100కు పైగా ఆక్వా హబ్‌లు | CM YS Jagan in the implementation of YSR Matsyakara Bharosa | Sakshi
Sakshi News home page

100కు పైగా ఆక్వా హబ్‌లు

Published Wed, May 19 2021 2:48 AM | Last Updated on Wed, May 19 2021 10:24 AM

CM YS Jagan in the implementation of YSR Matsyakara Bharosa - Sakshi

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా చెక్కుతో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, పలువురు మత్స్యకారులు, ఉన్నతాధికారులు

గతంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు దురదృష్టవశాత్తు చనిపోతే పట్టించుకున్న వారు లేరు. కానీ మన ప్రభుత్వం వచ్చాక అలా చనిపోతే వెంటనే గుర్తించాం. 67 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.6.7 కోట్లు ఆర్థిక సహాయం అందజేశాం.

దేవుడి దయ వల్ల మత్స్యకారులకు మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెట్టబోతున్నాం. దీని ద్వారా మత్స్యకారులకు సాంకేతిక పరమైన శిక్షణ ఇచ్చి, వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.    

నాణ్యత లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోకూడదన్న లక్ష్యంతో ఆక్వా సాగు చేస్తున్న 35 నియోజకవర్గాల్లో  రూ.50.30 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేలతో అనుసంధానం చేసి ప్రతి రైతుకు నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్, మందులు సరఫరా చేస్తున్నాం. అన్ని విధాలా తోడుగా ఉంటున్నాం.
 – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆక్వా రైతులతో పాటు ఏ ఒక్క మత్స్యకారుడు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఆక్వా హబ్‌ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఒక్కో హబ్‌ కింద 120 రిటెయిల్‌ షాప్‌ల చొప్పున మొత్తం 12 వేల షాప్‌లు వస్తాయని, రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా ఆక్వా ఉత్పత్తులతో పాటు మత్స్యకారుల చేపలకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. చేపల వేటపై నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద వరుసగా మూడో ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రూ.10 వేల చొప్పున రూ.119.88 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలు, ఆర్బీకేల నుంచి పాల్గొన్న అధికారులు,  మత్స్యకారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ కష్టాలకన్నా, పేదలు, సామాన్యుల కష్టాలు ఇంకా ఎక్కువని భావించి ఇవాళ  మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ.120 కోట్లు జమ చేస్తున్నందుకు ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

మాట నిలబెట్టుకున్నాను
► ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒక వైపు కోవిడ్‌. మరోవైపు ఏప్రిల్‌ 15 నుంచి రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 1.20 లక్షల కుటుంబాలకు రూ.10 వేల సహాయం ఎంతో ఉపయోగపడుతుంది.
► ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే, ప్రతి కుటుంబంలో ఒక అన్నగా, తమ్ముడిగా, అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి, మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నాము. తొలి ఏడాది లక్ష మందితో మొదలు పెట్టగా ఇప్పుడు దాదాపు 1.20 లక్షల మంది లబ్ధిదారులు. ఇప్పటి వరకు దాదాపు రూ.332 కోట్లు నేరుగా మత్స్యకార కుటుంబాలకు చేరవేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను.

అక్క చెల్లెమ్మలకు ప్రతి అడుగులో తోడు
► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో ప్రతి పథకం, ప్రతి అడుగులో.. అక్క చెల్లెమ్మలకు అండగా ఉండాలని, పేదలకు మంచి జరగాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాము. 
► అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, ఆసరా, వైఎస్సార్‌ చేయూత, పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఇళ్ల పట్టాల పంపిణీ.. ఇలా ఏ పథకం చూసినా ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా చూస్తున్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, మీ బిడ్డగా ప్రతి పథకంలో పేదలకు అండగా ఉన్నానని సంతోషంగా చెబుతున్నాను.

గతంలో అలా.. ఇప్పుడు ఇలా..  
► చేపల వేట నిషేధ సమయంలో గతంలో రూ.4 వేలు ఇస్తామని చెప్పినా, ఏనాడూ సక్రమంగా అమలు చేయలేదు. ఏనాడూ సకాలంలో ఇవ్వలేదు. ఇచ్చినా అరకొరగానే ఇచ్చారు. డీజిల్‌పై రూ.6 సబ్సిడీ ఇస్తామన్నా సక్రమంగా ఏనాడూ ఇవ్వలేదు. పైగా కేవలం 5 వేల బోట్లకు మాత్రమే ఇచ్చారు.
► ఇవాళ 26,823 బోట్లకు లీటరు డీజిల్‌కు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాము. అంటే బోట్ల సంఖ్య పెరిగింది. సబ్సిడీ కూడా పెరిగింది. 100 పెట్రోల్‌ బంకులను అందు కోసం కేటాయించాము. డీజిల్‌ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్‌ కార్డుల ద్వారా ఆ రాయితీని బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశాం. దీనికి మరో రూ.48 కోట్లు ఖర్చు చేశామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను.

ఆక్వా రైతులకు అన్ని విధాలా అండ
► మత్స్యకారులకు తోడుగా ఉండడంతో పాటు, ఆక్వా సాగుపై ఆధార పడిన రైతులకు కూడా అండగా నిల్చాం. ఆక్వా సాగుకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే సరఫరా చేయడం ద్వారా 53,550 మంది ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. 
► దీని వల్ల ఏటా దాదాపు రూ.780 కోట్ల భారం పడుతున్నా, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1,560 కోట్ల భారం పడుతున్నా ఆక్వా రైతుల కోసం ప్రభుత్వం సంతోషంగా భరిస్తోంది. ఆక్వా రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం. 

వేగంగా ఫిషింగ్‌ హార్బర్లు
► మన మత్స్యకారులు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస పోయి, తెలిసీ తెలియక విదేశీ సముద్ర జలాల్లోకి ప్రవేశించి, జైళ్ల పాలవుతున్నారని గతంలో ఎవరూ ఆలోచించలేదు. ఆ పరిస్థితి రాకూడదని 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
► గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్ల ఆధునికీకరణతో పాటు, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద కొత్తగా రెండు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టాం.  ఇప్పటికే వీటి పనులు మొదలయ్యాయి.
► ఈ నాలుగు ప్రాజెక్టుల వ్యయం రూ.1,509.80 కోట్లు. రెండో దశలో భాగంగా రూ.1,365.35 కోట్ల అంచనాతో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెడతాం.
► రూ.2,775 కోట్లతో నిర్మించే ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతో దాదాపు 80 వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అందుకే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాము.

ఓఎన్జీసీ ఇవ్వకపోయినా..
► 2012లో జీఎస్‌పీసీ, ఓఎన్జీసీ తవ్వకాల వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలో దాదాపు 14,927 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. ఒక్కో కుటుంబానికి రూ.47,250 పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. వారి గురించి ఎవరూ పట్టించుకోలేదు.
► ఆ కుటుంబాలను ఆదుకుంటానని నా పాదయాత్రలో వారికి హామీ ఇచ్చాను. ఆ తర్వాత అధికారంలోకి రాగానే ముమ్మిడివరంలోనే సమావేశం పెట్టి, రూ.75 కోట్లు ప్రభుత్వమే భరించి ఇచ్చింది. ఆ విధంగా 14,927 కుటుంబాలను ఆదుకుంది. ఓఎన్జీసీ నుంచి ఇంకా ఆ డబ్బులు పూర్తిగా రాలేదు.
► పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి అడుగు ముందుకు వేశామని సగర్వంగా చెబుతున్నా. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. 
► ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మత్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు
కోవిడ్‌ సంక్షోభంలో కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని, పథకాన్ని ఆపకుండా దేశంలోనే మీరు (సీఎం) ఆదర్శంగా నిలుస్తున్నారు. విదేశాల్లో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా తీసుకు వచ్చారు. కోవిడ్‌ సమయంలో వివిధ తీర ప్రాంతాలు, పోర్టుల్లో చిక్కుకుపోయిన మత్య్సకారులను స్వస్థలాలకు తరలించారు. తీర ప్రాంతం ఉన్న ప్రతి జిల్లాకు హార్బర్‌ కట్టించాలన్న మీ ఆలోచనకు ప్రతి మత్స్యకారుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
– సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement