పాలకులపై పోరుకు సిద్ధం కండి | Get ready to take on the administrators | Sakshi
Sakshi News home page

పాలకులపై పోరుకు సిద్ధం కండి

Published Mon, Feb 9 2015 4:53 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

పాలకులపై పోరుకు సిద్ధం కండి - Sakshi

పాలకులపై పోరుకు సిద్ధం కండి

  • రైతుల్ని దగా చేసేందుకే ల్యాండ్ పూలింగ్!
  •  ప్రజా సైన్యాన్ని తయారు చేసి..కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలపై పోరాడదాం
  •  పార్టీ శ్రేణులకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి పిలుపు
  • విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులపై పోరుకు సిద్ధం కావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రజా సైన్యాన్ని తయారు చేయాలన్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం(అల్లూరు సత్యనారాయణ నగర్)లో ఆదివారం ఏర్పాటైన సీపీఎం ఏపీ రాష్ట్ర తొలి మహాసభల్లో(24వ మహాసభ) ఏచూరి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విధానాలపై ఆయన నిప్పులు చెరిగారు.
     
    మాట తప్పిన బీజేపీ..

    రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సందర్భంలో రాజ్యసభలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై బీజేపీ మాట తప్పిందన్నారు. అయినా వదిలిపెట్టబోమని, ప్రభుత్వాన్ని నిలేసేది తామేనని ఏచూరి చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పొత్తుతో బీజేపీ లాభపడిందే గానీ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని మరిచిందని ధ్వజమెత్తారు.
     
    ఆ ఆర్డినెన్స్ తెచ్చిందే బాబు కోసం..!


    భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు కేంద్రం యత్నిస్తోందని ఏచూరి ఆరోపించారు. ‘కోల్‌కతాని లండన్‌గా మారుస్తామని మూడేళ్ల కిందట ఒకరు చెప్పారు. కానీ ఏమైందో చూశారుగా. ఇప్పుడు ఏపీని సింగపూర్‌గా మారుస్తామంటున్నారు. అదో పెద్ద భ్రమ. రైతుల్ని దగా చేయడానికే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. బాబును ఆదుకోడానికే కేంద్రం భూసేకరణ చట్ట సవరణకు ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. రాజ్యసభలో దానికి రెడ్ లైట్ చూపుతాం’ అని ఏచూరి అన్నారు.
     
    మోదీకి తొలిదెబ్బ తగలబోతోంది..

    నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఢిల్లీ ఎన్నికల్లో తొలిదెబ్బ తగలబోతోందని ఏచూరి అన్నారు. దేశం నుంచి ముస్లిం, క్రిస్టియన్లను తరిమేసేందుకు మతోన్మాద శక్తులు యత్నిస్తున్నాయని హెచ్చరించారు. చైనాను నిలువరించేందుకే అమెరికా భారత్‌తో స్నేహహస్తం చాచిందన్నారు.ప్రజలపై భారాలు మోపే సార్వత్రిక బడ్జెట్‌లో ఆర్థిక లోటు రూ.5.21 లక్షల కోట్లు కాగా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రాయితీలు రూ. 5.62 లక్షల కోట్లన్నారు.
     
    మన కర్తవ్యం ఇదే..

    ‘‘ప్రభుత్వాల దుమ్ము దులపాలి. కార్మికవర్గాన్ని చైతన్య పరచాలి. బలాబలాలు తారు మారు చేయడానికి పాలకులపై పోరుకు ప్రజా సైన్యాన్ని సిద్ధం చేయాలి. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఒకే వేదికపైకి తేవాలి. దీనికి సీపీఎం ప్రధాన వాహికగా ఉండాలి.ఈ మహాసభలైనా, ఏప్రిల్‌లో విశాఖలో జరిగే జాతీయ మహాసభలైనా చేయాల్సిన కర్తవ్యం ఇదే’’అని ఏచూరి చెప్పారు. పార్టీ సీనియర్ నేతలు పాటూరి రామయ్య, సీహెచ్ నరసింగరావు, ఓదేలు, పి.రోజా, చలమయ్య అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు, పి.మధులు పాల్గొన్నారు.
     
    కమ్యూనిస్టుల విలీనంపై తలోదారి

    ఐక్య ఉద్యమాలకు పిలుపునిస్తున్న ఉభయ కమ్యూనిస్టు నేతల వ్యవహారం.. ‘కలిసి పనిచేస్తాం కానీ కలిసి ఉండలేం’ అనే తీరుకు మరోమారు అద్దంపట్టింది. సిద్ధాంత రాద్ధాంతాలతో ఒకరు రైట్ అంటే మరొకరు లెఫ్ట్ అన్నారు. సీపీఎం రాష్ట్ర మహాసభలో ‘కమ్యూనిస్టుల విలీన’ అంశంపై మరోమారు రసవత్తర చర్చ సాగింది. సంఘీభావ ఉపన్యాసం చేసిన సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఉభయ కమ్యూనిస్టుల పార్టీ విలీనంపై మక్కువ చూపారు. తెలంగాణా విషయంలోను ఇరు పార్టీలదీ భిన్నవైఖరి అయినప్పటికీ విభజన జరిగిపోయింది కాబట్టి ఇకపై కలిసి పనిచేద్దామన్నారు.  దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాటూరు రామయ్య స్పందిస్తూ.. ‘పార్టీల కలయిక అనేది నేతలు అనుకుంటే జరిగేది కాదు.. కలసి పనిచేసే క్రమంలో అది సాధ్యమవుతుంది’ అని అన్నారు. ముందు ఐక్య ఉద్యమాలు నిర్వహిద్దాం.. తర్వాత విలీనం అదే జరుగుతుంది అని ముక్తాయించారు.
     
     కమ్యూనిస్టుల్లో కొరవడుతున్న ప్రమాణాలు
     ఏపీ సీపీఎంకి ప్రత్యేక టీవీ చానల్
     
    సీపీఎం నాయకులు, కార్యకర్తల్లో కమ్యూనిస్టు ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయని అధినాయకత్వం ఆవేదన వ్యక్తం చేసింది. సంపాదనపై దృష్టి, పదవులపై యావ, అవినీతి, ఆర్థిక నేరాలకు పార్టీ జిల్లా కమిటీ స్థాయి నేతలు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రవేశ పెట్టిన నివేదిక కఠోర వాస్తవాలను వెల్లడించింది. నైతిక విలువలకు మారుపేరైన పార్టీలో ఈ ధోరణులను తెగనాడాల్సిన అవసరాన్ని నేతలు నొక్కిచెప్పారు.కొన్ని ప్రజాసంఘాల తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.   పార్టీ సభ్యుల సంఖ్య 2012లో 33,226 మంది ఉండగా ఇప్పుడు(2014లో) 32,607 ఉందని తెలిపారు. పార్టీ అవసరాల రీత్యా ప్రత్యేక టీవీ చానల్ కోసం సీపీఎం దరఖాస్తు చేసింది. కార్పొరేట్ మీడియాను తట్టుకునేందుకు మరో చానల్ అవసరమని అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement