రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి

Published Tue, Apr 15 2025 12:13 AM | Last Updated on Tue, Apr 15 2025 12:13 AM

రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి

రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి

వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి

శేష ప్రశ్నల సమాధానాలకు ఉత్తరకాండ చదవాలి

‘సాక్షి’తో సామవేదం షణ్ముఖశర్మ

నేటి నుంచి ఉత్తరకాండ ప్రవచన సప్తాహం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆధునిక సమాజంలో.. ప్రాచీన మహర్షుల కోవకు చెందిన ప్రవచనకర్త ఆయన. ఆర్ష సాహిత్య వైభవంపై దేశ విదేశాల్లో ప్రవచనాలు, ఆధ్యాత్మిక గ్రంథ రచనలు, సాధకుల సందేహాలను నిత్యం నివృత్తి చేయడం, రాజమహేంద్రవరం శివారు కొంతమూరు గ్రామంలో శ్రీ వల్లభ గణపతి ఆలయ నిర్వహణ, భారతీయ ఋషిపీఠం ఆధ్యాత్మిక పత్రిక నిర్వహణ ఆయన దైనందిన జీవితంలో భాగం. ఆయనే సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ. 2023 డిసెంబర్‌ 13 నుంచి 2024 జనవరి 23 వరకూ రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో వాల్మీకి రామాయణంపై వరుసగా 42 రోజుల పాటు ఆయన ప్రవచనాలు నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం నుంచి అదే వేదికపై రామాయణం ఉత్తరకాండపై వారం రోజుల పాటు ప్రవచనాలు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా తనను కలసిన సాక్షితో ఆయన ఉత్తరకాండలోని పలు విశేషాలను వివరించారు. రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, దీనికి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

రామకథ సమగ్ర స్వరూపం కోసం..

ఉత్తరకాండతో కలిపితేనే రామాయణ శ్లోకాలు 24 వేలు అవుతాయి. మొదటి ఆరు కాండలు రచించిన తరువాత కొద్ది విరామం అనంతరం మహర్షి వాల్మీకి ఉత్తరకాండ రచించారు. మహర్షి వాల్మీకి ప్రణీత రామాయణంలో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకూ ఉన్న షట్కాండలలో తలెత్తే కొన్ని శేష ప్రశ్నలకు ఉత్తరకాండలో సమాధానాలు లభ్యమవుతాయి. (‘ఉత్తరం’ అనే పదానికి సమాధానం, జవాబు అనే అర్థాలున్నాయి.) ఉదాహరణకు సీతాదేవి జనకుని యజ్ఞంలో నాగలిచాలున జన్మించిందని, ఆమె అయోనిజ అని ఉత్తరకాండ మనకు వివరిస్తుంది. రావణుడు రంభను బలాత్కరించి, నలకూబరుని శాపానికి గురవడం, తనను చూసి పరిహసించిన రావణుడిని నందీశ్వరుడు శపించడం తదితర అంశాలను కూడా మనం ఉత్తరకాండలో చూడవచ్చు. బాలకాండలో రాముని జనన విశేషాలు చెప్పిన మహర్షి ఉత్తరకాండలో ఆయన అవతార పరిసమాప్తిని వివరించారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకూ మాత్రమే రామాయణ పారాయణలు జరగడం పరిపాటి అయినా, ఉత్తరకాండను ప్రత్యేక గ్రంథంగా పారాయణ చేసే పూర్వ సంప్రదాయం ఉంది.

సీతాపరిత్యాగం.. కాలవైపరీత్యం

● సీతాదేవి గురించి జనాపవాదాన్ని శ్రీరామునికి ఆయన గూఢచారి భద్రుడు వివరిస్తాడు. ‘ప్రభూ! సీతాదేవితో సుఖించడానికి రాముని మనస్సు ఎలా అంగీకరిస్తోంది? ఎంతో కాలము పరుల పంచన ఉన్న తన భార్యను శ్రీరాముడు ఎలా చేరదీశాడు? రేపు మనమూ మన భార్యల పట్ల ఇంతటి సహనం చూపాలా? (అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి)’ – ఈ సన్నివేశం అయోధ్య కాండ 43వ సర్గలో కనపడుతుంది. ఒక రజకుని మాటను విని శ్రీరాముడు నిండు గర్భిణిని పరిత్యజించాడని వాల్మీకి మహర్షి చెప్పలేదు. అగ్నిపునీత అయిన ఆ తల్లిని అయోధ్యవాసులు నమ్మలేదా అనే ప్రశ్నకు సమాధానం మనం చెప్పుకోవాలి. శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యేనాటికి, సీతాపరిత్యాగ సమయానికి చాలా విరామం ఉంది. కొన్ని తరాలు గడిచాయి. నాటి యువతరం నమ్మకపోయి ఉండవచ్చు. కాలం కొన్ని సమయాల్లో వింత పోకడలు పోతుంది. ఇది కాలవైపరీత్యం అని చెప్పుకోవాలి. ఇది అత్యంత బాధాకరం.

● ‘కూడళ్లయందు, అంగళ్లయందు, రాజమార్గములయందు, వనములలో, ఉపవనాల్లో సీతాదేవిని గురించి ప్రజలు ఇలా పెక్కువిధాలుగా, నోటికి వచ్చిన రీతిలో మాట్లాడుకుంటున్నారు’ అని భద్రుడు శ్రీరామునికి నివేదించాడు. రాజు ఆదర్శపాలకుడు కావాలి. రాజు ప్రవర్తన వివాదాలకు అతీతంగా ఉండాలి. లోకాపవాదును దూరం చేయడం కోసం సీతాదేవిని శ్రీరాముడు పరిత్యజించాడు.

అందుకే వారి ప్రస్తావన లేదు

శ్రీరాముని సోదరుల భార్యల గురించి ఉత్తరకాండలో సైతం ప్రస్తావించలేదు. ప్రధాన కథలో వారి ప్రాధాన్యం లేకపోవడమే దీనికి కారణం.

సుమంత్రుడు భవిష్యత్తు ఎలా చెప్పగలిగాడు?

ఒక్క సీతాదేవిని మాత్రమే కాదు.. భవిష్యత్తులో శ్రీరాముడు నిన్ను సైతం పరిత్యజిస్తాడని సుమంత్రుడు లక్ష్మణునితో అంటాడు. (ఉత్తరకాండ 50వ సర్గ). నీవు యాగం చేసి, పుత్ర సంతానం పొందుతావని కూడా దశరథునితో సుమంత్రుడు బాలకాండలో చెబుతాడు. భృగు మహర్షి శాపం వలన శ్రీరాముడు భార్యా వినియోగాన్ని అనుభవిస్తున్నాడని కూడా సుమంత్రుడు లక్ష్మణునికి చెబుతాడు. ఒక మహర్షి అనుగ్రహంతో సుమంత్రుడు భవిష్యద్దర్శనం చేయగలిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement