మహబూబ్‌నగర్ న్యూటౌన్: కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు.. ఊర్లోనే చేతినిండా ఉపాధీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మత్స్య సంపదపై మక్కువ పెరిగేలా వివిధ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, వ్యక్తిగత సహకారం అందించడంతో పాటు జిల్లాలోని చెరువులు, కుంటల్లో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను వదిలి మత్స్య సంపదను పెంచి నీలి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం జిల్లా మత్స్య శాఖ అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసింది.
3.95 కోట్ల చేపపిల్లలు లక్ష్యం
మహబూబ్‌నగర్, నారాయణపేట రెండు జిల్లాల్లో కలిపి ఈసారి 3.95 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, జాలాశయాల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కట్ల, రోహు, బంగారుతీగ, మ్రిగాల రకాలైన చేపపిల్లలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేందుకు ప్రణాళికలు తయారు చేశారు. వందశాతం సబ్సిడీపై అందించే ఈ చేపవిత్తనాల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని టెండర్లు నిర్వహించి వర్షాలు రాగానే చేప విత్తనాలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి జూలై లేదా ఆగస్టు నెలల్లో చేప విత్తనాలను చెరువుల్లో వదలాలని అంచనా వేస్తున్నారు.
243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రయోజనం
జిల్లాలో మొత్తం 245 డిపార్ట్‌మెంటర్ చెరువులు, 1671 గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటి పరిధిలో 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 14,723 మంది మత్స్యకారులున్నారు. 18 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 674 మంది సభ్యులు ఉన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలలో కోయిల్‌సాగర్, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్, సాలార్‌నగర్ ప్రాజెక్టులతో పాటు జూరాల బ్యాక్ వాటర్‌లో చేపల వేట సాగించేందుకు 1520 మంది లైసెన్సు దారులు ఉన్నారు. లైసెన్సుదారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులందరికి ఉపాధి కల్పించి వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ కింద చేపవిత్తనాల పంపిణీతో పాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది.
టెండర్ల ఖరారుకు నివేదిక
జిల్లాలో గుర్తించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేపవిత్తనాలు సరఫరా చేసేందుకు ఇటీవల ప్రభుత్వం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో చేప విత్తనాలు సరఫరా చేసేందుకు ఆరు మంది టెండరుదారులు దరఖాస్తులు సమర్పించగా వాటిని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత ఆమోదంతో జిల్లా మత్స్య శాఖ అధికారులు ఈనెల 2న రాష్ట్ర మత్స్సశాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపారు. జిల్లా కొనుగోలు కమిటీ బృందం సభ్యులు క్షేత్ర స్థాయిలో చేపల పిల్లల విత్తన హెచరీస్‌లను పరిశీలించేందుకు వెళతారు. వారిచ్చే నివేదిక ఆధారంగా టెండర్లను ఖరారు చేయనున్నారు.
నిర్ణీత సైజులోనే..
ప్రభుత్వం నిర్ణయించిన సైజులో చేప విత్తనాలను వదిలేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెరువులు, కుంటల్లో వదిలే చేపవిత్తనాలు, జలాశయాల్లో వదిలే చేపవిత్తనాలు వేర్వేరు సైజుల్లో ఉంటాయి. చెరువులు, కుంటల్లో 35 మిల్లీమీటర్ల నుంచి 40 మిల్లీమీటర్ల సైజులో ఉన్న బొచ్చ, రాహు, బంగారుతీగ రకాల చేపవిత్తనాలను వదులుతారు. సంవత్సరం పొడవునా నీరు ఉండే జలాశయాలు, ప్రాజెక్టుల్లో 80 మిల్లీ మీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల సైజులో గల బొచ్చ, రాహు, మ్రిగాల రకాలైన చేపవిత్తనాలను వదులుతారు.
ప్రణాళికలు సిద్ధం చేశాం
ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థిక స్థోమత అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రతీఏడాదిలాగే ఈ సారి కూడా వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రెండు జిల్లాల పరిధిలో ఈ సంవత్సరం 3.95 కోట్ల చేప విత్తనాలు అవసరమవుతాయని లక్ష్యాన్ని పెట్టుకొని ప్రభుత్వానికి నివేదించాం. అందుకు గాను టెండర్లు ఆహ్వనించగా ఆరుమంది దరఖాస్తులు ఇచ్చారు. – డా.లక్ష్మప్ప, మత్స్య శాఖ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment