Womens Conference
-
సమానత్వం కోసం వేచి ఉండే పనే లేదు
‘‘నువ్వు ఎక్కడ పుట్టావనేది కాదు, ప్రపంచంలో ఎక్కడైనా పుట్టు, ఆడపిల్లగా పుట్టావంటే చాలు, జీవితాన్ని నెట్టుకురావడానికి చాలా దుర్భరమైన, దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు’’. ఈ మాట అన్నది మామూలు మహిళ కాదు. మిలిందా గేట్స్. బిల్ గేట్స్ సతీమణి. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ సహ వ్యవస్థాపకురాలు. ప్రపంచ దేశాల్లో పర్యటించి ఆడవాళ్లు, పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన మహిళ. తాను చూసిన ఘటనలతో ‘ద మోమెంట్ ఆఫ్ లిఫ్ట్’ అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన మహిళ. గేట్స్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గేట్స్ దంపతులు సోమవారం సంయుక్తంగా ఒక వార్షిక లేఖను విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్యం, విద్య, స్త్రీ పురుష సమానత్వాలకు మున్ముందు మరింత ప్రాముఖ్యం ఇవ్వబోతునట్లు‡ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో స్త్రీ–పురుష సమానత్వం గురించి మిలిందా పంచుకున్న విషయాలు ఆలోచన రేకెత్తించేవిలా ఉన్నాయి. అదే సమయంలో స్త్రీ పురుష సమానత్వం సాధ్యమే అనే ఆశనూ చిగురింపజేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ ఇరవయ్యవ వార్షికోత్సవంతోపాటు, చరిత్రాత్మకమైన బీజింగ్ వరల్డ్ కాన్ఫరెన్స్‌కూ ఈ ఏడాది పాతికేళ్లు నిండబోతున్నాయి. ఆనాటి బీజింగ్ సదస్సు మహిళల స్థితిగతుల మీద చర్చించడానికి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని మిలిందా తన లేఖలో గుర్తు చేశారు. 1995లో బీజింగ్‌లో జరిగిన ఉమెన్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో హిల్లరీ క్లింటన్ ప్రసంగిస్తూ ‘మానవ హక్కులే మహిళల హక్కులు.. మహిళల హక్కులే మానవ హక్కులు’ అన్నారు. ఆ మాట తనను ఎంత ఇన్స్పైర్ చేసిందీ చెప్పారు. ‘ఆ తర్వాత నేను ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో పర్యటించాను. అక్కడి మహిళలను చూసిన తర్వాత స్త్రీ– పురుష సమానత్వ సాధన కోసం స్త్రీలకు అవసరమైన శక్తినివ్వడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నేను చెప్పదలచినది ఏమంటే.. మన శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడానికి మహిళలమందరం ముందుకు రావాలి. అప్పుడు సమానత్వం కోసం వేచి చూడాల్సిన పనే ఉండదు’ అని లేఖలో రాశారు మిలిందా గేట్స్. బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహణతోపాటు మిలిందా గేట్స్ సొంతంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విరాళాలతో సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళాభివృద్ధి ద్వారా కుటుంబాల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా సమాజాభివృద్ధి సిద్ధిస్తుందని చెబుతారామె.మిలిందా గేట్స్ యూఎస్‌లోని డ్యూక్స్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ చేశారు. ఒక దశాబ్దం పాటు తన కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టారామె. ఇప్పుడు తన పూర్తి సమయాన్ని కుటుంబం, సమాజ సేవ కోసం కేటాయించారు. -
ధ్యానం అనే జ్ఞానాన్ని అందరికి పంచాలి
సాక్షి, విజయవాడ: ధ్యానంపై మహిళలు శ్రద్ధ చూపాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘విద్వత్ మహిళా సమ్మేళనం-2019’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒక పక్క కుటుంబం, మరోవైపు ఉద్యోగాలు చేస్తూ మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం తోడ్పడుతుందన్నారు. ధ్యానం చేసేవారు ఓర్పుతో ఉంటారని చెప్పారు. యోగా,ధ్యానం.. మనలో ప్రకృతి కల్పించిన శక్తిని బయటకు తీసుకువస్తాయని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయని..ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. భారతీయ సంస్కృతిలో ఉన్న ధ్యానం అందరికి ఆరోగ్యదాయకం అని పేర్కొన్నారు. ధ్యానం అనే జ్ఞానాన్ని అందరికి పంచాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ అధినేత్రి రాధారాణి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ విద్యాకన్నా తదితరులు పాల్గొన్నారు. -
మలేసియాలో ఘనంగా ‘మహిళా సదస్సు
కౌలాలంపూర్: మలేసియా తెలుగు సంఘం, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంస్థల ఆధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు మహిళా సదస్సు’ ఘనంగా నిర్వహించారు. కౌలాలంపూర్ సమీపంలోని సుబాంగ్‌జయలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు పది దేశాల నుంచి తెలు గు మహిళా ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సదస్సులో అమెరికాలోని కీ సాఫ్ట్వేర్ అధినేత దూదిపాల జ్యోతిరెడ్డికి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందజేశారు. ఇదే కార్యక్రమంలో కోడూరు హరినారాయణరెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం అందించారు. వీరితోపాటు కోమల్‌రాణి, పద్మిని, జ్యోత్స్న, అన్నపూర్ణ, కొత్త కృష్ణవేణి తదితరులకు ‘మహిళా శిరోమణి’ పురస్కారాలను అందించారు. సదస్సులో భాగంగా పలువురు మహిళలు ప్రసంగిం చారు. మహిళలు ఒత్తిడిని జయించడం ఎలా? అనే అంశంపై డాక్టర్ మధురిమారెడ్డి, మహిళా సాధికారత గురించి డాక్టర్ రోజీ గుండ్ర, మలేసియాలో తెలుగు మహిళా వికాసంపై రేఖ, భారత్‌లో సాంప్రదాయ ఆలయాల విశిష్టత గురించి ఉజ్జయినీ మహం కాళి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ తదితరులు ప్రసంగించారు. సదస్సులో అచ్చయ్య కుమార్‌రావు, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తణుకులో మహిళా సదస్సు
పశ్చిమగోదావరి, తణుకు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తణుకులో శనివారం నిర్వహించనున్న జిల్లా మహిళా సదస్సులో పాల్గొంటారని ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కారుమూరివెంకట నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 2.30 గంటలకు సదస్సు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సభాస్థలి వద్ద పనులను కారుమూరి స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ ఛైర్మన్ బలగం సీతారామం, పార్టీ నాయకులు ఉన్నారు.సదస్సులో పాల్గొన్న అనంతరం ఆర్కే రోజా సాయంత్రం 6 గంటలకు తణుకు క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి విజయవాడ బయల్దేరి వెళతారు. సదస్సుకు భారీగా తరలిరండి అత్తిలి: తణుకు పట్టణంలో జరిగే జిల్లా స్థాయి మహిళా సదస్సుకు పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబీబుద్దీన్ కోరారు. -
రోజాను అడ్డుకోవడం సరికాదు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: అమరావతిలో జరుగుతున్న మహిళా సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్న ఏపీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం సరికాదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మహిళా సాధికారత పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం ప్రచారం, ఓట్ల కోసమే చంద్రబాబు ఇలాంటి సదస్సు నిర్వహించుకుంటున్నారన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్న ఎంపీ కవిత, రాష్ట్రంలో తన తండ్రి కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానమెందుకు లేదో చెప్పాలన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పక్క రాష్ట్రంలోని కేబినెట్లో మహిళలు లేరనే విషయం తెలియదా అని ప్రశ్నించారు.