సాక్షి, అమరావతి: చంద్రబాబు ఉదయం ఓ పార్టీతో.. సాయంత్రం మరో పార్టీతో ఉంటారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తారో తెలియదన్నారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు తమతో ఉదయం సమావేశం నిర్వహించి.. సాయంత్రానికి వాజ్‌పేయ్‌ని కలిసి పొత్తు గురించి మాట్లాడుకున్నారని గుర్తు చేశారు. గతంలో బీజేపీతోనూ, ఆ తర్వాత ఎన్నికల్లో మళ్లీ వామపక్షాలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారన్నారు. అందువల్ల చంద్రబాబు ఇప్పుడు ఎవరితో ఉంటారో చెప్పడం కష్టమని తెలిపారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారో, లేదో కచ్చితమైన బ్లూప్రింట్ ఎవరి దగ్గర ఉండదన్నారు.
జాతీయ స్థాయిలో ఒక విధానంతో పనిచేసే సీపీఎం ఎన్నికల సమయంలో రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుందని గుర్తు చేశారు. విజయవాడలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం ఏచూరి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ దేశానికి హానికరమని.. బీజేపీతో జట్టు కట్టే పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదన్నది తమ పార్టీ విధానమని ఏచూరి తెలిపారు.
కాగా కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్‌కు రాష్ట్రపతి అధిపతి అని స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రధాని అధికారపక్షానికి మాత్రమే ప్రతినిధి అనే విషయం మరిచిపోతున్నారన్నారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ప్రధాని ప్రారంభిస్తుండటం వల్లే 19 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయన్నారు. హిందూత్వ పేరుతో దేశ చరిత్రను, సిలబస్‌ను చెరిపేసి తమకు అనుకూలమైన కొత్త చరిత్రను సృష్టించుకునేందుకే మతతత్వ బీజేపీ రాజదండం నాటకాన్ని తెరమీదకు తెచ్చిందని ఆరోపించారు.
నోట్ల రద్దు తుగ్లక్ చర్య
గతంలో నోట్ల రద్దు, ఇప్పుడు రూ.2 వేల నోటు రద్దు వెనుక బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయని సీతారాం ఏచూరి ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడి పార్టీలను దెబ్బతీసేందుకే పథకం ప్రకారం రూ.2 వేల నోటు రద్దు చేశారని విమర్శించారు. నోట్ల రద్దు తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. దీనివల్ల సాధించేదేమీ లేదన్నారు. గౌతమ్ అదానీ స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఎడాపెడా ‘ఈనాడు’ అబద్ధాలు
Comments
Please login to add a commentAdd a comment