సముద్రంలో వేటకు బయలుదేరుతున్న మత్స్యకారులు
ఎన్నికల వేళ జనాన్ని మాయమాటలతో ఏమార్చడం.. అధికార పీఠంపై అధిష్టించాక అంటీముట్టనట్టు వ్యవహరించడం చంద్రబాబునాయుడికి వెన్నతోపెట్టిన విద్య. నారా వారు విసిరిన మోసపు హామీల వలలో చిక్కి విలవిల్లాడుతున్న వారిలో మత్స్యకారులూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు గుప్పించిన హామీలను గంగలో కలిపేసిన తీరును గంగపుత్రులు గుర్తు చేసుకుంటున్నారు.
సాక్షి, చీరాల (ప్రకాశం): గంగపుత్రులు గంపెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యకారులపై ప్రభుత్వానికి మమకారం లేకుండా పోయింది. డీజిల్ సబ్సిడీకి సర్కారు పంగనామం పెట్టింది. ఎప్పుడో 2002 మార్చిలో నమోదు చేసుకున్న బోట్లకు తప్ప ఆ తర్వాత వచ్చిన బోట్లకు సబ్సిడీ అందడంలేదు. వేట విరామ సమయంలో చేయూతనందించాల్సిన సర్కారు మొండి చేయి చూపిస్తోంది. చివరకు ఉపాధి పనుల్లో అవకాశం కల్పించాలని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించడం లేదు. సబ్సిడీపై అందించాల్సిన బోట్ల వ్యవహారాన్ని అటకెక్కించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 సునామీ తర్వాత కట్టించిన 300 పక్కా గృహాలు తప్ప మత్స్యకారులకు కొత్తగా ఎటువంటి గృహాలు నిర్మించలేదు.
రాయితీలకు ఎగనామం
2002 మార్చి అంటే 9వ ఆర్థిక ప్రణాళికా సంఘంలో నమోదు చేసుకున్న బోట్లకే డీజిల్ సబ్సిడీ అందుతుండగా ఆ తర్వాత కొనుగోలు చేసిన బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇవ్వడం లేదు. అలానే రూ.10 నుంచి రూ.50 వేల విలువ చేసే వలలపై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీకి ఆపేసింది. బోటు ఇంజన్ల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని ఎగ్గొట్టింది. నాబార్డు నిధులతో మత్స్యకార గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మౌలిక వసతులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. వేటకు వెళ్లి ప్రమాదశాత్తు చనిపోతే ఇవ్వాల్సిన రూ.2 లక్షలను చంద్రన్న బీమాలో కలిపేసి చేతులు దులుపుకొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2క్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చే పథకాన్ని ప్రస్తుత సర్కారు తొలగించింది. అలానే ఐదుగురు మత్స్యకారులు కలిసి రూ.2.5 లక్షల విలువైన బోటు కొనుగోలు చేస్తే 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా ఆ సొమ్మును దళారులే మింగేస్తున్నారు. బోటు కోనుగోలు చేసేందుకు అవసరమైన పెట్టుబడి పెట్టే సామర్థ్యం మత్స్యకారులకు లేకపోవడంతో దళారులు పెట్టుబడి పెట్టి వారి పేర్లతో బోట్లను కైవసం చేసుకుంటున్నారు.
జిల్లాలో తీర ప్రాంతం | 102 కి.మీ |
మత్స్యకార గ్రామాలు | 74 |
మత్స్యకారుల జనాభా | 80000 |
ఇంజన్ బోట్లు | 1849 |
సంప్రదాయ బోట్లు | 2883 |
మత్స్యకార సొసైటీలు | 54 |
మెరైన్ సొసైటీలు | 44 |
సొసైటీల్లో సభ్యులు | 16,000 |
సంక్షేమం నామమాత్రమే..
మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయి. వేట సాగించే మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం రూ.3.45, రాష్ట్ర ప్రభుత్వం రూ.7.5 అందిస్తుంది. అయితే కొన్నేళ్లుగా కేంద్రం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మెకనైజ్డ్ బోట్లకు నెలకు 1000 లీటర్లు అవసరం ఉండగా ప్రభుత్వం 300 లీటర్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. క్యాబిన్ బోట్లకు నెలకు 6 వేల లీటర్లు డీజిల్ కావాల్సి ఉండగా నెలకు 3 వేల లీటర్లు కూడా ఇవ్వడం లేదు.
ఆ అవస్థలు వర్ణనాతీతం
వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లు లంగరు వేసేందుకు మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాడరేవు, చిన్నబరప, విజయలక్ష్మీపురం, బాపట్ల మండలంలోని దానవాయిపేట, పాండురంగాపురం గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌పై ఉన్న బ్రిడ్జి సమీపంలోని జెట్టీ వద్ద మాత్రమే బోట్లు నిలుపుతున్నారు. చేపలు విక్రయించేందుకు మరే ఇతర సౌకర్యాలు లేవు. దీంతో కొన్నేళ్లుగా మండలంలోని మత్స్యకారులు బాపట్ల మండలంలోని దానవాయిపేట సమీప ప్రాంతాన్ని జెట్టీగా వినియోగించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మినీ హార్బర్‌కు రూ.432 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అది స్థల సేకరణ దశలో ఉంది. హార్బర్ నిర్మాణం పూర్తయితే మత్స్యకారులు తమ మత్స్యసంపదను దళారులకు కాకుండా నేరుగా అమ్ముకునేందుకు వీలుంటుంది.
ఉపాధి ఉసేది?
వేట విరామ సమయంలో తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు ఏప్రిల్, మే నెలలో నెలకు రూ.10 వేల నగదు, 50 కేజీల బియ్యం అందిస్తున్నాయి. రెండు నెలల పాటు వేటకు వెళ్లకపోయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే చేయూతతో మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ టీడీపీ ప్రభుత్వం రెండు నెలలకు రూ.4 వేలు మాత్రమే ఇస్తోంది. ఆ సొమ్ము కూడా జిల్లాలో సగం మందికి అందడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment