డబ్బులిస్తే మత ఘర్షణలు సృష్టిస్తామన్న నేతలు | India Today Expose: UP's Rent-a-Riot netas willing to spark violence for money | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తే మత ఘర్షణలు సృష్టిస్తామన్న నేతలు

Published Tue, Jun 28 2016 5:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

డబ్బులిస్తే మత ఘర్షణలు సృష్టిస్తామన్న నేతలు

డబ్బులిస్తే మత ఘర్షణలు సృష్టిస్తామన్న నేతలు

 న్యూఢిల్లీ: భారత్ లాంటి దేశంలో మత కల్లోలాలు చెలరేగడం, వాటిల్లో వందలాది మంది మృత్యువాత పడడం మనకు కొత్తేమి కాదు. ఆ మతకల్లోలాలను అవకాశంగా తీసుకొని రాజకీయం చేసే పార్టీల సంగతి తెలియందీ కాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బహిరంగ వేదికలపై రాజకీయ నాయకులు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడము కూడా మనకు అనుభవమే. దేశంలో ఇప్పటివరకు జరిగిన మత కల్లోలాలన్నీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ప్రజల నుంచి అప్పటికప్పుడు అనూహ్యంగా వచ్చిన ఆక్రోశం ఫలితం అనుకుంటే పొరపాటే.

అన్నీ కాకపోయిన కొన్నైనా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, డబ్బు కక్కుర్తితో జరిగినవన్న విషయం కూడా మనకు లీలామాత్రంగా తెలుసు. అందుకు ప్రత్యక్ష సాక్షాధారాలు దొరక్కపోవడానికి కారణం ఇంత వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా నిజాయితీతో దర్యాప్తు జరిపిన సందర్భాలు లేకపోవడమే. పార్టీలు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా కొంత మంది రాజకీయ నాయకులు డబ్బులకు కక్కుర్తి పడి తామే మత కల్లోలను సృష్టించి అమాయక ప్రజల మారణకాండకు కూడా వెనుకాడరనే విషయం ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలయింది.

ఇండియా టుడే టీవీకి చెందిన ఓ జర్నలిస్టు ‘బ్లాస్‌ ఫెమస్ (దైవదూషణ)’ పేరిట ఓ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లో తీస్తున్నామని, ఇందుకు విస్తృత ప్రచారాన్ని కల్పించడంలో భాగంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు, కల్లోలాలు సృష్టించాలంటూ కొంత మంది రాజకీయ నాయకులను ఆశ్రయించారు. పది రోజులపాటు కొనసాగిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.  బూటకపు డాక్యుమెంటరీ జర్నలిస్ట్ ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న హిందూ స్వాభిమాన్ సంఘటన్, ధర్మసేన యూనిట్‌కు చెందిన నాయకుడు పరమీందర్ ఆర్యాను కలుసుకున్నారు. తాము రాముడు అయోధ్యలో పుట్టలేదనే వాదనతో ఆయనకు వ్యతిరేక మైన కాన్సెప్ట్‌తో డాక్యుమెంటరీని తీస్తున్నామని చెప్పారు.

ప్రజల దృష్టిలో ప్రజలకు ఆయన పట్ల ఉన్న ఇమేజ్ ప్రకారం పరమీందర్  ఆర్యా, రాముడికి వ్యతిరేకంగా సినిమా తీయడం ఏమిటంటూ అభ్యంతరం పెట్టాలి, తన వద్దకు వచ్చిన వ్యక్తిని ఈసడించుకోవాలి. ఆయన అదేమి చేయకపోగా, డాక్యుమెంటరీకి విస్తృత ప్రచారం కల్పించడం కోసం దానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో అంటే ఆ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తానని, అందుకు ప్రతిఫలం (డబ్బు) బాగా ముట్టాలని డిమాండ్ చేశారు. ముస్లింల జిహాద్‌కు వ్యతిరేకంగా ఇటీవల యూపీలో కొంత మంది హిందూ యువతకు పరమీందర్ ఆర్య ఆయుధ శిక్షణ ఇప్పించిన వార్తలు  పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన విషయం తెల్సిందే.

‘మీరు ఎక్కడైతే డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారని చెబుతారో అక్కడికి మా కుర్రాళ్లు యాభై మంది వచ్చి గొడవ చేస్తారు. గందరగోళం సృస్టిస్తారు. ముందుగా సూచిస్తే ఎవరి చొక్కాలు చింపమంటే వారి చొక్కాలను చింపుతారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు కొట్టుకోవడం, రాళ్లు రువ్వడం లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ‘జో రామ్ కా నహీ కిసీ కా కామ్ కా నహీ, రామ్ కా అపమాన్, నహీ సహేగా హిందుస్థాన్’...లాంటి నినాదాలిస్తూ మా కుర్రవాళ్లు మీ సినిమా పోస్టర్లను, బ్యానర్లను చింపేస్తారు. డాక్యుమెంటరీకి సంబంధించి మీరు కూడా మీడియాలో స్టేట్‌మెంట్లు ఇవ్వండి, నేను కూడా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాను.

