'చెన్నై వాసులకు హేట్సాఫ్'
న్యూఢిల్లీ/చెన్నై: వరద బాధితులను ప్రతిఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. వరదల్లో చిక్కుకున్న తోటివారికి చెన్నై వాసులు తమ వంతు సహాయం చేస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న చెన్నై వాసులకు ట్విటర్ ద్వారా హేట్సాఫ్ చెప్పారు.
కాగా వరదల్లో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు చెన్నై వాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఆహారం తయారుచేసి బాధితులకు సరఫరా చేస్తున్నారు. కొంతమంది తాగునీరు అందిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాయం అందిస్తున్నారు. సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల ద్వారా సేవల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అభిమానులను, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Hats off 2 Chennai ppl 4 d way they r trying 2 help their brethren who r affected in floods.This is d time everyone should help d helpless.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) December 4, 2015