కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతంలో కన్నడ సంప్రదాయలు వెల్లివిరుస్తున్నాయి. పర్వదినాల్లో, వేడుకల్లో, కల్యాణోత్సవాల్లో కర్ణాటక ఆచారాలు సందడి చేస్తున్నాయి. కళారూపాల్లో కూడా కన్నడ శోభ కనిపిస్తోంది. హోటళ్లలో కర్ణాటక రుచులను ఇక్కడి ప్రజలు ఆస్వాదిస్తున్నారు.
మంత్రాలయం: జిల్లా పశ్చిమప్రాంతంలోని తెలుగు లోగిళ్లలో కర్ణాటక సంస్కృతి విరివిగా కనిపిస్తోంది. చిప్పగిరి, హొళగుంద, హాలహర్వి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కౌతాళం, కోసిగి, మంత్రాలయం ప్రాంతాల్లో ఎక్కువగా కర్ణాటక సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ప్రధానంగా అక్షయ తృతీయ రోజున బసవ జయంతి పర్వదినం జరుపుకుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదోని డివిజన్‌లో ఈ ఏడాది ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా శ్రీగురు బసవేశ్వరుడికి విశిష్టపూజలు చేసి, గ్రామాల్లోని వృషభాలకు అలంకరణలు చేసి ఊరేగించారు. వీరభద్ర వేషధారణలతో ఖడ్గాలు చదవడం, సంప్రదాయ నృత్యాలు చేయడం వంటి ఆచారాలను పాటించారు.
యల్లె అమావాస్య
కర్ణాటక నుంచి సంక్రమించిన మరో పండుగ యల్లె అమావాస్య. జనవరి నెలలో శివరాత్రి అమావాస్య ముందు దీనిని నిర్వహిస్తారు. పండుగ రోజు సజ్జపిండి, బెల్లం ఉండలతో వండిన వంటలను పొలాలకు తీసుకెళ్లి, పంచ పాండవులకు పూజలు నిర్వహించి పొలం చుట్టూ పొలి చల్లుతారు. అలాగే గురువుల పరంపరలో భాగంగా ఇక్కడి ప్రాంతంలో కోసిగి సిద్ధరూఢస్వామి, నదిచాగిలో తొంతరాధ్య, హాల్విలో మహంతేష్‌స్వామి, అర్లబండ కృష్ణావధూత ఉత్సవాలు చేసుకుంటారు. కౌతాళం మండలం హాల్వి, కోసిగి మండల కేంద్రం, పెద్దకడబూరు గ్రామాల్లో సిద్ధరూఢ స్వామి జాతరలు ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తారు. మఠం పీఠాధిపతుల ఆజ్ఞానుసారం శుభకార్యాలు చేస్తారు.
కర్ణాటక తరహాలో పెళ్లి తంతు
సరిహద్దు గ్రామాల్లో పెళ్లి తంతు సైతం కర్ణాటక సంప్రదాయంలో జరుగుతోంది. వీరశైవ లింగాయతీ వివాహాల్లో ముహూర్తం వేళ ప్రత్యేక ఉత్సవం చేసుకుంటారు. వీరభద్ర స్వామి వేషధారణలో గురువు బోరాబిందె మహత్యం వివరిస్తారు. ఉగ్గులం తంతులో భాగంగా బంధువులు నాలుక, పెదవులు, కనురెప్పలు, చేతులు, వీపు, కాళ్లకు ఇనుప శూలాలు గుచ్చుకుని ఊరేగుతారు. పెళ్లి పత్రికలు సైతం కన్నడ భాషలోనే ముద్రించుకుంటున్నారు.
నాటకాల్లోనూ..
శ్రీకృష్ణరాయబారం, చింతామణి, హరిశ్చంద్ర నాటకాలకు బదులుగా పండుగలకు ఈ ప్రాంతంలో కన్నడ భాషలో సాగే బయలు నాటకాలు వేస్తారు. సంగీత కచేరీల్లో భాగంగా గురువులు, అవధూతలు రచించిన తత్వాలతో కూడిన భజనలు చేస్తారు. కర్ణాటక కళకారుడు దాదాపీర్‌ను ఆదర్శంగా తీసుకుని కచేరీలు చేస్తారు. రచ్చమర్రి నరసింహులు, మాలపల్లి ఈరన్న, రామాంజినేయులు ఇలా 20 మందికి పైగా కళకారులు ఉన్నారు. యూట్యూబ్‌ల్లో వీరి సంగీత తత్వాలాపనలకు మంచి గుర్తింపు ఉంది. గ్రామాల పేర్లు సైతం కర్ణాటక అర్థంలోనే పురుడోసుకున్నాయి. గ్రామాల చివర దిన్నె, హళ్లి (అగసలదిన్నె, చెట్నెహళ్లి) పదాలతో ముగియడం కర్ణాటక వారసత్వమే.
కన్నడ అభి‘రుచి’
సరిహద్దు గ్రామాల్లో ఎక్కువగా కర్ణాటక ఖానావళి, లింగాయతీ హోటళ్లు వెలిశాయి. ఈ హోటళ్లలో ఎక్కువ పచ్చి కూరగాయలు, ఉల్లికోడు, పుదీన, కొత్తమీర పదార్థాలతో జొన్న రొట్టెలు వడ్డిస్తారు. రొట్టెల్లోకి కుసుమలు, నువ్వులు, వేరుశనగ విత్తనాలు కారం పొడులు స్వీకరిస్తారు. అన్నంలోకి మిరియాల చారు, టమాటా చెట్నీ వడ్డిస్తారు. మాంసాహారాలకు పూర్తిగా దూరంగా హోటళ్ల నిర్వహణ సాగుతుంది.
సామూహిక వివాహాలు
అంపయ్య పున్నమితోపాటు బసవ జయంతికి సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. కౌతాళం మండలం ఉప్పరహాల్, కోసిగి మండలం కందకూరులో అంపయ్య పున్నమికి సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. ఒక్కటి కాబోతున్న కొత్త జంటలకు దుస్తులు, మంగళసూత్రాలు, పూలదండలు, భోజన వసతి ఆలయ కమిటీ సభ్యులు సమకూర్చుతారు.
Comments
Please login to add a commentAdd a comment