భారీ వానలతో అతలాకుతలం
88 ఏళ్ల తర్వాత రికార్డు వర్షం
ఎంపీల నివాసాల్లోకీ వరద నీరు
నరకం చూపిన ట్రాఫిక్ జామ్‌లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నీట మునిగింది. రికార్డు స్థాయి భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వరుసగా శుక్రవారం రెండో రోజూ భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెగని వర్షం పడింది. దాంతో భరించలేని ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగినా నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఎన్సీఆర్ రోడ్లను వరదలు ముంచెత్తాయి. వరద నీటి ధాటికి చాలాచోట్ల డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోవడంతో సమస్య మరింత విషమించింది. సమీప ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. ఢిల్లీ జల మంత్రి ఆతిశితో పాటు శశి థరూర్ తదితర ఎంపీల నివాసాలు కూడా నీట మునిగాయి. వారి ఇళ్లలోని ఫరి్నచర్ తదితరాలు వరద నీటిలో తేలియాడుతూ కని్పంచాయి. వర్షాలు, సంబంధిత ఉదంతాల్లో ఐదుగురు మరణించారు.
నీటితో నిండిపోయిన అండర్‌పాస్‌ల్లో వాహనాలు తేలియాడాయి. పలుచోట్ల వాటిలో ప్రయాణికులు గంటలపాటు చిక్కుకున్నారు. గుర్గావ్‌లోని పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్ గందరగోళం ఏర్పడింది. తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ నుంచి గాజీపూర్ దాకా, అక్షరధామ్–సరాయ్ కాలే ఖాన్ రహదారిపైనా... ఇలా ఎక్కడ చూసినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయి జనాలకు చుక్కలు చూపింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు, అంతకు మించి వరద కని్పంచింది. పలు చోట్ల మెట్రో స్టేషన్లు కూడా నీట మునిగాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ఏకంగా 153.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి.
జూలై 3 దాకా వానలే
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం దాకా 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ గత 88 ఏళ్లలో అత్యధిక వర్షపాతంగా రికార్డుకెక్కింది. జూన్‌లో ఢిల్లీలో సగటున 80.6 మి.మీ వర్షం కురుస్తుంది. ఢిల్లీలో ఏడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూలై 3 దాకా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ‘‘ఈదురుగాలులతో భారీ వర్షాలు పడొచ్చు. జూలై 1, 2 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షం
పడుతుంది’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment