సాక్షి, విజయవాడ: ధ్యానంపై మహిళలు శ్రద్ధ చూపాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘విద్వత్ మహిళా సమ్మేళనం-2019’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒక పక్క కుటుంబం, మరోవైపు ఉద్యోగాలు చేస్తూ మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం తోడ్పడుతుందన్నారు. ధ్యానం చేసేవారు ఓర్పుతో ఉంటారని చెప్పారు.
యోగా,ధ్యానం.. మనలో ప్రకృతి కల్పించిన శక్తిని బయటకు తీసుకువస్తాయని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయని..ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. భారతీయ సంస్కృతిలో ఉన్న ధ్యానం అందరికి ఆరోగ్యదాయకం అని పేర్కొన్నారు. ధ్యానం అనే జ్ఞానాన్ని అందరికి పంచాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ అధినేత్రి రాధారాణి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ విద్యాకన్నా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment