ఆటాడుకుందామా! | Satishkumar Is Presenting The Indian Tradition Abroad | Sakshi
Sakshi News home page

ఆటాడుకుందామా!

Published Wed, Dec 4 2019 1:19 AM | Last Updated on Wed, Dec 4 2019 1:19 AM

Satishkumar Is Presenting The Indian Tradition Abroad - Sakshi

మీ ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతోందా... అయితే ఆటలు ఆడించే ఎడ్ల సతీశ్‌ కుమార్‌ను పిలవండి మరింత సందడి మీ ముందుంటుంది. గోళీలు, కర్రబిళ్ల, గాలిపటాలు, దాండియా కర్రలతో మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు.. మీ ఇంటికి వచ్చిన అతిథులను ఆటపాటలతో ముంచెత్తి, పండుగ వాతావరణం తీసుకువస్తారు. రంగస్థల నటుడు, సంప్రదాయ ఆటలలో నిష్ణాతుడు, జానపద గిరిజన నృత్యాల నిపుణుడు అయిన సతీశ్‌కుమార్‌ దేశవిదేశాలలో భారతదేశ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరుగున పడిపోతున్న ఆటలను, వస్తువులను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. సంప్రదాయ ఆటలతోపాటు, జానపద నృత్యాలు, దాండియా ఆటలతో ఇంటిని ఆనంద సాగరంలో ముంచుతున్నారు. భారతీయ సంప్రదాయాన్ని దేశవిదేశాలలో ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన సతీశ్‌కుమార్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆ వివరాలు...

నానమ్మ ప్రభావం...
‘చిన్నప్పుడు నానమ్మ చాలా కథలు చెప్పేది. రాముల వారి గుడి దగ్గర రామ్‌లీల, ఒగ్గు కథలు, నాటకాలు అన్నిటికీ నానమ్మ తనతో తీసుకువెళ్లేది. అవి చూస్తుండటం వల్ల కళల పట్ల మక్కువ పెరిగింది. 1995 ప్రాంతంలో ఉర్దు, తెలుగు నాటకాలు వేయడం ప్రారంభించాను. సాగర సంగమం సినిమా చూసిన తరవాత నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. కూచిపూడి నాట్యకారిణి ఉమారామారావుగారి శిష్యుడైన అనిల్‌ కుమార్‌ గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. ఆ తరవాత లంబాడా, కోయ, గోండు వంటి జానపద, గిరిజన నృత్యాలు నేర్చుకుని, వాటిని ఒక పద్ధతిలో రూపొందించి వారి చేతే నాట్యం చేయించడం ప్రారంభించాను. దేశమంతా తిరిగి, అన్ని రాష్ట్రాల జానపదాలు తెలుసుకున్నాను. శివగంగ నాట్యం సుమారు వంద ప్రదర్శనలిచ్చాను. హాంగ్‌కాంగ్‌లో 1980లో పది రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో మన దేశం నుంచి నేను ప్రతినిధిగా హాజరయ్యాను.

ఇదే నా మార్గం...
నేను ఈ కళలలో ఉండటం నాన్నగారికి ఇష్టం లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోమనేవారు. నానమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. నాన్నకు కోపం రాకుండా ఉండటం కోసం ఉదయం నాలుగు గంటలకే టాంక్‌బండ్‌కి వెళ్లి, అక్కడ సాధన చేసి, ఆరు గంటలకల్లా డాన్స్‌ క్లాసుకి వెళ్లేవాడిని. అలా పట్టుదలతో నాట్యం నేర్చుకున్నాను. అప్పట్లోనే నాటకాలు కూడా వేయడం మొదలుపెట్టాను. 1996లో హాంగ్‌కాంగ్, 1997లో అమెరికా వెళ్లాను. అక్కడ కార్యక్రమాలకు వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు.

వారంతా నన్ను ప్రోత్సహించి, ఆటా సభలకు పంపారు. అక్కడి వారికి మన సంప్రదాయ నృత్యాలు నేర్పించి, ఆటా ప్రారంభోత్సవ వేడుకలో చేయించాను. అలా అక్కడ సభలలో కొత్త ఒరవడి మొదలుపెట్టాను. అక్కడ ‘తెలుగు దేశం మనది’ ప్రదర్శన చూసి, కార్యక్రమానికి హాజరైన పన్నెండు వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఒక కళాకారుడికి ఇంతకంటె ఏం కావాలి. అప్పుడు అనుకున్నాను, ‘ఇదే నా మార్గం’ అని. అక్కడ రెండేళ్లు ఉండి భారతదేశానికి వచ్చేశాను.

స్వదేశంలో కొత్తగా...
మన దేశంలో కొత్తగా ఏదైనా క్రియేట్‌ చేయమని తెలంగాణ కల్చరల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణగారు కోరారు. ‘ఈ తరం వారు మరచిపోతున్న మన ఆటలు నేర్పిస్తాను’ అన్నాను. ఆయన ‘సరే’ అన్నారు.  2017లో మన ఊరి ఆటలు (ఎథ్‌నిక్‌ గేమ్స్‌) పేరున మరుగున పడిపోతున్న ‘కర్ర – బిళ్ల, గోళీలు, బొంగరాలు, కర్ర సాము, వామన గుంటలు, గచ్చకాయలు, చింత గింజలు’ వంటి ఆటలు ఆడించడం మొదలుపెట్టాను. అలాగే పిల్లలకి రాజస్థానీ తలపాగాలు కట్టి, వారితో దాండియా ఆడిస్తాను. వాతావరణాన్ని ఏభై ఏళ్ల క్రితం ఉన్న సంప్రదాయాల్లోకి తీసుకెళ్తాను. మన సంప్రదాయం తెలిసిన నానమ్మలను, అమ్మమ్మలను పిలిచి, వారితో తిరగలిలో బియ్యం పోసి విసిరిస్తాను. రోట్లో వడ్లు వేసి దంపిస్తాను. మనవలకి, పిల్లలకి వాళ్లు నేర్పేలా చేస్తారు. సంప్రదాయాన్ని నిత్యనూతనంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను.

మన సంప్రదాయాలను ఆంగ్లంలో...
విదేశాలలో ప్రదర్శనలిస్తున్నప్పుడు... బతుకమ్మ, గొబ్బెమ్మ, లంబాడీ, భాంగ్రా వీటికి సంబంధించిన పాటలను ఆంగ్లంలోకి అనువదించి, పాడుతూ చెబుతాను. గుంటూరు జేకేసీ కళాశాలలో సిల్వర్‌ జూబిలీ, గోల్డెన్‌ జూబిలీ కార్యక్రమాల సందర్భంగా ఆడించాను. సంక్రాంతి సంబరాలు జరిపించాను. ‘అహం భారతీయం’ లో హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు అన్నీ కలిసి 1998లో ప్రదర్శించాం. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని అనను కాని,  ఆనందంగా ఉంటుంది. మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అలాగే మాలాంటి వాళ్లకు శాశ్వత ఉపాధి కలిపిస్తే మరింత బాగా చేయగలుగుతాం.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
– ఫొటోలు: నోముల రాజేష్‌ రెడ్డి

కిల్లింగ్‌ వీరప్పన్‌లో, ఆత్మసమర్పణ్‌ (హిందీ సినిమా)లో, కొన్ని హిందీ సీరియల్స్‌లోను నటించాను. వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటున్నాను. ‘ఒకసారి బిర్యానీ దొరికితే, ఒకసారి టీ కూడా దొరక్కపోవచ్చు. నేను కళాకారుడినని తెలిసి, అమెరికాలో ఒకసారి చార్టర్‌ విమానాన్ని గంటసేపు నా కోసం ఆపారు. ఒకసారి ఒక పెద్ద కార్యక్రమానికి మూడు లారీల సామాను తెచ్చాను. ఎడ్ల బండి, గంగిరెద్దు, భోగి మంటలు అన్నీ ఉన్నాయందులో. పెద్దలతో ఆటలు, అమ్మలక్కలాటలు సైతం ఆడించాను.

– ఎడ్ల సతీశ్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement