
రూ.60 తగ్గించి... రూ.15 పెంచి..
సాక్షి, అమలాపురం: అమెరికా సుంకాల పేరుతో ఆక్వా ధరలను రాత్రికి రాత్రి అడ్డగోలుగా తగ్గించిన ఎగుమతిదారులు.. పెంచాల్సిన సమయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ట్రంప్ సుంకాలను బూచిగా చూపించి కౌంట్‌లలో రకాలను బట్టి కిలోకి రూ.40 నుంచి రూ.60 వరకు తగ్గించిన ఎగుమతిదారులు... సుంకాల విధింపు వాయిదా వేసినా... వనామీ రొయ్యల ఎగుమతి మొదలైనా ధరలు మాత్రం కిలోకి రూ.10 నుంచి రూ.15 వరకు పెంచి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల వనామీ రైతులకు ఎటువంటి ఊరట లభించడం లేదు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తీర ప్రాంత మండలాల్లో వనామీ రొయ్యల సాగు అధికంగా ఉంది. కాకినాడ జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో ఈ సాగు ఉండగా, కోనసీమ జిల్లాలో 15 వేల ఎకరాల్లో జరుగుతున్నట్టు అంచనా. మొత్తం ఈ రెండు జిల్లాలో కలిపి 23 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని అంచనా. ప్రస్తుతం సుమారు 13 వేల ఎకరాల చెరువులకు సంబంధించి వచ్చే మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందనుంది. కాబట్టి ఈ నెల రోజుల ఆక్వా ధరలపైనే లాభనష్టాలు ఆధారపడనున్నాయని రైతులు చెబుతున్నారు. వనామీ రొయ్యల ధరలు గత ఫిబ్రవరి మొదటి వారానికి ఆశాజనంగా పెరిగాయి. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు వస్తుండడంతో పెద్ద కౌంట్ అయిన 30 కౌంట్ (కిలోకి 30 రొయ్యలు), 40 కౌంట్‌కు డిమాండ్ వచ్చింది. 30 కౌంట్ ధర కిలో రూ.470 వరకు, 40 కౌంట్ ధర రూ. 415 పెరిగింది.
తగ్గింపు బారెడు .. పెంపు మూరెడు
అంతర్జాతీయంగా ఏ చిన్న సంఘటన జరిగినా షేర్ మార్కెట్ కుప్పకూల్చినట్టుగా ఎగుమతిదారులు ధరలు తగ్గించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. రైతులకు లాభసాటిగా కొనేందుకు వారు సిద్ధంగా లేరు. ఇప్పటికే ప్రధాన కౌంట్ ధరలు తగ్గించుకుంటూ వచ్చారు. మార్చి మొదటి వారంలో ధరలు తగ్గింపు మొదలు పెట్టారు. అమెరికా సుంకాలు ప్రకటించే సమయానికి 30 కౌంట్ ధర రూ.460 వరకు తగ్గించారు. సుంకాల ప్రకటన తరువాత ఒకేసారి కేజీకి రూ.60 తగ్గించి రూ.400 చేశారు. 40 కౌంట్ ధర రూ.415 నుంచి రూ.390కి తగ్గించగా, సుంకాల ప్రకటన తరువాత రూ.310కి కుదించారు. ఇలా ప్రతి కౌంట్ ధరను భారీగా తగ్గించేశారు. 50 కౌంట్ ధర రూ.350 నుంచి రూ.320కి, 60 కౌంట్ ధర రూ.320 నుంచి రూ.280కి, 70 కౌంట్ ధర రూ.290 నుంచి రూ.250కి, 80 కౌంట్ ధర రూ.260 నుంచి రూ.230కి, 90 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.210కి తగ్గించి వేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కిలో రూ.250 ఉన్న 100 కౌంట్.. సుంకాలు విధించిన తరువాత రూ.190కి తగ్గించారు. అమెరికా సుంకాల విధింపును మూడు నెలల పాటు వాయిదా వేసింది. వనామీ రొయ్యల ఎగుమతులు కూడా మొదలయ్యాయి. పరిస్థితులు సానుకూలంగా మారడంతో కౌంట్‌లకు పాత ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కాని పెంపు మాత్రం స్వల్పంగా ఉంది. 30 కౌంట్‌కు ఏకంగా రూ.60 వరకు ధర తగ్గించిన ఎగుమతిదారులు ఇప్పుడు కేవలం రూ.25 మాత్రమే పెంచారు. 40 కౌంట్‌కు రూ.60 వరకు తగ్గించి ఇప్పుడు రూ.30 వరకు పెంచారు. 50 కౌంట్‌కు రూ.50 తగ్గించి ఇప్పుడు కేవలం రూ.20, 60 కౌంట్‌కు రూ.40 తగ్గించి రూ.20 చొప్పున పెంచి చేతులు దులుపుకున్నారు.
వనామీ రొయ్యలు
ఎగుమతులు మొదలైనా
తీరని ఆక్వా రైతుల వెతలు
అమెరికా సుంకాలు ప్రకటించే
నాటికి 30 కౌంట్ రూ.460
ఇప్పుడు రూ.425
40 కౌంట్ అప్పుడు
రూ.370.. ఇప్పుడు రూ.340
ఒకేసారి కిలోకి రూ.60 తగ్గించి.. రూ.ఐదు చొప్పున పెంచుతున్న వైనం
సుంకాలు ప్రకటించిన నాడు
కిలోకి రూ.40 నుంచి రూ.50 కోత
కోనసీమ, కాకినాడ జిల్లాల్లో
23 వేల ఎకరాల్లో సాగు
గత ఫిబ్రవరి నుంచి ఆక్వా ధరలు ఇలా (రూ.లలో)
కౌంట్ రకం ఫిబ్రవరి మార్చి సుంకాలు సుంకాలు ప్రస్తుతం
మొదటి మొదటి ప్రకటించే ప్రకటించిన మార్కెట్‌లో
వారంలో వారంలో సమయంలో ధరలు తరువాత రోజు ధరలు
30 కౌంట్ 470 465 460 400 425
40 కౌంట్ 415 390 370 310 340
50 కౌంట్ 375 365 350 300 320
60 కౌంట్ 345 335 320 280 300
70 కౌంట్ 320 300 290 250 295
80 కౌంట్ 285 270 260 230 255
90 కౌంట్ 265 250 240 210 235
100 కౌంట్ 255 240 230 190 225

రూ.60 తగ్గించి... రూ.15 పెంచి..