Strike withdraw
-
మార్పు మంచికే..!
సాక్షి, హైదరాబాద్: ఓ 25 రోజుల క్రితం.. అసలు ఆర్టీసీ మనుగడ ఏంటన్న పరిస్థితి. సంస్థ ఉంటుం దా లేదా అన్న అనుమానం. మోయలేని నష్టాలు, భరించలేని అప్పులు.. ఆర్టీసీని దెబ్బతీశాయి. అలాంటి ఆర్థిక సంక్షోభంతోనే రికార్డుస్థాయి సమ్మె జరిగేలా చేసింది. కానీ... సమ్మెకు పూర్వం ఆర్టీసీలో పరిస్థితి, ప్రస్తుత స్థితిలో ఎంతో తేడా. పని ప్రారంభించిన ఈ 25 రోజుల్లో ప్రత్యక్షమైన వాతావరణానికి గత స్థితికి పొంతనే లేదు. ఇటు కార్మికుల్లో, అటు అధికారుల ప్రవర్తనలో కొట్టొచ్చే తేడా.. వెరసి ఆర్టీసీ స్వరూపాన్నే మార్చే సంకేతాలిస్తున్నాయి. ఆర్టీసీ ఉండదేమో అనుకున్న స్థితిలో ఆందోళనకు గురైన సిబ్బంది, అధికారులు... సంస్థ కొనసాగటంతో ఊరట చెంది కొత్త ఉత్సాహంతో సవాల్‌గా స్వీకరించి పని ప్రారంభించమే దీనికి కారణం. సమ్మె ముగిసిన వారంలోపే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు డిపోకు ఐదుగురు చొప్పున సిబ్బందితో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఆ జోష్‌ను మరింత పెంచింది. వారి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు వరాల జల్లు కురిపించటమే కాకుండా, అధికారులు–కార్మికులు అన్న తేడా లేకుండా అంతా కలిసి సుహృద్భావ వాతావరణంలో పనిచేయాలంటూ చేసిన సూచనలు మంచి మార్పును తెచ్చాయి. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెరిగిన చార్జీలు తెచ్చే అదనపు ఆదాయం కంటే.... ఇరుపక్షాల్లో వచ్చిన మార్పు వల్ల మనస్ఫూర్తిగా పనిచేసే తత్వం పెరిగి సంస్థ పురోగతిలో కనిపిస్తున్న బూస్టప్ పెద్దది. ఈ 25 రోజుల్లో మారిన పరిస్థితిపై అధికారులు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇలా... గైర్హాజరీ అప్పుడు ఇప్పుడు 10 % 03% సమ్మెకు పూర్వం చాలా డిపోల్లో చెప్పా పెట్టకుండా సిబ్బంది గైర్హాజరవటం ఉం డేది. డ్యూటీ బుక్కైన తర్వాత కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ఉన్నఫళంగా విధులకు గైర్హాజరయ్యేవారు. వేరే సిబ్బందిని కేటాయించే వీలు లేక కొన్ని సర్వీసులు డిపోలకే పరిమతమయ్యేవి. సగటున పది శాతం మంది సిబ్బంది ఈ జాబితాలో ఉండేవారు. ఫలితంగా ప్రయాణికులకు, ఆదాయం పరంగా ఆర్టీసీకి ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు తీరు మారింది. ఆరోగ్య సమస్యలతో మినహా ఈ తరహా గైర్హాజరీ 3 శాతానికి తగ్గిపోయింది. పంక్చువాలిటీ: అప్పుడు ఇప్పుడు 88% 95% ప్రతి బస్సుకు సమయం ఉంటుంది. దాని ఆధారంగా సిబ్బంది డ్యూటీ సమయాలు షెడ్యూల్ అవుతాయి. కానీ మొత్తం సిబ్బందిలో సగటున 12 శాతం మంది దీన్ని పాటించేవారు కాదు. సరిగ్గా బస్సు బయలుదేరేవేళకు వచ్చేవారు. బస్సు సిద్ధం చేసుకుని భద్రత పరమైన వ్యవహారాలు చూసుకుని బస్సు హ్యాండ్ ఓవర్ చేసుకునే డ్యూటీ టేకింగ్ ఓవర్‌కు 20 నిమిషాల సమయం అవసరం. దీంతో బస్సు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చేది. దీనివల్ల అన్ని పాయింట్లకు బస్సు ఆలస్యంగా వెళేంది. ఇప్పుడు సగటున 5 శాతం మంది తప్ప మిగతావారంతా రావాల్సిన సమయానికి కనీసం ఐదు నిమిషాలు ముందే ఉంటున్నారు. పద్ధతిగా బస్సు అప్పుడు ఇప్పుడు 60% 95% బస్సు ఏ ప్రాంతానికి వెళ్తుందో తెలియాలంటే ముందు, వెనక బోర్డు ఉండాలి. తర్వాత సీట్లు, ఫ్లోర్ చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉండాలి. ఇదంతా డ్రైవర్, కండక్టర్లపై ఆధారపడి ఉంటుంది. గతంలో దాదాపు 40 శాతం మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. అందుకే చాలా బస్సులు దుమ్ముకొట్టుకుపోయి ఉండటం, బస్సుల్లో ఊరిపేరుతో ఉండే బోర్డుల మార్పు పంక్చువల్‌గా లేకపోవటం, వెనకవైపు బోర్డులు ఏర్పాటు చేయకపోవటంలాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వందలో ఐదు తప్ప అన్నీ పద్ధతిగా తిరుగుతున్నాయి. స్వచ్ఛంద ట్రిప్పుల రద్దు అప్పుడు ఇప్పుడు 8% 0.2% 8 గంటల డ్యూటీ విషయంలో సిబ్బంది పట్టింపుగా ఉంటారు. రకరకాల కారణాలతో చివరి ట్రిప్పు ఆలస్యంగా మారినప్పుడు కొందరు మధ్యలోనే దాన్ని మళ్లించి డిపోకు వచ్చేవారు. ఇలా బస్సులు తిరగాల్సిన మొత్తం కిలోమీటర్లలో నిత్యం సగటున 8 శాతం కోతపడేది. ఇప్పుడు అది కేవలం 2 శాతంగా ఉంటోంది. సిబ్బంది– అధికారుల మధ్య సత్సంబంధాలు అప్పుడు ఇప్పుడు 80% 90% కార్మిక సంఘాల ఎన్నికలు విషయంలో తప్ప కొత్త సమస్యలు పెద్ద గా లేవు. దీంతో గతంతో పోలిస్తే సంబంధాలు మెరుగుపడ్డాయి. తొలి పక్షం రోజులు మరింత మెరుగ్గా ఉంది. గత వారం రోజులుగా కొన్ని డిపోల్లో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అప్పుడు ఇప్పుడు 20% 5% ప్రయాణికులున్నా బస్సు ఆపకపోవటం, టికెట్ల జారీ, చిల్లర ఇచ్చే విషయం, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించటం... గతంలో ప్రతి డిపోలో సగటున నిత్యం మూడు నుంచి నాలుగు ఫిర్యాదులు ప్రయాణికుల నుంచి అందేవి. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ ఉన్నతాధికారులకూ ఫిర్యాదులు వచ్చేవి. 20 శాతం మందిపై ఈ తరహా ఫిర్యాదులుండేవి. ఇప్పుడవి 5 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు చెయ్యెత్తినా బస్సు ఆపుతున్నారు. -
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వారితో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. వారు తక్షణం విధులకు హాజరవుతారు. ఆస్పత్రులలో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ వారికి హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. డాక్టర్లకు రక్షణగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సును నియమిస్తామన్నారు. జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు రాజయ్య తెలిపారు. హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి డాక్టర్లపై జరిగిన దాడిని ఖండించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను మెరుగుపరుస్తామని చెప్పారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందించడమే తమ లక్ష్యం అన్నారు. -
సమ్మె విరమణ
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హామీతో రామేశ్వరం, పాంబన్ జాలర్లు సమ్మె బాట వీడారు. వే ట నిమిత్తం కడలిలోకి వెళ్లడానికి నిర్ణయించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ జాలర్లు ఎవ్వరూ సరిహద్దులు దాటొద్దని సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ జరిగే వరకు సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లొద్దని సూచించారు. సాక్షి, చెన్నై : కడలిలో తమకు భద్రత లేకపోతుండడంతో జాలర్లు తీవ్ర ఆందోళనలో పడ్డ విషయం తెలిసిందే. శ్రీలంక దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో జాలర్ల సంఘాలు ఉన్నాయి. ఆ దిశగా తమ మీద దాడులకు నిరసిస్తూ, శ్రీలంక చెరలో ఉన్న పడవలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రామేశ్వరం, పాంబన్, రామనాథ పురం, పుదుకోట్టై జాలర్లు సమ్మె బాట పట్టారు. తమ వాళ్ల విడుదలతో పుదుకోట్టై జాలర్లు రెండు రోజుల్లో సమ్మె విరమించుకోగా, మిగిలిన ప్రాంతాల్లోని జాలర్లు సమ్మె కొనసాగిస్తూ వచ్చారు. తమ వాళ్లను శ్రీలంక సర్కారు విడుదల చేసినా, ఇక్కడి జాలర్లు మాత్రం తగ్గలేదు. తమ పడవలను తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో సమ్మె కొనసాగిస్తూ వచ్చారు. వీరి సమ్మెతో దేశ విదేశాలకు చేపల ఎగుమతి ఆగిపోయి ంది. కోట్లాది రూపాయల నష్టం సంభవించింది. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లు కొంత మేరకే విడుదలయ్యారని, మిగిలిన వారు ఆదేశ చెరలోనే మగ్గుతున్నారని, అందరూ విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాలర్ల సంఘాలు ఏకమయ్యాయి. రాధాతో సమాలోచన : తమ వాళ్లందరినీ విడుదల చేయాలని, పడవలను తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో జాలర్ల సంఘాల ప్రతినిధులు శనివారం చెన్నైకు వచ్చారు. కమలాలయంలో కేంద్ర మంత్రులు పొన్ రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు. వీరిద్దరి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గంటన్నర పాటుగా జరిగిన ఈ సమావేశంలో పొన్ రాధాకృష్ణన్ ఇచ్చిన హామీకి జాలర్ల సంఘాలు సంతృప్తి చెందాయి . కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని, కొన్నాళ్లు సరిహద్దులు దాటకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సమ్మె విరమణ: కమలాలయంలో భేటీ అనంతరం రామేశ్వరం వెళ్లిన జాలర్ల సంఘాల ప్రతినిధులు, తమ వాళ్లతో సమాలోచనలు జరిపారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమించేందుకు నిర్ణయించారు. అయితే, కొన్నాళ్లు ఏ ఒక్కరూ కడలిలోకి వెళ్లొద్దని, ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులు మాత్రం దాటొద్దంటూ జాలర్లందరూ కలసి కట్టుగా తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అంత వరకు జాలర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సంఘాల నేతలు సూచించారు. కడలిలోకి వెళ్లి శ్రీలంక చేతిలో చిక్కొద్దని, శ్రీలంక తీరంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించి ఉన్నారు. మోడీతో భేటీ అనంతరం తీసుకునే నిర్ణయాల మేరకు తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తామని తీర్మానించారు. ఆదివారం అర్థరాత్రి నుంచి చేపల వేట నిమిత్తం మళ్లీ కడలిలోకి వెళ్లడానికి నిర్ణయించారు.