కులవృత్తుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా..అర్హులకే అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మత్స్యకారుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించి సమగ్ర సర్వే చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 3 బృందాలు మత్స్యకారుల పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. అనంతరం ఈ వివరాలను ఆన్‌లైన్ చేస్తున్నారు.
పరకాల రూరల్ : జిల్లా వ్యాప్తంగా 182 సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 15,570 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 35 మహిళా సంఘాల్లో 1600 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సభ్యుల పూర్తి వివరాలతోపాటు గ్రామాల్లోని సంఘాలు, చెరువుల వివరాలను మత్స్య శాఖ నమోదు చేస్తోంది. మత్స్యకారుల సర్వే కోసం అధికారులు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించారు. ఇందులో 21 కాలమ్స్‌తో మత్స్యకారుల పలు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మత్స్యకారుడి పూర్తి పేరు, తండ్రి పేరు, లింగం, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, నామినీ తదితర పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా మత్స్యకార సంఘాలకు సంబంధించి 18 కాలమ్స్‌తో రూపొందించిన ఫార్మాట్, చెరువుకు సంబంధించి 17 కాలమ్స్ ఫార్మాట్ రూపొందించి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 10 మండలాల్లో సర్వే పూర్తయ్యింది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
పథకాల పారదర్శకత కోసమే..
ప్రభుత్వం మత్స్యకారులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు పక్కదారి పట్టకుండా, ఒక్కరే పలుమార్లు లబ్ధి పొందకుండా, అర్హతలను బట్టి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ సర్వేను చేపట్టింది. ఆన్‌లైన్ ప్రక్రియతో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పథకాల అమలు పారదర్శకంగా ఉంటుంది.
మత్స్య శాఖ అమలుచేసే పథకాలు..
♦ 100 శాతం సబ్సిడీతో చేపల మార్కెట్ల అభివృద్ధి
♦ 90 శాతం సబ్సిడీతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు
♦ 80 శాతం సబ్సిడీతో టూరిజమ్ డెవలప్‌మెంట్
♦ 75 శాతం సబ్సిడీతో చేపల తరలింపునకు వాహనాలు
♦ 75 శాతం సబ్సిడీతో వలలు, తెప్పెలు, ట్రేలు
♦ రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీహాల్ భవనాలకు రూ.9 లక్షల చొప్పున కేటాయింపు
♦ సభ్యత్వం ఉన్న ప్రతి మత్స్యకారుడికి రూ. 6 లక్షల ప్రమాద బీమా సౌకర్యం
సర్వేతో మత్స్యకారులకు ఉపయోగం
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మత్స్యకారుడి పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో అతడి స్థితిగతులను అనుసరించి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుంది. ఈ విధానంతో శాఖ పూర్తి పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది. – నరేష్‌కుమార్‌నాయుడు, ఏడీ, మత్స్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment