telugu dramas
-
సవాలుగా మారిన సరికొత్త నాటకం ‘నచికేత’
సవాళ్ళు ఎదురైనప్పుడే సృజనాత్మకత మరింత రాటుదేలుతుంది. నాటక రచయితగా మొదలై, సీరియల్స్ నుంచి సినిమా రచయితగా ఎదిగిన నాకు ఆ సంగతి అనుభవైకవేద్యం. ‘నరవాహనం’ నాటకం నుంచి ‘రంగమార్తాండ’ చిత్రం, తాజా ‘కన్నప్ప’ సినిమా వరకు రచనలో క్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడల్లా నాలోని రచయిత రాటుదేలడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. రంగస్థలంపై ఇటీవల నాకు అలాంటి ఓ కొత్త సవాలు – ‘నచికేత’ నాటకం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా, రసరంజని 31వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆచార్య కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ‘నచికేత’ నాటకాన్ని ప్రదర్శించాం. భారతీయ ఉపనిషతుల్లో సుప్రసిద్ధమైన కఠోపనిషత్తులోది నచికేతుడి కథ. సాక్షాత్తూ మృత్యుదేవత యముడే నచికేతుడికి బోధించిన మరణరహస్యం ఇందులోని ప్రధాన అంశం. ‘నచికేతుడి’ కథను నాటకంగా మలిస్తే బాగుంటుందనేది కోట్ల హనుమంతరావు ఆలోచన. ఆ ఆలోచన ఆయన నాతో పంచుకున్నప్పుడు ఉపనిషత్ రహస్యాన్ని నాటకంగా ఎలా మలచాలి అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై లోతుగా చర్చించాం. నాటక రచన ప్రయత్నంలో భాగంగా పలు పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టాను. మొదటగా రామకృష్ణమఠం వారు ప్రచురించిన స్వామి స్వరూపానంద గారి ‘ఉపనిషత్ కథలు’, ‘ఆర్ష విద్యాతరంగాలు’ ప్రచురణ, స్వామి పరమార్థనంద గారి కఠోపనిషత్తు, విఎస్ఆర్ మూర్తిగారి ‘ఉపనిషత్ సుధ’ చదవడం మొదలెట్టాను. ఉపనిషత్తులోని లోతైన విషయం అర్థమమయింది గానీ, దాన్ని ఎలా చెప్పాలో అంతుచిక్కలేదు. యథాతథంగా రాస్తే పండితులకూ, మేధావులకూ, కేవలం ఈ విషయంపై ఆసక్తిగలవారికి మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాయడం ఎలా అని ఆలోచించాం. అప్పటికీ నాటకీయంగా ఈ విషయం ఎలా అందించాలి అనే అంశంపై ఆలోచనలు కొలిక్కిరాలేదు. సంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తులు గురుశిష్య సంవాదరూపంలో వున్నాయి గనుక అదే పద్ధతిని అనుసరించి నాటక రచన చేస్తే, స్పష్టమైన అంశాలను సంభాషణలుగా రాస్తే నాటకీయత ఎలావున్నా విషయాన్ని సులభంగా అందించినట్టవుతుందని, గురువు - శిష్యుల ఫార్మెట్‌ని అనుసరించి ఈ నాటక రచన మొదలుపెట్టడం జరిగింది. అయితే, కేవలం సంభాషణలు మాత్రమే రాస్తే శ్రవ్య నాటికగా ఉంటుందేమోగానీ, దృశ్యనాటికగా ఎలా రక్తికడుతుంది? అదీ సంశయం. దాంతో, కచ్చితంగా దృశ్య రూపకంగా అందించాలని నిర్ణయించుకున్నాం. పదేపదే ఆ కథను చదివితే కొన్ని దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలకు పొందికైన రూపమివ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరో సందేహం వెంటాడింది. చాలా విషయాలు జటిలంగా ఉన్నప్పుడు నృత్యరూపకంగా అందిస్తే, కొన్ని హావభావాలను బాగా అందించే అవకాశం వస్తుందని నృత్యనాటిక రూపంలో మొదట రాశాను. దర్శకులు కోట్ల హనుమంతరావు అది చదివి బాగుందనుకున్నా, కేవలం నృత్యరూపకంగా అందిస్తే ‘నాటకీయత’ లోపించే ప్రమాదం ఉందంటూ నాటకంగా రాయమన్నారు. వెరసి, నృత్యరూపకంలో ఉన్న అంశాల్లో కొన్ని నాటకరూపంలోకీ వచ్చాయి. మళ్ళీ మరో సందేహం! నృత్యరూపకం, నాటకరూపం - రెండూ చదివాను. ఆ క్రమంలో ప్రస్తుత సమాజానికి ఈ కథ ద్వారా సందేశం ఏమైనా ఉందా అని ఆలోచనలో పడ్డాను. కేవలం సందేశాలకే నాటకాలు పరిమితం అయిపోవాలన్న భావన లేకపోయినా, ఉపనిషత్తు ఆధారంగా అందులోని కథను నాటకంగా రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందరో ఋషులు, దార్శనికులు అన్ని కాలాలలో దర్శించిన విశ్వజనీన సత్యాలకు నాటకరూప మిస్తున్నప్పుడు, దేశ కాలాతీతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉపనిషత్ సారాన్ని, వర్తమాన సమాజానికి అన్వయించే ప్రయత్నం చేస్తే వస్తుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపం ఇవ్వడానికి ప్రయత్నించాను. నృత్యరూపకాన్నీ, నాటకాన్నీ కలిపి, నాటకీయతను జోడించి రచించడం జరిగింది. చివరకు చిన్నచిన్న పాటలను, శ్లోకాలను కలిపి ‘నచికేత’ నాటకం రాయడం జరిగింది. ఒక కొత్త నాటకం రచన, ప్రొడక్షన్ వెనుక ఇంత కథ నడించింది. మరో విషయం... ఈ నాటకం తయారు అవుతున్నప్పుడు స్వామి కృష్ణానంద ‘కామెంట్రీ ఆన్ కఠోపనిషత్’, వేద సమితి ఉపనిషత్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎండ్ ఉపనిషత్ పుస్తకాలను కూడా చదవడం జరిగింది. చివరి నిముషంలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఈ ‘నచికేత’ నాటకాన్ని రసరంజని వారి నిర్వహణలో తొలిసారిగా ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు ప్రదర్శించడం ఆనందం కలిగించింది. నాటకంలో భాగంగా నచికేతుడు యమపురికి వెళ్ళే మార్గం, మరణానంతరం ఆత్మ జ్యోతులుగా సాగిపోవడం, యమధర్మరాజు - నచికేతుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కథను సమకాలీన పరిస్థితులకు అన్వయించే ప్రయత్నంలో ‘ప్రాయో మార్గాన్ని’ అనుసరించిన వ్యక్తి , అతని ప్రవర్తన, ‘మృత్యువు’ను పర్సానిఫై చేసిన వైనం ప్రదర్శన తిలకించినవారిని ఆకర్షించాయి. ఎంతటి జటిలమైన అంశాన్నయినా సరళంగా అందించే ప్రయత్నం చేస్తే, సహృదయులైన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అర్థమైంది. గత 31 సంవత్సరాలుగా నాటకరంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘రసరంజని’ చొరవ తీసుకుని, ఒక విభిన్న అంశంతో కూడిన నాటకానికి వేదిక కల్పించడం ఆనందం. అదే విధంగా, కేవలం టి.వీలకి, సిన్మాలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా నాటకం చూడడానికి దూరప్రాంతాల నుంచి సైతం ప్రేక్షక దేవుళ్ళు రావడం సంతోషం. తెలుగు రంగస్థలం మరింత ముందుకు సాగడానికి మరిన్ని కొత్త ప్రయత్నాలు కావాలి, రావాలి. ఆ క్రమంలో మా ‘నచికేత’ ఓ చిరు ప్రయత్నం. - ఆకెళ్ళ శివప్రసాద్, ప్రముఖ నాటక – సినీ రచయిత -
ఆటాడుకుందామా!
మీ ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతోందా... అయితే ఆటలు ఆడించే ఎడ్ల సతీశ్ కుమార్‌ను పిలవండి మరింత సందడి మీ ముందుంటుంది. గోళీలు, కర్రబిళ్ల, గాలిపటాలు, దాండియా కర్రలతో మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు.. మీ ఇంటికి వచ్చిన అతిథులను ఆటపాటలతో ముంచెత్తి, పండుగ వాతావరణం తీసుకువస్తారు. రంగస్థల నటుడు, సంప్రదాయ ఆటలలో నిష్ణాతుడు, జానపద గిరిజన నృత్యాల నిపుణుడు అయిన సతీశ్‌కుమార్ దేశవిదేశాలలో భారతదేశ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరుగున పడిపోతున్న ఆటలను, వస్తువులను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. సంప్రదాయ ఆటలతోపాటు, జానపద నృత్యాలు, దాండియా ఆటలతో ఇంటిని ఆనంద సాగరంలో ముంచుతున్నారు. భారతీయ సంప్రదాయాన్ని దేశవిదేశాలలో ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన సతీశ్‌కుమార్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆ వివరాలు... నానమ్మ ప్రభావం... ‘చిన్నప్పుడు నానమ్మ చాలా కథలు చెప్పేది. రాముల వారి గుడి దగ్గర రామ్‌లీల, ఒగ్గు కథలు, నాటకాలు అన్నిటికీ నానమ్మ తనతో తీసుకువెళ్లేది. అవి చూస్తుండటం వల్ల కళల పట్ల మక్కువ పెరిగింది. 1995 ప్రాంతంలో ఉర్దు, తెలుగు నాటకాలు వేయడం ప్రారంభించాను. సాగర సంగమం సినిమా చూసిన తరవాత నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. కూచిపూడి నాట్యకారిణి ఉమారామారావుగారి శిష్యుడైన అనిల్ కుమార్ గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. ఆ తరవాత లంబాడా, కోయ, గోండు వంటి జానపద, గిరిజన నృత్యాలు నేర్చుకుని, వాటిని ఒక పద్ధతిలో రూపొందించి వారి చేతే నాట్యం చేయించడం ప్రారంభించాను. దేశమంతా తిరిగి, అన్ని రాష్ట్రాల జానపదాలు తెలుసుకున్నాను. శివగంగ నాట్యం సుమారు వంద ప్రదర్శనలిచ్చాను. హాంగ్‌కాంగ్‌లో 1980లో పది రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో మన దేశం నుంచి నేను ప్రతినిధిగా హాజరయ్యాను. ఇదే నా మార్గం... నేను ఈ కళలలో ఉండటం నాన్నగారికి ఇష్టం లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోమనేవారు. నానమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. నాన్నకు కోపం రాకుండా ఉండటం కోసం ఉదయం నాలుగు గంటలకే టాంక్‌బండ్‌కి వెళ్లి, అక్కడ సాధన చేసి, ఆరు గంటలకల్లా డాన్స్ క్లాసుకి వెళ్లేవాడిని. అలా పట్టుదలతో నాట్యం నేర్చుకున్నాను. అప్పట్లోనే నాటకాలు కూడా వేయడం మొదలుపెట్టాను. 1996లో హాంగ్‌కాంగ్, 1997లో అమెరికా వెళ్లాను. అక్కడ కార్యక్రమాలకు వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు. వారంతా నన్ను ప్రోత్సహించి, ఆటా సభలకు పంపారు. అక్కడి వారికి మన సంప్రదాయ నృత్యాలు నేర్పించి, ఆటా ప్రారంభోత్సవ వేడుకలో చేయించాను. అలా అక్కడ సభలలో కొత్త ఒరవడి మొదలుపెట్టాను. అక్కడ ‘తెలుగు దేశం మనది’ ప్రదర్శన చూసి, కార్యక్రమానికి హాజరైన పన్నెండు వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఒక కళాకారుడికి ఇంతకంటె ఏం కావాలి. అప్పుడు అనుకున్నాను, ‘ఇదే నా మార్గం’ అని. అక్కడ రెండేళ్లు ఉండి భారతదేశానికి వచ్చేశాను. స్వదేశంలో కొత్తగా... మన దేశంలో కొత్తగా ఏదైనా క్రియేట్ చేయమని తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణగారు కోరారు. ‘ఈ తరం వారు మరచిపోతున్న మన ఆటలు నేర్పిస్తాను’ అన్నాను. ఆయన ‘సరే’ అన్నారు. 2017లో మన ఊరి ఆటలు (ఎథ్నిక్ గేమ్స్) పేరున మరుగున పడిపోతున్న ‘కర్ర – బిళ్ల, గోళీలు, బొంగరాలు, కర్ర సాము, వామన గుంటలు, గచ్చకాయలు, చింత గింజలు’ వంటి ఆటలు ఆడించడం మొదలుపెట్టాను. అలాగే పిల్లలకి రాజస్థానీ తలపాగాలు కట్టి, వారితో దాండియా ఆడిస్తాను. వాతావరణాన్ని ఏభై ఏళ్ల క్రితం ఉన్న సంప్రదాయాల్లోకి తీసుకెళ్తాను. మన సంప్రదాయం తెలిసిన నానమ్మలను, అమ్మమ్మలను పిలిచి, వారితో తిరగలిలో బియ్యం పోసి విసిరిస్తాను. రోట్లో వడ్లు వేసి దంపిస్తాను. మనవలకి, పిల్లలకి వాళ్లు నేర్పేలా చేస్తారు. సంప్రదాయాన్ని నిత్యనూతనంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. మన సంప్రదాయాలను ఆంగ్లంలో... విదేశాలలో ప్రదర్శనలిస్తున్నప్పుడు... బతుకమ్మ, గొబ్బెమ్మ, లంబాడీ, భాంగ్రా వీటికి సంబంధించిన పాటలను ఆంగ్లంలోకి అనువదించి, పాడుతూ చెబుతాను. గుంటూరు జేకేసీ కళాశాలలో సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ కార్యక్రమాల సందర్భంగా ఆడించాను. సంక్రాంతి సంబరాలు జరిపించాను. ‘అహం భారతీయం’ లో హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు అన్నీ కలిసి 1998లో ప్రదర్శించాం. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని అనను కాని, ఆనందంగా ఉంటుంది. మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అలాగే మాలాంటి వాళ్లకు శాశ్వత ఉపాధి కలిపిస్తే మరింత బాగా చేయగలుగుతాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ – ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి కిల్లింగ్ వీరప్పన్‌లో, ఆత్మసమర్పణ్ (హిందీ సినిమా)లో, కొన్ని హిందీ సీరియల్స్‌లోను నటించాను. వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటున్నాను. ‘ఒకసారి బిర్యానీ దొరికితే, ఒకసారి టీ కూడా దొరక్కపోవచ్చు. నేను కళాకారుడినని తెలిసి, అమెరికాలో ఒకసారి చార్టర్ విమానాన్ని గంటసేపు నా కోసం ఆపారు. ఒకసారి ఒక పెద్ద కార్యక్రమానికి మూడు లారీల సామాను తెచ్చాను. ఎడ్ల బండి, గంగిరెద్దు, భోగి మంటలు అన్నీ ఉన్నాయందులో. పెద్దలతో ఆటలు, అమ్మలక్కలాటలు సైతం ఆడించాను. – ఎడ్ల సతీశ్ కుమార్ -
నాటకంతో ఆత్మసంతృప్తి
తిరుపతి : చిన్న చిన్న డ్రామాలే ఆయన్ని నటన వైపు మళ్లించాయి. దీంతో ఆయన ఆ రంగాన్నే వృత్తి,ప్రవృత్తిగా మార్చుకున్నారు. అగ్రస్థానంలో నిలిచారు. దీంతో రంగస్థలమే ఆయన ఇంటి పేరుగా మారింది. ఆయనే నాయుడు గోపి. నంది నాటకాలకు వచ్చిన సందర్భంగా ఆయనతో ముఖాముఖి. ప్ర: నాటకరంగంలో ప్రవేశం ఎలా జరిగింది. జ : మాది గుంటూరు జిల్లా పెద్దకాకాని గ్రామం. చదువుకునే రోజుల్లో చిన్నచిన్న డ్రా మాలు వేసి, బహుమతులు సాధించాను. అలా నాకు నాటక రంగంపై ఆసక్తి ఏర్పడిం ది. 1980లో గుంతకల్లులో రైల్వేశాఖ నిర్వహించిన నాటక పోటీల్లో తొలి ప్రదర్శనకు అవార్డు వచ్చింది. ఆ స్ఫూర్తితో నాటక రం గంలో కొనసాగుతున్నాను. ప్ర: సినీ అవకాశాలు ఎలా దక్కాయి? జ : హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించిన హింసధ్వని నాటికకు మంచి స్పంద న వచ్చింది. దీంతో పరుచూరి బ్రదర్స్ ద్వారా 1996లో సింగన్న సినిమాలో తొలి అవకాశం వచ్చింది. ప్ర: సినిమా, నాటకానికి మధ్య వ్యత్యాసం? జ : నాటక ప్రదర్శనతో ఆత్మసంతృప్తి కలుగుతుంది. సినిమాతో అది ఉండదు. ప్రేక్షకుల ఎదుట ఆత్మ సంతృప్తి కోసం సొంత డబ్బు వెచ్చించి ప్రదర్శించేది నాటకం. సంపాదన కోసం నటించేది సినిమా. ప్ర: నాటక రంగానికి మీరు చేస్తున్న కృషి? జ: తల్లిదండ్రు లు నాకు జన్మని చ్చారు. నాటకరంగం జీవితాన్నిచ్చింది. నాకు జీవితాన్నిచ్చిన ఈ నాటక రంగం రుణం తీర్చుకోవడానికి నావంతు కృషి చేస్తున్నా. అందులో భాగంగానే 1990లో గంగోత్రి సంస్థను స్థాపించి నాటక రంగాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నాను. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 25ఏళ్లలో 73 నాటకం, నాటికలను ప్రదర్శించాం. ప్ర: మీకు ఎన్ని నంది అవార్డులు అందుకున్నారు జ: నంది నాటకోత్సవాల్లో వ్యక్తిగతంగా ఉత్తమ దర్శకుడిగా 7, ఉత్తమ నటుడిగా 6 బంగారు నందులతో సహా 1998 నుంచి ఇప్పటి వరకు 37 అవార్డులు వచ్చాయి.