లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం.
శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ
సర్వశక్తి సమన్వితే!
భయేభ్యః ప్రాహివో దేవి
దుర్గేదేవి నమోస్తుతే!!
భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు.
ఫలమ్: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు.
నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం
మహిషాసురమర్దిని
బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి.
శ్లోకం
దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
భావం: అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతిని, భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను.
నివేదన: నువ్వులు, బెల్లమన్నం
ఫలమ్: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి.