శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బలద పంచాయతీ కౌశల్యాపురం గ్రామమిది. ఈ గ్రామంలో కనిపిస్తున్న వీధిని ఒకసారి గమనించండి. వీధిలో ఉత్తరం వైపు ఉన్న ఇళ్లన్నీ ఒడిశావి కాగా, దక్షిణం వైపు ఉన్న ఇళ్లు ఆంధ్రావి. ఒకే గ్రామంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఆంధ్రా ఒడిశా కట్టుబాట్లు మిళితమై ఉంటాయి.
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ప్రాంతాల కలయికతో ఉన్న ప్రాంతమిది. మెళియాపుట్టి మండలంలోని రట్టిణి గ్రామమిది. ఇక్కడ ఎడమ వైపు ఇళ్లన్నీ ఒడిశా పరిధిలో ఉన్నాయి. కుడివైపు ఉన్న ఇళ్లన్నీ ఆంధ్రా పరిధిలోనివి. తెలుగు సంప్రదాయాలు, ఒరియా సంప్రదాయాలు కలగలిపి ఉన్న గ్రామంగా ప్రత్యేకతను సంతరించుకుంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెండు రాష్ట్రాల సరిహద్దును పంచుకుని ఉన్న ఈ గ్రామాలు సంప్రదాయాల్లో కూడా భిన్నత్వాన్ని చూపిస్తున్నాయి. పెళ్లిళ్లు, పూజల్లో తెలుగు, ఒరియా సంప్రదాయాలు కలగలిపి కనిపిస్తుంటాయి. ఆంధ్రాలో ఉన్న దేవాలయాలను ఈ ప్రాంత ఒరియా వాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఆంధ్రా ప్రజలు ఒరియా దేవాలయాలకు వెళ్తుంటారు. ఒరియా సంబంధించిన పండగలు చేసుకుంటారు. రెండు రాష్ట్రా ల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కలయికతో అన్నదమ్ముల్లా అక్కడి ప్రజలు ఉంటున్నారు.
పూజల్లో ప్రత్యేకతలు
రట్టిణిలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర ఆలయానికి ఒడిశా వాసులు చైత్రమాసంలోని మొదటి నాలుగు మంగళవారాలు వస్తుంటారు. అదే ఆంధ్రాలో ఉన్న వారు ఎక్కువగా వైశాఖమాసంలో నాలుగు వారాల్లో మంగళ, ఆదివారాలలో వచ్చి పూజలు చేస్తుంటారు. ఆంధ్రా పరిధిలో ఉన్న వాళ్లు శుక్రవారం లక్ష్మిదేవిని పూజిస్తారు. కానీ ఒడిశా వారు గురువారం లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. దీంతో ఒకే గ్రామ పరిధిలో గురువారం, శుక్రవారం రెండు రోజులు లక్ష్మీపూజలు జరుగుతాయి. ఒడిశా వాళ్లు గౌరీ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసంగా భావించి నెల రోజులపాటు శివుడిని పూజిస్తుంటారు. ఆంధ్రా వాళ్లు దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీకమాసంగా పూజిస్తుంటారు.
ఒడిశా సంప్రదాయానికి చెందిన వారంతా ప్రత్యేకంగా రాధాకృష్ణులను పూజిస్తారు. రాధామాధవస్వామి ఆరాధనతో 56 రకాల పిండివంటలతో భోగారాధన చేస్తారు. వీటితో పాటు శివుడు, ఇతర దేవుళ్లను పూజిస్తారు. ఎక్కువగా ఒడిశాలో అమావాస్య నుంచి అ మావాస్య వరకు మంచిరోజులుగా భావించి పూజ లు, శుభకార్యాలు చేస్తుంటారు. ఆంధ్రాలో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మంచిరోజులుగా భావించి పూజలు, శుభకార్యాలు చేస్తుంటారు. ఫలితంగా ఈ గ్రామాల్లో అమావాస్య, పౌర్ణమి వారాలు నిత్యం పూజలు, శుభకార్యాలు కనిపిస్తుంటాయి. ఈ విధంగా ఒకే గ్రామంలో భిన్న ఆధ్యాత్మిక సంస్కృతి కనిపిస్తుంది.
కౌశల్యాపురంలో భూ వివాదం
కౌశల్యాపురంలో 250 కుటుంబాల మధ్య భూ వివాదాలు 1969 నుంచి ఉన్నాయి. 37 ఎకరాలు పంట భూమి వివాదంలో ఉంది. భూములు వివాదంలో ఉన్నందున భూములు శిస్తులు చెల్లించడంలో రైతులు రెండు రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో ఇబ్బంది పడుతున్నారు. వివాదంలో ఉన్న భూము ల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న పక్కా ఇళ్ల నిర్మాణానికి ఒడిశా అధికారులు అడ్డుతగులుతున్నారు.
కలిసిమెలిసి
రట్టిణి, కౌశల్యాపురంలో ఆంధ్రా, ఒడిశా వాసులు పాఠశాలలు, దేవాలయాలకు కలిసి వెళ్తుంటారు. పండగలు కూడా కలిసి చేసుకుంటారు. పెళ్లిళ్లు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. వీధులే మారడంతో తమ్ముడు ఒడిశా పరిధిలో ఉంటే, అన్న ఆంధ్రా పరిధిలో ఉంటాడు. కూతుళ్ల పరిస్థితి కూడా అంతే. తండ్రి ఆంధ్రాలో ఉంటే...కూతురు ఒడిశా పరిధిలో ఉంటుంది. ఈ గ్రామాలకు చెందిన వారంతా ఒకే శ్మశానం వినియోగిస్తున్నారు. ఒడిశాకు చెందిన చెందిన పిల్లలు ఒరియా పాఠశాలకు వెళ్తా రు. ఆంధ్రాకు చెందిన పిల్లలు తెలుగు పాఠశాలలకు వెళ్తున్నారు. రెండింటిలోనూ తెలుగు, ఒరియా బోధన ఉంది.
బయట వారు చెబితేనే..
ఒడిశా, ఆంధ్రా తేడా లేకుండా కలిసి మెలిసి ఉంటాం. ఒకే ఊరులో ఉండడం వల్ల మాకు రెండు రాష్ట్రాల ప్రజలమని అనిపించదు. బయట వారు వచ్చి చెబితే గానీ మాకు తెలియదు.
– ప్రభాస్‌దాస్, రట్టిణి గ్రామం, మెళియాపుట్టి మండలం
ఒరియా, తెలుగు బోధన
ఒరియా, తెలుగు కలిపి ఒకే పాఠశాలలోనే చెబుతున్నాం. ఇద్దరు ఒరి యా ఉపాధ్యాయులు, ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేస్తున్నారు. పాఠశాలల అభివృద్ధి ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ ఒరియాకు తల్లిదండ్రులు ముందు ప్రాధాన్యత ఇస్తుంటారు.
– జి.అప్పలస్వామి, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీ పాఠశాల రట్టిణి
Comments
Please login to add a commentAdd a comment