Disaster Response Force
-
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్‌కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్‌కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్‌లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్‌ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
ఏటి ఒడ్డున కన్నీటి సుడులు.. తమ్ముడూ రాఖీ కడదామని వచ్చానురా.. !
నేలకొండపల్లి / ఖమ్మం వైద్యవిభాగం: మండలంలోని సుర్దేపల్లి ఏటిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తితో పాటు ఆయనను కాపాడేందుకు వచ్చి గల్లంతైన డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలు శుక్రవారం లభించాయి. గురువారం ఏటిలో చేపల వేటకు వెళ్లిన రంజిత్ గల్లంతు కాగా, ఆయనను రక్షించేందుకు వచ్చిన ఖమ్మం కార్పొరేషన్ డీఆర్ఎఫ్ సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, బి.ప్రదీప్ కూడా గల్లంతైన విషయం విదితమే. అయితే, గురువారం రాత్రి వెంకటేశ్వర్లు మృతదేహం లభించగా, శుక్రవారం ప్రదీప్, రంజిత్ మృతదేహాలను గుర్తించారు. అనంతరం రంజిత్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాక, డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులను సస్పెండ్ చేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. అధికారులు రాకుండా బలవంతం చేస్తే తాము ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. (చదవండి: అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్) వీరి ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలపగా, ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ చర్చించినా ససేమిరా అన్నారు. చివరకు కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్ వచ్చి నచ్చచెప్పారు. అలాగే, ఖమ్మంలో ఉన్న నాయకులతో ఫోన్లో మాట్లాడిన ప్రదీప్ బంధువులు వారి సూచనతో ఐదు గంటల ఆందోళన అనంతరం మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. కాగా, ఆందోళన నేపథ్యాన నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ పోలీస్స్టేషన్ల నుంచి సిబ్బందిని పిలిపించి ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్, ముదిగొండ ఎస్సై నాగరాజు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ సీ.హెచ్.శివ పర్యవేక్షించారు. సీపీఐ, సీపీఎం, ప్రజాపంథా, కాంగ్రెస్‌తో పాటు ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, గోగినపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్, తుమ్మా విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఎం.జయరాజ్, పొట్టపింజర నాగులు, పగిడికత్తుల నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, కడియాల శ్రీనివాసరావు, గరిడేపల్లి రామారావు, తోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోదిస్తున్న ప్రదీప్ భార్య బంధువులు విలేకరిపై రాళ్లదాడి ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు న్యాయం చేయాలని ధర్నా చేస్తూ అధికారులు రావాలి్సందేనని పట్టుబడ్డారు. ఇంతలోనే నేలకొండపలి్లకి చెందిన ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరి.. అధికారులంతా రావడానికి చనిపోయిన వ్యక్తి ఏమైనా వీఐపీనా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న రాళ్లతో దాడికి దిగారు. దాదాపు అర కిలోమీటర్ మేర పరుగులు పెట్టిస్తూ రాళ్లు విసరగా, సహచర విలేకరులు, పోలీసులు అడ్డుకుని పంపించారు. రోదిస్తున్న నాగరాణి(కుడి) కుప్పకూలిన నాగరాణి తమ్ముడూ... రాఖీ పండగకు వచ్చాను... నీకు రాఖీ కడతాను, లేవరా అంటూ ప్రదీప్ మృతదేహం వద్ద ఆయన సోదరి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ బి.ప్రదీప్(32) అక్క లింగం కనకదుర్గ నాగరాణి బోనకల్లో ఉంటుండగా, పండుగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు రావాలని గురువారం సాయంత్రం సిద్ధమవుతోంది. ఇంతలోనే ఆయన ఏటిలో గల్లంతైనట్లు తెలుసుకుని ఆవేదనతో వచ్చింది. గురువారం చీకటి పడడంతో గాలింపు నిలిపివేసినా తమ్ముడు వస్తాడని ఆశగా ఎదురుచూసింది. శుక్రవారం అక్కడే ఉన్న ఆమె తమ్ముడిపై ప్రేమతో ఆశగా చూస్తోంది. ఇంతలోనే ఆయన మృతదేహాన్ని స్థానికులు తీసుకురావడంతో నాగరాణి కుప్పకూలింది. నాగరాణి తన తమ్ముడు ప్రదీప్‌తో పాటు అన్నకు ఏటా రాఖీ కట్టేది. కానీ సుర్దేపల్లి చెక్‌డ్యామ్ ఆమె సంతోషంపై నీళ్లు చల్లడంతో రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. పరిహారం, ఉద్యోగం డీఆర్ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాక అక్కడ కూడా ధర్నా చేశారు. చివరకు ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం, ఇంటి స్ధలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. (చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..) -
