
సాక్షి, విజయవాడ/న్యూఢిల్లీ : కృష్ణా నదిలో బోటు బోల్తా పడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందని, ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
కృష్ణా నదిలోని పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తాపడిన ఘటనలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 'ఆదివారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు నదిలో గల్లంతైన వారి జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు' అని ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సంతోష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. వీరి కోసం ప్రస్తుతం నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే సీనియర్ మంత్రుల కమిటీ ఏర్పాటైందని, ఈ ఘటనలో నలుగురు-ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదుచేశామంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు