
ఆకలి తీరం దాటి...
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: తీర ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. మత్స్యకారులు కోటి ఆశలతో చేపల వేటకు సిద్ధమయ్యారు. 47 రోజుల పాటు ప్రభుత్వం విధించిన వేట నిషేధం గడువు శనివారం అర్ధరాత్రితో పూర్తయింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. బోట్లు, వలలకు మరమ్మతు లు చేసి, వేటకు సిద్ధం చేశారు. జిల్లాలో పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి నుంచి భోగాపురం మండలంలోని చేపలకంచేరు వరకు 28 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం 25 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అందులో వేటకు వెళ్లే వారు 11 వేల మంది వరకు ఉన్నారు. వీరిపై ఆధారపడి మిగిలిన వారు జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మొత్తం 594 పడవలు ఉండగా అందులో ఫైబర్ బోట్లు 139, సంప్రదాయ పడవలు 455 ఉన్నాయి. ఇందులో సంప్రదాయ పడవులకు వేట నిషేధం వర్తించదు. ఫైబర్ బోట్లకు మాత్రం నిషేధాజ్ఞలు తప్పని సరి. అలాకాదని నిబంధనలు ఉల్లంఘించి వేటాడితే రూ.2,500 జరిమానా విధించడంతో పాటు బోటులోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటారు. అయితే జిల్లాలో ఈ ఏడాది అటువంటి పరిస్థితి రాలేదు.
నిషేధం ఎందుకంటే...
ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు చేపలు గుడ్లు పెట్టి, వాటిని పొదిగి పిల్లలుగా మారుస్తాయి. ఈ స మయంలో కన్యాకుమారి నుంచి కోల్‌కతా వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతంలో చేపలు వేటను పూర్తిగా నిషేధిస్తారు. దీనివల్ల మత్స్య సంపదను పరిరక్షించడంతో పాటు వాటి అభివృద్ధికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో 47 రోజుల పాటు సముద్ర తీర మత్స్యకారులు ఖాళీగా ఉండాల్సిందే. ఈసారి ఇంజిన్ బోట్లతో పాటు సంప్రదాయ బోట్లను కూడా అధికారులు వేటకు అనుమతించలేదు.
అందని ప్రభుత్వ సహాయం
వేట నిషేధ సమయంలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బోట్లకు చెందిన మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున ఆర్థికంగా చేయూత అందించవలసి ఉన్నప్పటికీ ఎటువంటి సాయం అందలేదు. 47 రోజుల పాటు మత్స్యకారులు వేట కు దూరమవడంతో ఇటు ఉపాధి లేక, అటు ప్రభుత్వ సా యం అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలో సుమారు 1308 లబ్ధిదారులు ఉండగా అందులో ఒక్కొక్కరికి 31 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. అది ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్న ట్లు మత్స్యశాఖ అధికారులు చెప్పడం విశేషం. దీంతో చాలా మంది మత్స్యకారులు ఉపాధి కోసం వలసబాట పట్టారు.
ప్రత్యేక ప్యాకేజీ లేనట్లేనా...?
వేట నిషేధం సమయంలో తమను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కేరళలో కూడా ప్రత్యేక ప్యాకేజీలు అమలవుతున్నాయి. ఆయా రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేయాలని చాలా కాలంగా మత్స్యకారులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.