రాష్ట్రానికీ ఓ ‘డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’
డీజీపీ ప్రసాదరావు వెల్లడి 250 మందితో ఏపీఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు బోగీ దగ్ధం కేసులో విద్రోహ చర్యల కోణంలోనూ దర్యాప్తు పెరిగిన రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు తగ్గిన నక్సలైట్ల కార్యకలాపాలు, హత్య కేసులు సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్రం అధీనంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) ఉన్నట్లే రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటైంది. ప్రాథమికంగా 250 మందితో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ మరో ఆరు నెలల్లో పని చేయడం ప్రారంభిస్తుందని డీజీపీ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు నిర్మాణాలు కూలిన సందర్భంలోనూ ఈ దళం సేవలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మంగళగిరిలోని ఎన్డీఆర్ఎఫ్ లేదా హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా) అధీనం లో ఉండే కోలాప్డ్స్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఎస్ఆర్) బృం దాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఒక్కోసారి ప్రాణనష్టం పెరుగుతోంది. ఈ ఏడాది వరుసగా వచ్చిన పైలీన్, హెలెన్, లెహర్ తుఫాన్ల సందర్భంలో రెవెన్యూ యంత్రాంగానికి పోలీసులు గణనీయ సేవలందించారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని సహాయ శిబిరాలకు తరలించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ అనుభవంతో పోలీసు విభాగంలోనూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచించిన డీజీపీ, ఏపీఎస్డీఆర్ఎఫ్కు అంకురార్పణ చేశారు. డీజీపీ చెప్పిన మరికొన్ని అంశాలివీ బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన వెనుక విద్రోహ చర్యేలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది శేషాచలం అడవుల్లోని ఏడు రీజియన్లలో ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించేందుకు అటవీశాఖ అధికారులకు సాయంగా రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ), ఆర్ముడ్ రిజర్వు(ఏఆర్) బలగాలను పంపిస్తాం. విభజన అనంతరం గ్రేహౌండ్స్ కేంద్ర అధీనంలోకి వెళ్తే ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు దగ్ధం కేసునకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. బస్సు అసలైన యజమానిగా జేసీ ప్రభాకరరెడ్డి సతీమణి ఉమాప్రభాకరరెడ్డి ఉన్నారు. విచారణ అనంతరం నిందితుల్ని అరెస్టు చేస్తాం. రోడ్డు ప్రమాదాల సంఖ్య గతేడాదితో పోలిస్తే 6.45 శాతం పెరిగాయి. పోలీసు శాఖలో 9,815 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 90 పోలీస్స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్ల కింద పునర్ వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో నక్స ల్స్ కార్యకలాపాలు గతేడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. ఈ ఏడాది 163 మంది నక్సల్స్‌ను అరెస్టు చేయుగా, 76 మంది లొంగిపోయారు. మొత్తం కేసులు 12.94 శాతం పెరగ్గా, హత్య కేసులు 10 శాతం తగ్గాయి. సైబర్, ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. ఆర్థిక నేరాల ద్వారా రూ.1,627 కోట్లు, ఆస్తి సంబంధిత నేరాలలో రూ.216 కోట్లు స్వాహా జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించి ఈ ఏడాదిలో 608 కేసులు నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అత్యాచారం కేసులు 20.49 శాతం, వేధింపుల కేసులు 16.36 శాతం, కిడ్నాప్ కేసులు 17.94 శాతం పెరిగాయి.