వెళితే రూ.వెయ్యి.. వస్తే మరో రూ.వెయ్యి | fishermens hunter issue | Sakshi
Sakshi News home page

వెళితే రూ.వెయ్యి.. వస్తే మరో రూ.వెయ్యి

Published Tue, Jun 13 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

fishermens hunter issue

 
మత్స్యకారుల నుంచి అధికారుల వసూళ్లు
ఇచ్చుకోలేక మత్స్యకారుల ఆందోళన
తుంగలోకి తొక్కిన వేట నిషేధం నిబంధనలు 
 
సముద్రంలో చేపల వేట నిషేధం నిబంధనలను అధికారుల అండతోనే మత్స్యకారులు తుంగలోకి తొక్కారన్న విషయం దాదాపుగా రుజువైంది. సూర్యారావుపేట తీరంలో సోమవారం నాటి సంఘటనకు ఇందుకు సాక్ష్యం. అధికారుల వసూళ్ల తీరుకు మత్స్యకారుల ఆందోళనకు దిగి వారితో ఘర్షణకు దిగారు. వేట నిషేధ కాలంలో పరిహారం ఇవ్వలేదని, పస్తులు ఉండలేక ఇలా చేశామని మత్స్యకారులు చెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏమేరకు బాధ్యత వహిస్తుందో వేచి చూడాలి.
 
కాకినాడ రూరల్‌ :
సముద్రంలో వేట నిషేధ కాలంలో కుటుంబాలను పస్తులు ఉంచలేక అధికారులను బతిమాలు కొని వేట సాగిస్తున్నందున పదేపదే అధికారుల వసూలు చేస్తుండడంతో మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పరిహారం దక్కక, ఇటు ఆర్థిక ఇబ్బందులతో పస్తులు ఉండలేకపోతున్నామంటూ వారు ఆందోళనకు దిగారు. సూర్యారావుపేట సమీపంలో వేటకు వెళ్లే సమయంలో రూ.వెయ్యి, మళ్లీ వేట నుంచి తిరిగి వస్తున్న బోట్ల  నుంచి రూ.10 వేలు చొప్పున  మత్స్యశాఖ అధికారులు వసూలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. మత్స్యకారులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేట నిషేధ కాలంలో పరిహారం ఇస్తే దొంగచాటుగా వేటకు వెళ్లే అవసరం ఉండేదికాదని మత్స్యకారులు అంటున్నారు. ఒకటి, రెండు రోజులు వేటాడి తెచ్చుకున్న సరుకుపై వచ్చే సొమ్మును మత్స్యశాఖ అధికారులు తీసుకోవడం దారుణమంటూ అధికారులతో వారు ఘర్షణకు దిగారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు మత్స్యకారులు ఈ నెల 5 నుంచే వేటను కొనసాగించేందుకు సముద్రానికి వెళుతున్నారని,  వేటకు వెళ్లే ఒక్కో మత్స్యకారుడు రూ.వెయ్యి చొప్పున మత్స్యశాఖ అధికారులకు నజరానా ఇచ్చుకోవాల్సి వస్తుందని వారు తెలిపారు. వేట ముగిసిన తరువాత మరో రూ.10 వేలు అదనంగా ఇవ్వాలని ఆ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉప్పాడ, సూర్యారావుపేట తదితర ప్రాంతాల్లో మత్స్యశాఖ అధికారుల కనుసన్నల్లోనే వేట సాగిస్తున్నామని చెబుతున్నారు. గత్యంతరం లేక ఇలా చేస్తున్నామని సూర్యారావుపేటకు చెందిన బొండియ్య, పి.ధర్మరాజు, తిక్కాడ పోలేశ్వరి, ఉప్పాడకు చెందిన చొక్కా డానియేలు అంటున్నారు. 
మూడేళ్లుగా చాలా మంది మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రావాల్సిన పరిహారం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఎదిరించి మాట్లాడితే వారిపైనే కేసులు పెట్టి జరిమానాలు వేస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు.
 
ఇద్దమిద్ధంగా చెప్పలేదు..
ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఫిషరీష్‌ ఏడీ ఎన్‌. శ్రీనివాసరావును వివరణ కోరగా  మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం అందించాల్సి ఉందన్నారు. జిల్లాలో 30 వేల మందికి పైగా మత్స్యకారులుండగా చాలా మంది పేర్లు నమోదు కాలేదని, ఇప్పటి వరకు ఆరువేల మందిని మాత్రమే ఆన్‌లైన్‌ చేశామన్నారు. మత్స్యకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయమై ఆయన ఇద్దమిద్ధంగా సమాధానం చెప్పకుండా దాటేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement