ఆంటాక్యా/జందారిస్: ఆశలు అడుగంటుతున్నాయి. శిథిలాల కింద సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారిని కాపాడగలమన్న నమ్మకం తగ్గిపోతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో 19 వేల మందికి పైగా మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా శిథిలాల కింద లక్షలాది మంది ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
సహాయ చర్యల్లో లోపాలున్నాయని తుర్కియే అధ్యక్షుడు తయిపీ ఎర్డోగన్ స్వయంగా అంగీకరించారు. ఈ స్థాయిలో ప్రళయం సంభవిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. భూకంపం వచ్చిన ప్రాంతం దేశంలో ఒక మారుమూల ఉండడంతో సహాయ బృందాలను పంపించడంలో ఆలస్యమైందని అన్నారు. మరోవైపు భూకంపానికి ఇళ్లు కోల్పోయిన వారు వీధుల్లోనే కాలం గడుపుతున్నారు. చలి తట్టుకోలేక వారంతా తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. చాలా మంది రాత్రి వేళల్లో రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లలో ఉంటున్నారు.
ఆ 72 గంటలు ముగిశాయ్..!
భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి మూడు రోజులే అత్యంత కీలకం. ఈ 72 గంటల్లో ఎంతమందిని కాపాడారన్నదే ముఖ్యం. ఆ తర్వాత శిథిలాలు తొలగించినా ప్రాణాలతో బయటపడేవారి సంఖ్య చాలా తక్కువ. గురువారం ఉదయానికి 72 గంటలు గడిచిపోవడంతో ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. భూకంపాల సమయంలో మొదటి మూడు రోజుల్లో సర్వ సాధారణంగా 90శాతం మందిని బాధితుల్ని రక్షిస్తారు. మూడు రోజులు దాటితే శిథిలాల కింద ఉన్న వారికి మంచినీళ్లు, ఆహారం అందించాలి. అవి అందక మిగిలిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టంగా మారుతుంది.
ఆరేళ్ల బాలికను కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
తుర్కియేలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) శిథిలాల కింద నలిగిపోతున్న ఆరేళ్ల బాలికను కాపాడాయి. మన దేశం నుంచి వెళ్లిన మూడు బృందాలు అలుపెరుగకుండా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ ట్వీట్ చేసింది. ‘‘భారత్‌కు చెందిన సహాయ బృందం నర్డగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను కాపాడింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ చేస్తున్న సహాయానికి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. ఆ బాలికను కాపాడిన వీడియోను కూడా షేర్ చేశారు.
హైపోథెర్మియా ముప్పు
తుర్కియేలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న అడియమాన్ ప్రావిన్స్‌లో బాధితులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూకంపం వచ్చి నాలుగు రోజులైనా సహాయ సిబ్బంది ఎవరూ రాలేదని రెసాట్ గొజ్లు అనే బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. శిథిలాల కింద ఉన్న వారిలో చాలా మంది హైపోథెర్మియా పరిస్థితులతో మరణించారని తెలిపారు. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే, ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉంటే దానిని హైపోథెర్మియా అని అంటారు. గట్టకట్టించే చలిలో బాధితుల శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయి మరణిస్తారు.
దేశమే జరిగింది...!
తుర్కియే (టర్కీ)లో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే తుర్కియేలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు.
భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్‌లో బస చేశారు.
కాపాడడమూ కష్టమే..!
భూకంపం శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి వారిని కాపాడడం అంత తేలిౖMðన విషయం కాదు. సహాయ సిబ్బందితో పాటు బాధితులు కూడా సహకరించాలి. అందుకు ఈ ఫొటో నిదర్శనం. తుర్కియేలోని తీవ్ర విధ్వంసం జరిగిన హతేలో ఇంటి పైకప్పు మొత్తం మీద పడిపోవడంతో కాళ్లు కదల్చలేని స్థితిలో అబ్దుల్‌అలీమ్ అనే వ్యక్తి ఉన్నాడు. అంత పెద్ద శ్లాబుని తొలగించి అతనిని బయటకు తీసుకురావడం సహాయ సిబ్బందికి కష్టమైంది. అబ్దుల్‌ను కాపాడినా అతని భార్య, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదం. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఒక ప్రాణాన్ని కాపాడడానికి 10 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని తుర్కియే ప్రభుత్వం అంచనా వేస్తోంది.
సిరియాలో సహాయానికి అంతర్యుద్ధమే అడ్డు
భూకంపం సంభవించిన ప్రాంతాలు ఎవరి అధీనంలో?
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో సంభవించిన భూకంపంలో సహాయ కార్యక్రమాలు సరిగా కనిపించడం లేదు. దేశంలోకి వెళ్లడానికి కేవలం రెబెల్స్ అధీనంలో ఒకే ఒక మార్గం తీసి ఉంది. సాయం అందించడం కోసం వచ్చిన అంతర్జాతీయ సంస్థలు సిరియాలో ఒక్కో ప్రాంతం ఒక్కొక్కరి అధీనంలో ఉండడంతో ముందుకు వెళ్లడానికి సవాలక్ష అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కుర్దులు, సిరియన్ తిరుగుబాటుదారులు, జిహాదీ శక్తులు, తుర్కియే మిలటరీ మద్దతున్న రెబెల్స్, సిరియా ప్రభుత్వం ఇలా దేశం మొత్తం పలువురి అధీనంలో ఉండడం సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment