శక్తి స్వరూపం
జగన్మాత ఆదిపరాశక్తి. శక్తిస్వరూపిణి. చెడుపై మంచి సాధించే అంతిమ విజయానికి ప్రతీక. అమ్మను నమ్ముకుంటే అపజయం ఉండదని భక్తుల విశ్వాసం. సంస్కృతికి స్త్రీయే ఆధారం. సెలవుల్లో ఉండే పిల్లలూ... ఇళ్లకు వచ్చే బంధువులూ... బంధాలు బలపడే ఈ దసరా పండుగలో లోగిళ్లు కళకళలాడే ఈ శరన్నవ వేడుకలలో స్త్రీయే కీలక పాత్రధారి. స్త్రీ విజయమే కుటుంబ విజయమై తెలుగు సంస్కృతి విరాజిల్లాలని అందుకు ఆ శక్తిస్వరూపిణి ఆశీస్సు ఎల్లెడలా ఉండాలని అశిస్తూ
ఈ దశ అలంకరణల ప్రత్యేకం...
1 శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (13వ తేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి) - నైవేద్యం: చక్కెర పొంగలి అమ్మవారి తొలిరోజు అలంకరణ ఇది. స్వర్ణకవచంతో అత్యంత విశిష్టమైన రూపంతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే అష్టకష్టాలు తీరడమే కాకుండా, సమస్త దారిద్య్రబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
2 శ్రీ బాలా త్రిపురసుందరీదేవి (14వ తేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి-మిగులు) నైవేద్యం: కట్టెపొంగలి రెండోరోజు అభయముద్రతో బాలా త్రిపురసుందరీదేవి అలంకారం. ఆ రూపంలో ఉన్న బాలా త్రిపురసుందరీదేవిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగడమే కాకుండా, సత్సంతానం కలుగుతుందని ప్రతీతి.
3 శ్రీ గాయత్రీదేవి (15వ తేది ఆశ్వయుజ శుద్ధ్ద విదియ) నైవేద్యం: పులిహోర మూడో రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు.
4 శ్రీ మహాలక్ష్మి (16వ తేది ఆశ్వయుజ శుద్ధ తదియ) నైవేద్యం: రవ్వకేసరి శ్రీమహాలక్ష్మి అలంకరణ. మూడు శక్తులలో ఒకటైన శ్రీమహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
5 శ్రీ అన్నపూర్ణాదేవి (17వ తేది ఆశ్వయుజ శుద్ధ చవితి) నైవేద్యం: కొబ్బరి అన్నం ఐదో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం. సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని, పూజిస్తే ఆకలి దప్పుల వంటి బాధలు ఉండవు.
6 శ్రీ లలితా త్రిపురసుందరీదేవి (18వ తేది ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యం: అల్లంగారెలు ఆరో రోజు లలితా త్రిపురసుందరీదేవి అలంకారం. లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా దర్శనమిచ్చే లలితా త్రిపురసుందరిని కొలిస్తే సమస్త దుఃఖాలు తొలగుతాయి.
7 శ్రీ సరస్వతీదేవి (19వ తేది ఆశ్వయుజ శుద్ధ షష్టి) నైవేద్యం: దద్ధోజనం చదువుల తల్లి సరస్వతీదేవి రూపం. బుద్ధిప్రదాయిని అయిన సరస్వతీ రూపంలో అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
8 శ్రీ దుర్గాదేవి (20వ తేది ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నైవేద్యం: కదంబం ఎనిమిదో రోజు అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. సింహవాహనంపై మహిషాసురుడిని వధిస్తున్న దుర్గాదేవి రూపాన్ని ఆరాధిస్తే శత్రుబాధలు నశిస్తాయి. సమస్త దుర్గతులు
దూరమవుతాయని ప్రతీతి.
9 శ్రీ మహిషాసురమర్దిని దేవి (21వ తేది ఆశ్వయుజ శుద్ధ అష్టమి) నైవేద్యం: బెల్లమన్నం తొమ్మిదోరోజు మహిషాసురమర్దిని.
అష్టభుజాలతో ఒకచేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై మహిషుడిని సంహరించిన రూపంలోని దేవిని కొలిస్తే సమస్త భయాలు తొలగి, ధైర్య స్థైర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
10 శ్రీ రాజరాజేశ్వరీదేవి (22వ తేది ఆశ్వయుజ శుద్ధ నవమి, దశమి) - నైవేద్యం: పరమాన్నం పదోరోజు విజయదశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తుంది. షోడశ విద్యాస్వరూపిణి, శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన దేవికి విజయ అని కూడా పేరు ఉంది. రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే అన్నింటా విజయాలు కలుగుతాయని ప్రతీతి.
దేవీ నవరాత్రులు
అమ్మ... అమ్మలగన్న యమ్మ... ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని ఆరాధించే నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి. ఆ రోజు నుంచే శరదృతువు ప్రారంభం కావడంతో వీటిని శరన్నవరాత్రులంటారు. పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పదోరోజైన దశమి నాడు దసరా పండుగ జరుపుకొంటారు. దీనినే విజయదశమి అంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజు కావడం వల్ల విజయదశమి జరుపుకొనే ఆచారం వచ్చినట్లు చెబుతారు.
ఇంద్ర కీలాద్రి స్థలపురాణం
తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన అమ్మవారి క్షేత్రం విజయవాడలోని కనకదుర్గ ఆలయం. ఇంద్రకీలాద్రిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి అయిన జగన్మాత... కనకదుర్గగా వెలసింది. ఇక్కడ దసరా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పూర్వం కీలుడనే యక్షుడు తపస్సు చేసి, పర్వతరూపంలో ఉన్న తన హృదయ కుహరంలో నివసించమని దుర్గాదేవిని కోరడంతో అమ్మవారు కీలాద్రిపై స్వయంభువుగా వెలిసింది. అప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి అమ్మవారిని పూజించారు. నాటి నుంచి ఇది ఇంద్రకీలాద్రిగా ప్రాశస్త్యం పొందింది. రాక్షసులను సంహరించిన అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఉగ్రరూపిణిగా ఉండేది. అద్వైత మత వ్యవస్థాపకుడైన ఆదిశంకరాచార్యులు ఇక్కడ అమ్మవారిని దర్శించి, ఆమె మహోగ్రశక్తులను శ్రీచక్రంలో నిక్షిప్తం చేసి, అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రస్థాపన చేశారు. అప్పటి నుంచి అమ్మవారు శాంతరూపిణిగా భక్తులకు దర్శనమిస్తోంది.
దుర్గమ్మ కనక కాంతులు
బెజవాడ దుర్గమ్మగా జనసామాన్యంలో ప్రసిద్ధి పొందిన కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై నిత్యం కనక కాంతులతో భక్తులకు దర్శనమిస్తోంది. కనకదుర్గమ్మకు వజ్ర వైడూర్యాదులు పొదిగిన బంగారు వెండి ఆభరణాలతో పాటు ఆరు బంగారు కిరీటాలు ఉన్నాయి. వీటిలో రెండు కిరీటాలను నిత్యం వినియోగిస్తుంటే, మిగిలిన నాలుగింటిని పండుగ రోజుల్లో అలంకరిస్తారు. మకరతోరణం, నానుతాడు, మంగళసూత్రాలు, కంఠాభరణం (అష్టోత్తరార్చన మాల), నల్లపూసల గొలుసు, జడ, బొట్టు, బులాకీ, నత్తు, సూర్యచంద్రులు, శంఖుచక్రాలు, పాదాలు... ఇవన్నీ అమ్మవారికి గల కనకాభరణాలే. ఇవి కాకుండా, స్వర్ణకవచం అమ్మవారికి అదనపు ఆకర్షణగా ఉంటోంది. ఆలయ అర్చకులు ప్రతి గురువారం 108 స్వర్ణపుష్పాలతో అమ్మవారిని అర్చిస్తారు.
భద్రకాళి ఆలయంలో...
వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. మొదటి రోజు ఉదయం ధ్వజారోహణంతో నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి. చివరి రోజు అంటే దశమి రోజున ఆలయం వద్దనున్న సరోవరంలో భద్రకాళి, భద్రేశ్వరుల తెప్పోత్సవంతో నవరాత్రి వేడుకలు ముగుస్తాయి. హన్మకొండ-వరంగల్ నడుమ కొండపై ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 625 ప్రాంతంలో చాళుక్య రాజు రెండవ పులకేశి నిర్మించాడని ప్రతీతి. చాళుక్యుల శిల్పకళా రీతికి ఈ ఆలయం అద్దం పడుతుంది. ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
మహిషాసురమర్దిని
బ్రహ్మ వల్ల వరాలు పొందిన మహిషాసురుడు తన అనుచరగణమైన రాక్షసులతో కలసి ముల్లోకాలలో అల్లకల్లోలం సృష్టించసాగాడు. మహిషుడిని అంతమొందించడానికి ఆదిపరాశక్తి తనలోని వివిధ అంశలను ఒక్కటిగా చేర్చి, జగదంబగా అవతరించింది. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు సహా దేవతలందరూ త్రిశూలం, శారఙ్గం, ధనుస్సు, ఖడ్గం, చక్రం, వజ్రం, పాశం, దండం, తోమరం, గద, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, రౌద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం వంటి ఆయుధాలను ఆమెకు అందించారు. ఆ ఆయుధాలను ధరించిన అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి, చండి, చాముండి, కాళి, బగళ, కామాక్షి, ఛిన్నమస్తా, బాల, త్రిపుర, తారిణి వంటి వివిధ అవతారాలను దాల్చి మహిషుడిని, అతడి అనుచరులైన రాక్షసులను సంహరించింది. దుర్గముడనే రాక్షసుడిని సంహరించడం వల్ల జగదంబకు దుర్గ అనే పేరు వచ్చింది. మహిషుడిని సంహరించినందున ఆమె మహిషాసురమర్దినిగా ప్రఖ్యాతి పొందింది.
