మత్స్యకారులకు వాయుగండం
-
సముద్రంలోనే 45 బోట్లు, సుమారు 280 మంది మత్స్యకారులు
-
ఒడ్డుకు చేరుకోవాలంటూ సమాచారం అందించే యత్నాల్లో కుటుంబ సభ్యులు
-
ప్రమాదకరంగా బీచ్‌రోడ్డు, కోతకు గురవుతున్న తీరం
పిఠాపురం :
తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో అలల తాకిడి గురువారం సాయంత్రానికి అంతకంతకూ పెరిగింది. తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. కొత్తపల్లి మండలంతోపాటు తొండంగి మండలాలకు చెందిన సుమారు 45 బో ట్లు విశాఖ తీరానికి దూరంగా సముద్రంలో చేపల వేటలో ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వాయుగుండం తీరం దాటే సమయంలో
పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో ఒడ్డుకు వచ్చేయాలంటూ సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం అందించేందుకు కొన్ని బోట్లలో ఉన్న మత్స్యకారులకు సెల్ ఫోన్లు పనిచేయక పోవడంతో సమీపంలో ఉన్న బోట్లలో మత్స్యకారుల ద్వారా సమాచారం అందించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, సుబ్బంపేట, మూలపేట, కోనపాపపేటలకు చెందిన సుమారు 30 బోట్లపై 200 మంది వరకు గత మూడు రోజుల కిందట సముద్రంపై చేపల వేటకు వెళ్లారు. రిలయ¯Œ్స ఫౌండేష¯ŒS ద్వారా వీహెచ్‌ఎఫ్ సెట్ల ద్వారా సమాచారం అందించి వారిని ఒడ్డుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కొత్తపల్లి మండల మత్స్యశాకాధికారిణి చక్రాణి తెలిపారు.
కోతకు గురవుతున్న తీరప్రాంతం
ఉప్పాడ సమీపంలోని తీరప్రాంతం వెంబడి ఉన్న బీచ్ రోడ్డు కడలి ఆగ్రహానికి గురై ముక్కలవుతోంది. గురువారం ఉదయం సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురవ్వగా పలువురి మత్స్యకార గృహాలు ధ్వంసమయ్యాయి. ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణ గోడ సైతం కెరటాలను ఆపలేక ముక్కలవుతోంది. పలుచోట్ల అండలు జారడంతో సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకుని వస్తోంది. గ్రామానికి రక్షణగా బీచ్‌రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ కెరటాల తాకిడికి చెల్లా చెదురై బీచ్ రోడ్డు ఛిద్రమవుతోంది. కెరటాలతోపాటు రాళ్లు, ఎగిరిపడుతుండడంతోపాటు రోడ్డు కోతకు గురవడంతో ఈ రోడ్డు పూర్తిగా కనుమరుగైంది. తీరంలో కెరటాలు సుమారు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగిసి పడుతున్నాయి. ఉప్పాడ తీరం వెంబడి ఉన్న పంట పొలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తోంది.
రూ.కోట్ల పనులు కడలిపాలు..
బీచ్ రోడ్డు రక్షణ పేరుతో ఇటీవల కాలంలో ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టిన సుమారు రూ,15 కోట్ల రక్షణ గోడ నిర్మాణ పనులు నిరుపయోగంగా మిగిలాయి. ఆ గోడ ఒక్క రోజులోనే తునాతునకలయ్యింది. అది రక్షణ ఇవ్వదని తెలిసినా కేవలం నిధులను ఖర్చుచేసినట్లు చూపించేందుకు మాత్రమే అధికారులు ప్రయత్నిస్తున్నారు.