పండగ
దుష్ట రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చని చెప్పే పండుగ ఇది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి, ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే.
ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం
దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అదీ వీలుకాని వారు మూడు రోజులు, అదీ కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి ఆశీస్సులందుకోవాలి.
చెడుపై మంచి సాధించిన విజయం
దానవత్వంపై దైవత్వం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలోనే ఉన్నారు. మనలోని దుర్గుణాతో పోరాడి విజయం సాధిద్దాం.
జమ్మిని ఎందుకు పూజిస్తారు?
శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు విజయ సోపానాలని నమ్మకం. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. అందుకే
శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మిని బంగారం అంటారు. జమ్మి బంగారాన్ని అందరికీ పంచి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే... అమ్మవారి విజయవార్తను దేవతలు కొందరు పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చి చాటిచెప్పారట. అందుకే ఆ రోజు పాలపిట్ట దర్శనం శుభప్రదం.
రావణ దహనం ఎందుకు చేస్తారు?
మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలి, విజయం సాధించిన దినం విజయ దశమే. రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను టపాసులతో పేల్చేడం లేదా దహనం చేయడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు.