రాష్ట్రానికీ ఓ ‘డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ | National Disaster Response Force to andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికీ ఓ ‘డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’

Published Wed, Jan 1 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

రాష్ట్రానికీ ఓ ‘డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’

రాష్ట్రానికీ ఓ ‘డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’

డీజీపీ ప్రసాదరావు వెల్లడి
250 మందితో ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ ఏర్పాటు
బోగీ దగ్ధం కేసులో విద్రోహ చర్యల కోణంలోనూ దర్యాప్తు
పెరిగిన రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు
తగ్గిన నక్సలైట్ల కార్యకలాపాలు, హత్య కేసులు
 
 సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్రం అధీనంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) ఉన్నట్లే రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటైంది. ప్రాథమికంగా 250 మందితో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ మరో ఆరు నెలల్లో పని చేయడం ప్రారంభిస్తుందని డీజీపీ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు నిర్మాణాలు కూలిన సందర్భంలోనూ ఈ దళం సేవలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మంగళగిరిలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ లేదా హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా) అధీనం లో ఉండే కోలాప్డ్స్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్‌ఎస్‌ఆర్) బృం దాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఒక్కోసారి ప్రాణనష్టం పెరుగుతోంది. ఈ ఏడాది వరుసగా వచ్చిన పైలీన్, హెలెన్, లెహర్ తుఫాన్ల సందర్భంలో రెవెన్యూ యంత్రాంగానికి పోలీసులు గణనీయ సేవలందించారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని సహాయ శిబిరాలకు తరలించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ అనుభవంతో పోలీసు విభాగంలోనూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచించిన డీజీపీ, ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌కు అంకురార్పణ చేశారు.
 
 డీజీపీ చెప్పిన మరికొన్ని అంశాలివీ
 
 బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన వెనుక విద్రోహ చర్యేలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది శేషాచలం అడవుల్లోని ఏడు రీజియన్లలో ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించేందుకు అటవీశాఖ అధికారులకు సాయంగా రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ), ఆర్ముడ్ రిజర్వు(ఏఆర్) బలగాలను పంపిస్తాం. విభజన అనంతరం గ్రేహౌండ్స్ కేంద్ర అధీనంలోకి వెళ్తే ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం.
 
 మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు దగ్ధం కేసునకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. బస్సు అసలైన యజమానిగా జేసీ ప్రభాకరరెడ్డి సతీమణి ఉమాప్రభాకరరెడ్డి ఉన్నారు. విచారణ అనంతరం నిందితుల్ని అరెస్టు చేస్తాం.  రోడ్డు ప్రమాదాల సంఖ్య గతేడాదితో పోలిస్తే 6.45 శాతం పెరిగాయి. పోలీసు శాఖలో 9,815 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం.  రాష్ట్రవ్యాప్తంగా 90 పోలీస్‌స్టేషన్లను మోడల్ పోలీస్‌స్టేషన్ల కింద పునర్ వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో నక్స ల్స్ కార్యకలాపాలు గతేడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. ఈ ఏడాది 163 మంది నక్సల్స్‌ను అరెస్టు చేయుగా, 76 మంది లొంగిపోయారు.  మొత్తం కేసులు 12.94 శాతం పెరగ్గా, హత్య కేసులు 10 శాతం తగ్గాయి. సైబర్, ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. ఆర్థిక నేరాల ద్వారా రూ.1,627 కోట్లు, ఆస్తి సంబంధిత నేరాలలో రూ.216 కోట్లు స్వాహా జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించి ఈ ఏడాదిలో 608 కేసులు నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అత్యాచారం కేసులు 20.49 శాతం, వేధింపుల కేసులు 16.36 శాతం, కిడ్నాప్ కేసులు 17.94 శాతం పెరిగాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement