ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దుర్ఘటన.. 278 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంకా వంద దాకా మృతదేహాల్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఎంబాంబింగ్ ద్వారా మృతదేహాల్ని ఎంతో కాలం భద్రపర్చలేమని అంటున్నారు అధికారులు. మరోవైపు గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు అయినవాళ్లు పడుతున్న ఆరాటం దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంకోపక్క ఆ మృతదేహాలు తమవాళ్లవేనంటూ నాటకాలతో పరిహారం దక్కించుకునేందుకు కొందరు చేస్తున్న దుర్మార్గ ప్రయత్నాలు సైతం వెలుగు చూస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. నీళ్లను చూసిన ప్రతిసారి దాన్ని రక్తంగా ఒకాయన భావిస్తుంటే.. మరో సిబ్బంది ఆ శవాల గుట్టలను చూశాక ఆకలి కోరికే మరచిపోయారట. ఇలా తమ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ వెల్లడించారు.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ బాలాసోర్ యాక్సిడెంట్ ఆ పరిస్థితులను వివరిస్తూ.. ‘ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. నీటిని చూసిన ప్రతిసారి రక్తమేనని ఒక సిబ్బంది భ్రమ పడుతుంటే.. మరొకరు మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆకలి కోరికే పోయిందని చెప్పారు. ఇలా మా సిబ్బంది ఎదుర్కొంటున్న ఈ తరహా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు 300మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. వీళ్‌లకు స్థానికులు కొందరు సహకరించడం గమనార్హం. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో ఎన్డీఆర్‌ఎఫ్ కీలకంగా వ్యవహరించింది. దాదాపు 44 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీయగా.. 121 మృతదేహాలను వెలికి తీశారు.
విపత్తుల వేళ ఎంతో గుండె నిబ్బరం ప్రదర్శించే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిలో.. కొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు స్వయానా ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ వెల్లడించడం గమనార్హం.
ఇదీ చదవండి: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి?
Comments
Please login to add a commentAdd a comment