దేశంలో పేట్రేగుతున్న మతతత్వ దాడులపై లౌకిక వాద పార్టీలు, నేతలు పోరు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో పేట్రేగుతున్న మతతత్వ దాడులపై లౌకిక వాద పార్టీలు, నేతలు పోరు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ఈ క్రమంలో దీనిపై చర్చించేందుకు తృతీయ కూటమి పార్టీల నేతలు బుధవారం ఇక్కడ భేటీ అవుతున్నట్టు మంగళవారం ఆయన తెలిపారు. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సదరు ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకే ఈ భేటీని ఏర్పాటు చేశారా? అన్న పాత్రికేయుల ప్రశ్నను ఏచూరి తోసిపుచ్చారు. ‘ఈ సదస్సుకు, 2014 ఎన్నికలకు ఎలాంటి సంబంధమూ లేదు. లౌకిక విలువలను కాపాడుకునేందుకుగాను మతతత్వంపై ఐకమత్యంగా పోరాడేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనే చర్చ జరగనుంది. మతతత్వంపై పోరాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని మేం పిలుపునిస్తున్నాం’ అని ఏచూరి స్పష్టం చేశారు. ఈ భేటీకి సీపీఎం, సీపీఐ సహా ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్పీ, జేడీయూ, జేడీఎస్, ఏజీపీ, ఏఐఏడీఎంకే, జేవీఎం, బీజేడీ, ఎన్‌సీపీ, ఆర్‌పీఐ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
మా ఆహ్వానంపై బాబు స్పందించలేదు: ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీతో కలిసి పనిచేశారు కదా...? మరి, మతతత్వ వ్యతిరేక సదస్సుకు ఆయనను ఆహ్వానించ లేదా...? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీపీఎం నేత సీతారాం ఏచూరి సమాధానమిస్తూ... ఆహ్వానించినా బాబు తన స్పందన తెలియజేయలేదన్నారు. ‘అందరికన్నా ముందు ఆయనను(చంద్రబాబునాయుడు) మేము సదస్సుకు ఆహ్వానించాం. తమ పార్టీలో ఇతర నేతలతో చర్చించిన తర్వాత వచ్చేది రానిది చెబుతానన్నారు. కానీ, ఇప్పటివరకు బాబు ఏ స్పందనను తెలుపలేదు. ’అని ఏచూరి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీయేత ర 14 సెక్యులర్‌పార్టీల నేతలు బుధవారం జరగబోయే మతతత్వ వ్యతిరేక సదస్సులో పాల్గొననున్నారు.