శక్తిరూపేణ సంస్థితా...
‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా’ అని జగజ్జననిని ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులలో శక్తిపూజ ప్రధానం. దేవి దయాతత్వాన్ని అంబ అని, అతిలోక సౌందర్యాన్ని త్రిపుర సుందరి అని, రౌద్ర రూపాన్ని కాళి అని ఉపాసిస్తారు. మహిషాసురుడిని వధించిన అమ్మ దుర్గాదేవిగా పూజలందుకుంటోంది. ‘దుర్గే దుర్గతి నాశిని’... అంటే దుర్గతులను నశింపజేసేది కనుక ఆమెకు దుర్గ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి. జ్ఞాన పరిమళాలను ఆమె నిరంతరం వెదజల్లుతూనే ఉంటుంది. అందువల్ల అమ్మవారికి జ్ఞానప్రసూనాంబ అనే పేరూ ఉంది.
స్వర్ణ కవచాలంకరణ ప్రత్యేకత
శరన్నవరాత్రి వేడుకల్లో తొలిరోజు అమ్మవారిని స్వర్ణకవచంతో అలంకరిస్తారు. స్వర్ణకవచాలంకృత రూపంలో కనకదుర్గమ్మను ఆరాధించడం వెనుక ఒక గాథ ఉంది. పూర్వం మాధవవర్మ అనే రాజు విజయవాటికాపురిని ధర్మబద్ధంగా పాలించేవాడు. ఆయన అమ్మవారికి పరమభక్తుడు. ఒకనాడు ఆయన కుమారుడు నగర సందర్శనానికి బయలుదేరినప్పుడు, ఒక బాలుడు ప్రమాదవశాత్తు అతడి రథచక్రం కింద పడి మరణించాడు. బాలుడి తల్లిదండ్రులు రాజును కలుసుకుని, న్యాయభిక్ష కోరారు. తన కుమారుడే వారి దుర్గతికి కారణమని తెలుసుకున్న రాజు మాధవవర్మ తన కుమారుడికి మరణదండన విధించాడు. రాజు ధర్మనిరతికి మెచ్చిన అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడమే కాకుండా, విజయవాటికాపురిలో కొన్ని గంటల సేపు కనకవర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి అమ్మవారు కనకదుర్గగా పూజలందుకుంటోంది. కనకవర్షం కురిపించిన అమ్మవారికి నవరాత్రి వేడుకల్లో తొలిరోజున స్వర్ణకవచాలంకరణ చేయడం కూడా అప్పటి నుంచే ఆనవాయితీగా మారింది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దారిద్య్రాలూ నశిస్తాయని ప్రతీతి.
వివిధ ప్రాంతాలలో నవరాత్రులు
దేవీ నవరాత్రులను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రీతుల్లో జరుపుకొంటారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, మైసూరు ప్రాంతాలలో శరన్నవరాత్రులను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా గల శక్తి పీఠాలు నవరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. భారతదేశంలోనే కాకుండా, హిందువులు ఎక్కువగా ఉండే నేపాల్, మారిషస్ వంటి దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. దాదాపు అన్నిచోట్ల దసరా రోజున ఆయుధపూజలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల నవరాత్రుల చివరిరోజున రావణదహనాన్ని కూడా నిర్వహిస్తారు. మహర్నవమి రోజున శ్రీరాముడి చేతిలో రావణ సంహారం జరిగింది ఈరోజే అని భావిస్తారు. అయితే, పదితలలు గల రాక్షసరాజైన రావణుడిని దహనం చేయడం వెనుక ఒక ఆధ్యాత్మిక మర్మం ఉందని చెబుతారు. రావణుడి పది తలలూ మనలోని పది అవలక్షణాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు, స్వార్థం, అన్యాయం, అమానవత్వం, అహంకారాలకు ప్రతీకలని అంటారు. పాఢ్యమి నుంచి దశమి వరకు జరిగే ఈ వేడుకల్లో రావణుడి పది తలల వంటి ఈ పది అవలక్షణాలను మనలోంచి తుడిచిపెట్టేయడానికి సంకేతంగానే రావణదహనం తంతును జరుపుతారని చెబుతారు.
చివరి రోజైన దసరా పండుగ నాడు కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి హంసవాహనంపై కృష్ణానదిలో నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి సంకేతంగా హంసవాహనాన్ని మూడుసార్లు నదిలో తిప్పుతారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవంతోనే నవరాత్రి వేడుకలు ముగుస్తాయి.