
ఈదుకుంటూ మృత్యుఒడికి..
ప్రమాదాల వివరాలు..
సంవత్సరం కేసులు మృతులు
2021 54 59
2022 63 67
2023 71 78
2024 78 80
2025 (ఇప్పటి వరకూ) 23 24
291 308
● ఈ నెలలోనే ఆరు ప్రమాదాలు–
తొమ్మిది మంది మృతి
● ఐదేళ్లలో 291 ప్రమాదాలు,
308 మంది మృత్యువాత
● స్వీయరక్షణ, భద్రత చర్యలు
తీసుకోవాలంటున్న నిపుణులు
ఆలమూరు: వేసవికాలం వచ్చేసింది..విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి.. యువకులు, పర్యాటకులు సముద్ర, నదీ పరివాహక ప్రాంతాల్లోని అనువుగా ఉండే ప్రదేశాల్లో స్నానాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే గోదావరిలో స్నానం చేసే సమయంలో కాని ఈత కొట్టే సమయంలో కాని ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా మృత్యువాత పడతామని, తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తామని మాత్రం ఊహించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల వెంబడి గౌతమీ, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు 289 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటాయి. స్థానికులతో పాటు వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులు నదీ తీరానికి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడతారు. ఇదే క్రమంలో గోదావరిలోను, పంట కాలువల్లోను స్నానాలు చేస్తూ ఈత సరదాను తీర్చుకునే క్రమంలో అనేకమంది ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో అనేక చోట్ల లోతులు, ఊబిలు ఉన్న సంగతి తెలియని పర్యాటకులు స్నానాలకు దిగి మృత్యువాత పడుతున్నారు.
చర్యలు చేపడుతున్నా...
ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, కె.గంగవరం, అయినవిల్లి, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లోని పలు గ్రామాలతో పాటు కొవ్వూరు మండలంలోని మద్దూరులంక. సీతంపేట, విజ్జేశ్వరం లాకుల సమీపంలోని నదీ తీరాలు అత్యంత ప్రమాదకరంగా పేరుగాంచాయి. దీంతో పాటు అంతర్వేది, ఓడలరేవు, కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోంది. గోదావరి తీర ప్రాంతాల్లో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా ప్రయోజనం కన్పించడం లేదు. గత ఐదేళ్లలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 291 ప్రమాదాలు జరగ్గా 302 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెలలోనే ఇప్పటి వరకూ ఆరు ప్రమాదాలు జరగ్గా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
నివారణకు చర్యలు
● ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్, హెడ్‌వర్క్స్‌శాఖ పోలీసుశాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి.
● గోదావరి పరీవాహక ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి.
● వేసవిలో గోదావరి తీరంలోకి ఇతర ప్రాంతాల వారు వస్తే ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది కౌన్సెలింగ్‌ను అందించాలి.
● ప్రమాదకరమైన అన్ని రేవుల వద్ద లోతు వివరాలు తెలియజేసే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి.
● స్నానానికి అనుమతి లేని ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి.
● స్నానాలు చేసేటప్పుడు, ఈత కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించి సేఫ్టీ డ్రస్‌ను ధరించాలి.
అనుమతి లేని ప్రదేశాల్లో స్నానాలు వద్దు
గోదావరి తీరం వెంబడి అనుమతి లేని ప్రదేశాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దు. ఇప్పటికే తీరం వెంబడి గుర్తించిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానికుల సహకారంతో ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాం. రద్దీ ప్రదేశాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశాం. పర్యాటక ప్రాంతాల్లో నిరంతరం పోలీసులను పహరాగా ఉంచుతున్నాం.
–సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట
ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం
నదీ తీర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. ధవళేశ్వరం దిగువ ప్రాంతాల్లో ఊబులు ఎక్కువగా ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఆ మేరకు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఇటీవల వాడపల్లి తీర్థానికి వెళ్లే భక్తులను గోదావరి మీద నుంచి వెళ్లకుండా పోలీసుల సాయంతో కట్టడి చేసి ప్రమాదాలను ఆపగలిగాం.
– ఆర్.విశ్వనాథరాజు, హెడ్‌వర్క్స్ జేఈ, ధవళేశ్వరం తూర్పుగోదావరిజిల్లా

ఈదుకుంటూ మృత్యుఒడికి..

ఈదుకుంటూ మృత్యుఒడికి..

ఈదుకుంటూ మృత్యుఒడికి..