రాయలచెరువు వద్ద అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
Rayala Cheruvu Present Situation: నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాదఘంటికలను మోగిస్తోంది. చెరువు కట్ట బలహీనంగా మారుతూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కట్ట పటిష్టతకు కృషి చేస్తోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితరులు చెరువును ఆదివారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాయలచెరువులో 0.9 టీఎంసీల నీరు ఉన్నట్లు వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు హెలికాప్టర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు.
చదవండి: (తిరుపతి రాయల చెరువుకు లీకేజీ.. ఏ క్షణానైనా కట్ట తెగిపడే అవకాశం)
చెరువులో పరిస్థితిని గమనిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది
తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అలాగే రామాపురంలోని వెరిటాస్ సైనిక్ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైతం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. మరో రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొండలు, గుట్టల్లో తలదాచుకుని ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం రాయలచెరువు వద్దకు చేరుకున్న ఆయన కట్టను పటిష్టం చేసే చర్యలను పర్యవేక్షించారు. అధి కారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రంతా చెరువు వద్దనే గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment