
ఫొటో స్డూడియోలే వీరి టార్గెట్
దేవరపల్లి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, ఫొటో స్టూడియోల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను దేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యుల్లో ఒకరు మహిళ కావడం విశేషం. దేవరపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ బి.నాగేశ్వర్ నాయక్ ఆ వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన షేక్ సమీర్ (పైజల్), విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన అల్లాడి నాగమణికంఠ ఈశ్వర్ (మణి), తెలంగాణలోని కోదాడ మండలానికి చెందిన నాగదాసరి ఒమెసిన్‌మస్(సిమ్), చిలకలూరిపేటకు చెందిన రామిశెట్టి దేవీ ప్రసాద్, కోదాడకు చెందిన మునగంటి గోపి, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన కొల్లి వెంకట సూర్యసత్యమణిసాయి ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడలో కారును అద్దెకు తీసుకుని దొంగతనాలకు ఉపయోగిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దేవరపల్లి మెయిన్ రోడ్డులోని ఆర్‌కే డిజిటల్ స్టూడియోలో, నిడదవోలులోని రెండు ఫొటో స్టూడియోల్లో దొంగతనం చేశారు. రెండుచోట్లా కెమెరాలు, కంప్యూటర్ పరికరాలు, రెండు హార్డ్ డిస్కులు, ప్రింటర్ దొంగిలించారు. ఈ చోరీలపై దేవరపల్లి, నిడదవోలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అద్దె కారులో రెక్కీ..
ముఠా సభ్యులందరూ ఒక కారును అద్దెకు తీసుకుని దాని నంబర్ ప్లేటు తీసేస్తారు. దొంగతనం చేయబోయే ప్రదేశంలో రెక్కీ నిర్వహిస్తారు. కొన్ని షాపులు, ఇళ్లను ఎంపిక చేసుకుని రాత్రి సమయంలో ఇనుపరాడ్డులను ఉపయోగించి షట్టర్లు, తాళాలను బద్దలుకొట్టి దొంగతనం చేస్తారు. దేవరపల్లిలో జరిగిన దొంగతనానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా బుధవారం ఎస్సై వి.సుబ్రహ్మణ్యం స్థానిక డైమండ్ జంక్షన్ వద్ద ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.5 లక్షల విలువైన కెమెరాలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టుకు హాజరుపర్చిచారు. దొంగతనాలకు ఉపయోగిస్తున్న కారు, బుల్లెట్ వాహనాన్ని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో గోపాలపురం ఎస్సై కె.సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భీమరాజు, కానిస్టేబుళ్లు బాలచంద్రరావు, సలీం, పండు, దుర్గారావు, గోపాలపురం స్టేషన్ సిబ్బంది కుమార స్వామి, గోవింద్, నాగేంద్ర, వెంకట్ ఎంతో సహకరించారన్నారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్టు తెలిపారు.
విలువైన కెమెరాల చోరీ
ఆరుగురు ముఠా సభ్యుల్లో ఒకరు మహిళ
అరెస్టు చేసిన దేవరపల్లి పోలీసులు

ఫొటో స్డూడియోలే వీరి టార్గెట్