మీడియా కవరేజ్ కూడా చూసుకుంటా. పెద్ద సమస్య కాదు. డీల్ పెద్దగా ఉండాలంతే. ఇప్పటి వరకు మీతో నాకు పరిచయం లేదు. అయినా ఫర్వాలేదు. నేను మాటిచ్చానంటే మాట మీద నిలబడతా. అనుకున్న ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసేందుకు నాకు పది రోజుల సమయం కావాలి. ఇంతకు యాభై మంది కుర్రాళ్లు సరిపోతారా, ఇంకా ఎక్కువ మంది కావాలా? ఇందులో మా వాళ్లకు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉందికనుక డీల్ ఎక్కువగా ఉండాలి. ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ కులుద్దాం. అప్పుడు డీల్ గురించి మాట్లాడుకుందాం, ఈలోగా ఫోన్‌లో మాట్లాడితే కోడ్ భాషలో మాట్లాడుకుందాం’ అన్న ఆర్య మాటలను జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్‌లో రికార్డు చేశారు.

ఆ తర్వాత 2013లో హిందూ ముస్లింల అల్లర్లు చెలరేగిన ముజాఫర్‌నగర్‌కు బూటకపు డాక్యుమెంటరీ బృందం వెళ్లింది. అందులో ఓ జర్నలిస్టు బీజేపీ ఎమ్మెల్లే కపిల్ దేవ్ అగర్వాల్‌ను కలసుకున్నారు. ఆర్య ముందు వేసిన రికార్డునే ఆయన ముందు వేశారు. దానిపై ఆయన స్పందిస్తూ ‘ఈ డాక్యుమెంటరీ మీద గొడవ సృష్టిస్తే నామేమి వస్తుంది. దాని వల్ల మీకేమి లబ్ధి చేకూరుతుంది’ అని ప్రశ్నించారు. ఆ వెంటనే ఆయనే విషయాన్ని గ్రహించి ‘ఓహో! దీని వల్ల మీకు మీకు పబ్లిసిటీ లభిస్తుంది.

నాకెంత ఇస్తారో తెలిస్తే చెబుతా, మళ్లీ కలుద్దాం’ అంటూ ఆయన వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత టీవీ జర్నలిస్ట్ మళ్లీ రెండోసారి కలసుకోగా విఫులంగా మాట్లాడారు. మా కుర్రాళ్లను పంపించి గొడవ చేయిస్తాను. సినిమాను బ్యాన్ చేయాలంటూ స్టేట్‌మెంట్ కూడా ఇస్తాను. నా స్టేట్‌మెంట్ ద్వారా కూడా ఎక్కువ ప్రచారం లభిస్తుంది. నాకు ముట్టే డబ్బులు మాత్రం ఎక్కువగా ఉండాలి. డ బ్బుల ఆఫర్ నాకు నచ్చితేనే నేను పనిచేయిస్తా’ అని బీజేపీ ఎమ్మెల్యే మాటిచ్చారు.

అనంతరం ఆ టీవీ జర్నలిస్టు సమాజ్‌వాది పార్టీ హరిద్వార్ యూనిట్ అధ్యక్షుడు హఫీజ్ మొహమ్మద్ ఇర్ఫాన్‌ను కలసుకున్నారు. ఈసారి ‘బ్లాస్‌ఫెమస్’ అనే డాక్యుమెంటరీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పారు. ‘నిరసనలు, ప్రదర్శనలు, వ్యతిరేక నినాదాలు అవేగదా, మీకు కావల్సిందీ?’ అని ఇర్ఫాన్ ప్రశ్నించగా, అంతకంటే ఎక్కువే కావాలి. ఘర్షణలు జరగాలి అని జర్నలిస్టు అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ ‘నో ప్లాబ్లమ్. అన్ని జరిగిపోతాయ్. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే యాభై, అరవై కుర్రవాళ్లతో అనుకున్నది చేయించాలి. అందుకని ఐదు లక్షల ఇవ్వండి. మీడియా పబ్లిసిటీ కూడా చేసి పెడతా’ అని ఇర్ఫాన్ చెప్పారు. ఆ తర్వాత స్టింగ్ ఆపరేషన్‌పై ఇర్ఫాన్‌ను టీవీ జర్నలిస్ట్ అధికారికంగా ప్రశ్నించగా, నేను ఎలాంటి డీల్‌కు ఒప్పుకోలేదంటూ ఇర్ఫాన్ సమాధానం ఇచ్చారు. పరమీందర్ ఆర్యను వివరణ కోరగా, ఇది ప్రతిపక్షాల కుట్రని ఖండించారు.

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధుల స్పందన కోరగా, టీవీ ఫుటేజ్‌ను పూర్తిగా తెప్పించుకొని చూశాక స్పందిస్తామని చెప్పారు. పైగా శాంతి భద్రతల సమస్య రాష్ట్ర ప్రభుత్వాలదంటూ అర్థపర్థంలేని సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు మాత్రం తీవ్రంగా స్పందించాయి. ముందు నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టిస్తున్నవి ఈ రెండు పార్టీలేనని ఆరోపించాయి. స్టింగ్ ఆపరేషన్ చేసిన టీవీ జర్నలిస్ట్ అన్ని రాజకీయ పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ఆఫర్లు ఇస్తే ఇంకెన్ని రాజకీయ పార్టీల నాయకులు దొరికేవారో, ఏమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement