సాక్షి, ములుగు: ఉత్కంఠకు తెర దించుతూ పర్యాటకులందరినీ ఎన్డీఆర్‌ఎఫ్ రక్షించింది. ములుగు అడవుల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న మొత్తం పర్యాటకులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు.
వర్షాకాలం సీజన్ కావడంతో వీరభద్రం గ్రామం సమీపంలోని ముత్యంధార Muthyaladhara Waterfall జలపాతం చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు పర్యాటకులు అడవుల్లో చిక్కుకుపోయారు. దీంతో వీలైనంత త్వరగా వాళ్లను రక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులతో పాటు రెస్క్యూ టీం వాళ్లను రక్షించే యత్నం చేశారు. కానీ, వీలుకాలేదు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది.
దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వాళ్లను రక్షించారు. బాధితులను అంకన్నగూడెంకు చేర్చగా.. అక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీ వాళ్లను రిసీవ్ చేసుకున్నారు.
ముత్యంధార జలపాతం దేశంలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటిగా పేరుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్‌లో దీనిని చూసేందుకు జనం ఎక్కువగా వస్తుంటారు. వీరభద్రం గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతానికి చేరుకుంటారు పర్యాటకులు.
Comments
Please login to add a commentAdd a comment