సారీ.. చిన్నారి
శనివారం అర్ధరాత్రి వరకూ దొరకని పాప జాడ
- చిన్నారి మరణించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణ!
- 40 అడుగుల వద్దే ఉండి ఉంటుందని భావిస్తున్న యంత్రాంగం
- బోరులోని మోటారు తీయడంతో పక్కన మట్టిలో కూరుకుపోయిందా?
-180 అడుగుల్లో నీటిలో పడిపోయి ఉంటుందా?
- అత్యాధునిక కెమెరాలతో పరిశీలించినా లభించని ఆచూకీ
- మొత్తం బోరుబావిని పెకలించాలని నిర్ణయం
- 40 అడుగుల వరకు చుట్టూ తవ్వేస్తున్న సహాయక సిబ్బంది
- అయినా ఆచూకీ లభించకపోతే ఫ్లషింగ్ చేయాలని యోచన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, చేవెళ్ల/ మొయినాబాద్/ షాబాద్: క్షణక్షణం ఉత్కంఠ.. చిన్నారి జాడ కనిపించకపోతుందా.. ఆఖరి చూపైనా దక్కకపోతుందా అన్న ఆవేదన.. బోరుబావిలో పడి 50 గంటలు దాటిపోవడం, ఆమె ఆచూకీ కూడా లేకపోవడంతో చిన్నారి మృతి చెంది ఉంటుందని శనివారం రాత్రి అధికార యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కనీసం ఆమె దేహాన్నైనా వెలికితీసి తల్లిదండ్రులకు అప్పగించాలన్న ఆలోచనతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
360 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరించగల ప్రత్యేక కెమెరాలను తెప్పించి పరిశీలించినా.. శనివారం అర్ధరాత్రి వరకూ పాప జాడ తెలియరాలేదు. శుక్రవారం బోరుబావిలోని మోటారును పైకి తీసినప్పుడు చిన్నారి బోరు పక్కభాగంలో మట్టిలో కూరుకుపోయి ఉంటుందని.. 40 అడుగుల లోతు లోపలే ఉండి ఉంటుందన్న అంచనాకు వచ్చారు. బోరుబావిలో 40 అడుగుల కిందకు ఏదీ పడిపోకుండా అడ్డు ఏర్పాటు చేసి.. మొత్తంగా బోరుబావిని పెకలిస్తున్నారు. ఒకవేళ 40 అడుగుల వరకు తవ్వాక చిన్నారి ఆచూకీ లభించకపోతే.. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. దీనికోసం కేఎల్‌ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు.
దొరకని జాడ
గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో చిన్నారి అనే ఏడాదిన్నర పాప బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తొలుత 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. దీంతో శనివారం ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా పాప ఆనవాళ్లు కనబడలేదు. దాంతో అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించారు.
అయినా పాప ఎక్కడ చిక్కుకుపోయిందనేది తేలకపోవడంతో సహాయక చర్యలపై తర్జనభర్జన జరిగింది. పాప బోరుబావి పక్క భాగంలో భూమిలో అతుక్కుపోయిందా? లేక కిందకు జారిన పాపపై మట్టి పెళ్లలు పడడంతో కెమెరాలకు కనిపించడం లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. దీంతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, అధికారులు చర్చించి.. బోరుబావి పెకలించాలని నిర్ణయించారు.
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా..
పాపను బయటికి తీసేందుకు సహాయక బృందాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతుండడంతో.. తమకు తెలిసిన పరిజ్ఞానంతో పాపను బయటకు తీస్తామని చెప్పిన వారందరికీ అవకాశం కల్పించారు. బోరుబావిలోకి కొక్కెం వేసి, అది పాప దుస్తులకు చిక్కుకుంటే బయటికి లాగాలని ప్రయత్నించారు. అది ఫలించలేదు. అలాగే బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లను లాగేందుకు ఉపయోగించే పంజరం లాంటి యంత్రాన్ని సైతం వినియోగించారు.
తర్వాత బోరుబావి అడుగున నీళ్లు, బురద ఉండటంతో సీసీ కెమెరాలకు పాప కనిపించటం లేదని.. అందులో ఉన్న నీటిని మోటారు సహాయంతో తోడేశారు. అయినా చిన్నారి కనిపించలేదు. చివరికి ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అధునాతన సైడ్ కెమెరాలను హైదరాబాద్ నుంచి తెప్పించారు. పాప బోరు మధ్యలో ఎక్కడైనా కూరుకుపోయిందా అనేది వాటితో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.
చేతులెత్తేసిన ఓఎన్‌జీసీ బృందం
మూడు రోజులుగా సేవలందిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి తోడుగా ముగ్గురు సభ్యుల ఓఎన్‌జీసీ బృందం శనివారం వేకువజామున ఘటనాస్థలికి చేరుకుంది. ఓఎన్‌జీసీ డీజీఎం శ్రీహరి, ఎస్‌ఈ కేవీసీఎస్ రావు, ఈఈ మహేశ్‌కుమార్‌లు బోరుబావిని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఇక్కడి పరిస్థితులు అనుకూలించవని వారు స్పష్టం చేశారు.
బారుబావి యాజమానిపై కేసు నమోదు
ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోరు బావిని నిర్లక్ష్యంగా వదిలేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రఘునందన్‌రావు చెప్పారు.
బోరుబావిని పెకిలిస్తున్న యంత్రాంగం
బోరుబావిలో పడిన చిన్నారి 40 అడుగుల లోతులోనే చిక్కుకుని ఉంటుందని సహాయక యంత్రాంగం భావిస్తోంది. బోరుబావి 40 అడుగుల లోతు వరకు 9 అంగుళాల వెడల్పు ఉంటుంది. 40 అడుగుల కింది నుంచి 6 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది. పాప శరీరం 8 అంగుళాల వెడల్పు ఉన్నందున 40 అడుగుల కన్నా కిందికి పాప పడిపోకపోవచ్చని భావిస్తున్నారు.
40 అడుగుల లోతు నుంచి కిందకు ఏమి పడిపోకుండా 40 అడుగుల లోతులో బోరుబావిని బ్లాక్ చేశారు. 40 అడుగులపైన ఉన్న బోరుబావిని మొత్తం ఇటాచీలతో పెకలిస్తున్నారు. అలాగైనా చిన్నారి జాడ బయటపడని పక్షంలో 40 అడుగుల నుంచి చివరి ప్రయత్నంగా ఫ్లషింగ్ చేసి పాపను బయటకు తీస్తామని అధికార యంత్రంగం, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి తెలిపారు.
చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి
న్నారిని వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తదితరులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పరిశీలించారు.
చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని చెప్పారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నీళ్లు లేని బోరుబావులు ఎక్కడైనా ఉంటే వెంటనే మూసివేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సూచించారు. అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాపను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
మృత్యుంజయురాలు ఈ అంజలి
- రెండేళ్ల క్రితం బోరుబావిలోపడి క్షేమంగా బయటికి...
- ‘చిన్నారి’కూడా బతకాలని ఆకాంక్షించిన అంజలి
చిన్నతనంలోనే తరుముకుంటూ వచ్చిన మృత్యువును ఎదిరించింది ఈ చిన్నారి. 2015లో బోరుబావిలో పడి ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రస్తుతం తోటి విద్యార్థులతో బడిలో ఆడుతూపాడుతూ చదువుకుంటోంది. రెండు రోజులక్రితం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బోరుబావిలో చిన్నారి పడిపోయిన విషయం విదితమే. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలో జరిగిన బోరుబావి ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి అనుబంధ గ్రామమైన గోవింద్‌పల్లి తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్ కూతురు కొర్ర అంజలి 2015, జనవరి 14న తల్లిదండ్రుల వెంట పొలానికి వెళ్లింది. ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు.. సుమారు 20 ఫీట్ల లోతులో పడిపోయిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అంజలి సల్కర్‌పేట్ మినీ గురుకుల పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది.
నన్ను బోరు అంజలి అంటారు
నేను చిన్నగున్నపుడు బోరులో పడి బతికినందుకు నన్ను బోరు అంజలి అని పిలుస్తారు. మా అమ్మానాన్నలు కూడా నా దగ్గర లేనందుకు నన్ను అందరూ ఆప్యాయంగా చూసుకుంటారు. రెండ్రోజుల క్రితం నాలాగే బోరుబావిలో పడిన చిన్నారి కూడా బతికితే బాగుండు.