మాజీ ప్రధాని దేవెగౌడ
అంబరీష్, సుమలతకు ఎన్టీఆర్ పురస్కారం అందజేత
బనశంకరి (బెంగళూరు): తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మహోన్నత వ్యక్తి అని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కొనియాడారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో కర్ణాటక తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కన్నడ రెబల్ స్టార్, కర్ణాటక రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్, సుమలత దంపతులకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చిత్ర రంగంలోనే కాక రాజకీయాల్లో ప్రవేశించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి తెలుగు జాతి ప్రతిష్టను ఇనుమడింప చేశారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అప్పట్లోనే ఇవ్వాల్సి ఉండేదన్నారు. అంబరీష్ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ పేరుతో జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
బెంగళూరు నగరంలో తెలుగు అకాడమీ భవన నిర్మాణానికిప్రభుత్వం స్థలం కేటాయించాలని కర్ణాటక తెలుగు అకాడమీ సభ్యులు కోరగా.. ప్రభుత్వంతో చర్చిస్తానని మంత్రి అంబరీష్ హామీ ఇచ్చారు. కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు ఆర్‌వీ హరీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, సుమలత, రాధాకృష్ణ రాజు, మాజీ మంత్రి ఎం.రఘుపతి, ఎమ్మెల్యే గోపాలయ్య, బీబీఎంపీ విపక్ష నేత పద్మనాభరెడ్డి, గారెపాటి రామకృష్ణ, బలుసు శ్రీనివాసరావు, ఆర్.ఉమాపతి నాయుడు, శ్రీనివాసయ్య, మంజులనాయుడు, గణేష్‌శంకర్, హెచ్‌ఎన్ మంజునాథ్ పాల్గొన్నారు.