ప్రతీకాత్మక చిత్రం
తోట్లవల్లూరు/పద్మనాభం: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, విశాఖ జిల్లా పాండ్రంగిలో కార్తీక సోమవారం సందర్భంగా నదీస్నానం ఆచరిస్తూ ఓ బాలుడు, ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి యువకుల మృతదేహాలను వెలికితీయగా.. బాలుడు, మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామానికి చెందిన సుమారు 10 మంది యువకులు సోమవారం వేకువజామున 4.30 గంటల సమయంలో స్థానిక కృష్ణా నది పాయలో స్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. వారిలో ఐటీఐ చదువుతున్న గొరిపర్తి నరేంద్ర (18), గొరిపర్తి పవన్ (18) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గొరిపర్తి శివనాగరాజు (20) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
గ్రామస్తులు, మత్స్యకారులు నదీపాయలో గాలించగా.. శివనాగరాజు, పవన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. నరేంద్ర ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కనుగొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్‌ఐ అర్జున్, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ జె.నివాస్‌తో ఫోన్‌లో చర్చించి తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఇచ్చే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు.
ఆశల దీపం గల్లంతు
విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో చోటుచేసుకున్న మరో ఘటనలో రేవిడి గ్రామానికి చెందిన మరగడ యశ్వంత్‌కుమార్‌రెడ్డి (9) అనే బాలుడు గోస్తనీ నది వద్ద కాజ్‌వే గట్టున స్నానం చేస్తూ నదిలో కొట్టుకుపోయాడు. యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లి వెంకటలక్ష్మితో కలిసి సోమవారం ఉదయం 5.15 గంటల సమయంలో నదీ స్నానానికి వెళ్లాడు. తల్లి వెంకటలక్ష్మి తోటి మహిళలతో కలిసి నదిలో కాజ్‌వేపై స్నానం చేస్తుండగా.. యశ్వంత్ మరో బాలుడితో కలిసి కాజ్‌వే ఒడ్డున స్నానానికి ఉపక్రమించాడు. అక్కడ నాచు పట్టి ఉండటంతో యశ్వంత్ కాలు జారి నదిలో పడిపోయాడు.
జాలర్లు, గజ ఈతగాళ్లు నదిలో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు 18 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. సాయంత్రం 5.30 గంటల వరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసి మళ్లీ మంగళవారం కొనసాగించనున్నారు. బాలుడు కృష్ణాపురంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతుండగా.. తండ్రి గౌరిరెడ్డి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment