామన్న గర్వంతో బీజేపీ సేనలు బెంగాల్‌లో వీర విహారం చేస్తుంటే ఆఖరి కోటను కూడా పోగొట్టుకున్నామన్న నిర్వేదంలో బెంగాల్ సీపీఎం నాయకులు పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment