అడిగింది 5వేల కోట్లు.. ఇచ్చింది వెయ్యి కోట్లు
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ. 5 వేల కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరారు. భారీవర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో గురువారం ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత మోదీని జయలలిత కలిశారు.
భారీవర్షాలతో తమ రాష్ట్రానికి జరిగిన నష్ట్రాన్ని వివరించారు. జాతీయ విపత్తు స్పందన నిధి(ఎన్డీఆర్ ఎఫ్) కింద రూ. 5 వేల కోట్లు సహాయం చేయాలని ఆర్థించారు. జయ విన్నపానికి స్పందించిన మోదీ రూ.1000 కోట్లు ఎన్డీఆర్ ఎఫ్ కింద తక్షణమే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సహాయక కార్యక్రమాలకు అదనంగా 10 ఆర్మీ బలగాలు, 20 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను పంపాలని జయలలిత కోరగా ప్రధాని అంగీకరించారు.