సంస్కృతికి విరుద్ధంగా స్త్రీ వస్త్రధారణ | SP Balasubrahmanyam Worried About Telugu Culture | Sakshi
Sakshi News home page

కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలు

Published Mon, Jan 28 2019 11:29 AM | Last Updated on Mon, Jan 28 2019 2:00 PM

SP Balasubrahmanyam Worried About Telugu Culture - Sakshi

చిత్తూరు, తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: నేటి ఆధునిక సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, విలువలు దిగజారుతున్నాయని గాన గంధర్వుడు, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరిగిన హరికథా వైభవోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హరికథకులు అవధానులతో సమానమని కొనియాడారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో జానపదానికి చోటు కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఇదే రీతిలో హరికథకులకు సైతం పద్మ అవార్డులు ఇవ్వాలన్నారు.

ప్రచార సాధనాలు లేని రోజుల్లో  ప్రజా సమస్యలనే కథా వస్తువుగా మార్చుకొని ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఘనత హరికథకులకు దక్కుతుందన్నారు. అలాంటి కళను ఆదరించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నేటి సమాజంలో స్త్రీ అశ్లీలత, అసహ్యమైన వస్త్రధారణతో కనిపించడం మన సంస్కృతా అని ప్రశ్నించారు. గత చిత్రాల్లో సావిత్రిలాంటి నటీమణులు కట్టుబొట్టు తీరును ప్రజలు ఆదరించి అభిమానించ లేదా అని పేర్కొన్నారు. అలాంటి సంస్కృతి నేడు మంటగలిచిందని వాపోయారు. భారత సంస్కృతిని ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయన్నారు. తెలుగు భాషపై తెలుగు వారిలోనే మక్కువ తగ్గిందని వాపోయారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరిగిన హరికథా వైభవోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ప్రపంచ దేశాల్లోని భాష పట్ల గర్వం, అభిలాష, మక్కువ తక్కువగా ఉండేది తెలుగు వారిలోనేనని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలకు దర్పణం పట్టే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రాజకీయంలో నేడు స్వార్థ రాజకీయాలు చోటు చేసుకోవడం మన దౌర్భాగ్యమన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారడం సమంజసమా అని ప్రశ్నించారు. గెలిపించిన ప్రజల ఇష్టానికి విరుద్ధంగా తమ స్వార్థం కోసం పార్టీలు మారడం విచాకరమన్నారు. హత్యలు, మానభంగాలు చేసిన వ్యక్తులు నేడు మంత్రులు, రాజనీతిజ్ఞులుగా వెలుగొందుతుండడం దౌర్భాగ్యమన్నారు. తిరుపతిలోని ఎంఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే లేడని దుయ్యబట్టారు. తాను తిరుపతిలో జన్మించి ఉంటే ప్రతి రోజూ విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు చేసేవాడినని తెలిపారు.

తన తండ్రి హరికథా పండితారాద్యులు సాంబమూర్తి సంస్మరణార్థం ఏర్పాటు చేసే హరికథా వైభవోత్సవాలకు ప్రతి ఏటా రూ.లక్ష ఇస్తానని ప్రకటించారు. ఎస్పీ బాలు దంపతులతో పాటు కుమారుడు చరణ్‌ హరికథా గానామృతాన్ని విన్నారు. అనంతరం కుప్పం వాస్తవ్యులు హరికథా కళాకారులు కె.కేశవమూర్తి భాగవతార్, సీతారామయ్య భాగవతార్, మృదంగం విద్వాన్‌ అనేకల్‌ క్రిష్ణప్పకు బంగారు పతకాలు, హరికథా విద్వన్మణి బిరుదులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విశ్వనాథం, మహోపాధ్యాయ సముద్రాల లక్ష్మణయ్య, కందారపు మురళి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారుల యూనియన్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ భాగవతార్, కార్యదర్శి గంగులప్ప, పెద్ద సంఖ్యలో కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement