బంతి సాగు.. లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

బంతి సాగు.. లాభాలు బాగు

Published Tue, Sep 24 2024 11:48 AM | Last Updated on Tue, Sep 24 2024 11:48 AM

బంతి

బంతి సాగు.. లాభాలు బాగు

షాబాద్‌: నీటి వసతి కలిగిన ప్రాంతం బంతిపూల సాగుకు అనుకూలమైనది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులతో పాటు అంతే స్థాయిలో లాభాలు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ సాగులో డ్రిప్‌ పద్ధతిని అనుసరిస్తే.. నీటిని కూడా పొదుపు చేయవచ్చునని పేర్కొంటున్నారు. మార్కెట్లో బంతికి ఎక్కువగా డిమాండ్‌ ఉంటుందని, ప్రతి పూజాకార్యక్రమాలు, వివాహాలు, గృహప్రవేశాలు తదితర వాటిల్లో విధిగా బంతిని వినియోగిస్తారని వెల్లడించారు. తక్కువ నీటి వనరులతో బంతిని సాగు చేస్తూ.. సస్యరక్షణ చేపడితే రైతులకు లాభాల పంటేనని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం స్పష్టంచేస్తున్నారు. ఆయన తెలిపిన సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి.

సలహాలు.. సూచనలు

బంతి పూలలో ఆఫ్రికన్‌ బంతి, ఫ్రెంచ్‌ మేరీ గోల్డ్‌ రకాలు ఉన్నాయి. నీటి వసతి కలిగిన అన్ని కాలాలు వాటి సాగుకు అనుకూలం. సారవంతమైన గరప నేలలు, నీరు త్వరగా ఇంకిపోయే నేలలు పంటకు తగినవి. పూలు ఏపుగా పెరిగినప్పటికీ ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. బంతి సాగుకు విత్తనాల ద్వారా కానీ, కత్తిరింపుల ద్వారా కానీ ప్రవర్థనం చేయవచ్చు. ఎకరానికి వెయ్యి గ్రాముల విత్తనాలు అవసరం అవుతాయి. మడులను తయారు చేసి విత్తనాలను చల్లుకోవాలి. మడులను తయారు చేసే సమయంలో ఎకరానికి 20 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి. దీంతో పాటు 20 నుంచి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్‌ను వేసుకోవాలి. నాటిన 37 రోజులకు 20 నుంచి 40 కిలోల నత్రజనిని వేసి నీరు పెట్టుకోవాలి. పాలిడాల్‌ పాడి చల్లడం వలన చీమలు, చెదలను నివారించుకోచ్చు. విత్తిన విత్తనాలు వారం రోజుల్లో మొలకెత్తుతాయి. నెల వయసు కలిగిన బంతి మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నాటుకు వచ్చిన నారును సాయంత్రం వేళల్లో నాటుకోవాలి.

నీరు పెట్టుకునే విధానం

నాటిన 60 రోజుల తర్వాత పూత దశ వచ్చే వరకు నేలల్లో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడితో దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

సస్యరక్షణ చర్యలు

పేను.. పూల మొగ్గలను ఆశించి నష్ట పరుస్తాయి. వీటి నివారణకు లీటర్‌ నీటికి మోనోక్రొటోఫాస్‌ 1.5మి.లీ. కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తామర పురుగులు.. ఆకులు, పూలనుంచి రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తాయి. ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొగ్గలు గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.5 మి.లీ. లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గతొలిచే పురుగులు.. లార్వాలు పూల మొగ్గలను తొలుస్తాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్‌ 2 మి.లీ. లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

తెగుళ్ల నివారణ

నీటి తడి ఎక్కువగా ఉండి, వేడిగా ఉన్న చోట నారుకు కుళ్లు తెగులు వ్యాపిస్తుంది. తద్వారా లేత మొక్కలు చనిపోతాయి. మడులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. నేలను లీటర్‌ నీటికి 2 గ్రా. కాఫ్టాన్‌ మందుతో తడపాలి. ఆకు మచ్చ తెగులు.. మొక్కల్లో బూడిద రంగు, లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. లీటర్‌ నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి.

తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి

పూల సేద్యంపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారి

విచ్చుకున్న తరువాతే కోయాలి

బంతి పూలు బాగా విచ్చుకున్న తర్వాతనే కోయాలి. కోతకు ముందు నీటి తడులు ఇచ్చినట్లయితే.. పుష్పాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. పూలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే కోయాలి. సాధారణంగా ఎకరానికి నాలుగు నుంచి ఐదు టున్నుల దిగుబడి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
బంతి సాగు.. లాభాలు బాగు 1
1/1

బంతి సాగు.. లాభాలు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement