
సమ్మె విరమణ
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హామీతో రామేశ్వరం, పాంబన్ జాలర్లు సమ్మె బాట వీడారు. వే ట నిమిత్తం కడలిలోకి వెళ్లడానికి నిర్ణయించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ జాలర్లు ఎవ్వరూ సరిహద్దులు దాటొద్దని సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ జరిగే వరకు సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లొద్దని సూచించారు.
సాక్షి, చెన్నై : కడలిలో తమకు భద్రత లేకపోతుండడంతో జాలర్లు తీవ్ర ఆందోళనలో పడ్డ విషయం తెలిసిందే. శ్రీలంక దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో జాలర్ల సంఘాలు ఉన్నాయి. ఆ దిశగా తమ మీద దాడులకు నిరసిస్తూ, శ్రీలంక చెరలో ఉన్న పడవలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రామేశ్వరం, పాంబన్, రామనాథ పురం, పుదుకోట్టై జాలర్లు సమ్మె బాట పట్టారు. తమ వాళ్ల విడుదలతో పుదుకోట్టై జాలర్లు రెండు రోజుల్లో సమ్మె విరమించుకోగా, మిగిలిన ప్రాంతాల్లోని జాలర్లు సమ్మె కొనసాగిస్తూ వచ్చారు. తమ వాళ్లను శ్రీలంక సర్కారు విడుదల చేసినా, ఇక్కడి జాలర్లు మాత్రం తగ్గలేదు. తమ పడవలను తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో సమ్మె కొనసాగిస్తూ వచ్చారు. వీరి సమ్మెతో దేశ విదేశాలకు చేపల ఎగుమతి ఆగిపోయి ంది. కోట్లాది రూపాయల నష్టం సంభవించింది. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లు కొంత మేరకే విడుదలయ్యారని, మిగిలిన వారు ఆదేశ చెరలోనే మగ్గుతున్నారని, అందరూ విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాలర్ల సంఘాలు ఏకమయ్యాయి.
రాధాతో సమాలోచన : తమ వాళ్లందరినీ విడుదల చేయాలని, పడవలను తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో జాలర్ల సంఘాల ప్రతినిధులు శనివారం చెన్నైకు వచ్చారు. కమలాలయంలో కేంద్ర మంత్రులు పొన్ రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు. వీరిద్దరి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గంటన్నర పాటుగా జరిగిన ఈ సమావేశంలో పొన్ రాధాకృష్ణన్ ఇచ్చిన హామీకి జాలర్ల సంఘాలు సంతృప్తి చెందాయి . కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని, కొన్నాళ్లు సరిహద్దులు దాటకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
సమ్మె విరమణ: కమలాలయంలో భేటీ అనంతరం రామేశ్వరం వెళ్లిన జాలర్ల సంఘాల ప్రతినిధులు, తమ వాళ్లతో సమాలోచనలు జరిపారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమించేందుకు నిర్ణయించారు. అయితే, కొన్నాళ్లు ఏ ఒక్కరూ కడలిలోకి వెళ్లొద్దని, ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులు మాత్రం దాటొద్దంటూ జాలర్లందరూ కలసి కట్టుగా తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అంత వరకు జాలర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సంఘాల నేతలు సూచించారు. కడలిలోకి వెళ్లి శ్రీలంక చేతిలో చిక్కొద్దని, శ్రీలంక తీరంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించి ఉన్నారు. మోడీతో భేటీ అనంతరం తీసుకునే నిర్ణయాల మేరకు తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తామని తీర్మానించారు. ఆదివారం అర్థరాత్రి నుంచి చేపల వేట నిమిత్తం మళ్లీ కడలిలోకి వెళ్లడానికి నిర్ణయించారు.