సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు.
మొదటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందుముందు తెరిపి లేకుండా భారీ వర్షాలు కురిస్తే ముంబై పరిస్ధితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వర్షాకాలానికి ముందు బీఎంసీ రూ.కోట్లు ఖర్చుచేసి మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయిస్తుంది. వర్షా కాలంలో వర్షపు నీరు సాఫీగా సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా పనులు చేపడుతుంది. కానీ ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి దాదర్ సర్కిల్, ఫైవ్ గార్డెన్, హిందూకాలనీ, చెంబూర్, వడాల, రఫీ మహ్మద్ కిడ్వాయి మార్గ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో నీరు నిల్వని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడం మొదలైంది. వీటితోపాటు రెండు రోజుల కిందట సెంట్రల్ రైల్వే మార్గంలో థానే, కల్యాణ్ దిశగావెళ్లే లోకల్ రైలు సేవలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. పశ్చిమ మార్గంలో అంధేరీ స్టేషన్ సమీపంలో ఉన్న సబ్‌వేలో కూడా వర్షపు నీరు చేరింది. మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో గత్యంతరం లేక సబ్ వేను మూసివేయాల్సిన పరిస్ధితి వచ్చింది.
చివరకు విద్యుత్ మోటర్ పంపుల ద్వారా నీటిని బయటకు తోడాల్సి వచ్చింది. నీరంత బయటకు తోడేసిన తరువాత మరమ్మతులు చేసి సబ్‌వేను పునఃప్రారంభించారు. అదేవిధంగా ముంబైలోని పేడర్ రోడ్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదారిని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. హిందూమాత, దాదర్, తిలక్ నగర్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. దీంతో బీఎంసీ ఖర్చుచేసిన రూ.కోట్లు వృథా పోయినట్లు స్పష్టమైతోంది.
ఏటా వర్షా కాలంలో హిందూమాత, దాదర్ టీటీ, పరేల్ టీటీ, అంధేరీలో మిలన్ సబ్‌వేలో వర్షపు నీరు చేరడం పరిపాటే. ఏటా వర్షా కాలంలో తమకు ఈ తిప్పలు తప్పవని స్ధానికులు వాపోతుంటారు. కాని బీఎంసీ మాత్రం మురికి కాల్వలు, నాలాలు వంద శాతం శుభ్రం చేశామని, ఈసారి వర్షా కాలంలో నీరు నిల్వదని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఏటా వర్షా కాలంలో జరిగే పరిణామాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. యథాతధంగా రోడ్లన్నీ జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం, లోకల్ రైళ్లకు అంతరాయం కల్గడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి.
#WATCH | Maharashtra: Sion area of Mumbai witnessed waterlogging in the wake of heavy rains in the city. Visuals from last night. pic.twitter.com/tjniUJ74RE
— ANI (@ANI) July 5, 2022
(చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్)
Comments
Please login to add a commentAdd a comment