
సాక్షి. న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 'పీఎం కేర్స్ ఫండ్'కు వచ్చిన కోవిడ్-19 విరాళాలను ప్రకృతి వైపరీత్యాల సహాయక నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్)కి బదిలీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పీఎం కేర్స్‌కు నిధులు విరాళాల రూపంలో వచ్చాయని ధర్మాసనం స్పష్టం చేసింది. పీఎం కేర్స్ ఫండ్ నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎన్‌డీఆర్‌ఎఫ్) లేదా స్టేట్ ఫండ్ లకు బదిలీ చేయాలని కోరుతూ ఓ స్వఛ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది దుశ్యంత్ దేవ్ వాదనలు వినిపిస్తూ.. కొత్త ఫండ్‌ను క్రియేట్ చేయడం వల్ల అది ఎన్డీఆర్ఎఫ్‌కు అవరోధంగా మారినట్లు తెలిపారు. పీఎం కేర్స్ అనేది పబ్లిక్ చారిటీ ట్రస్ట్ లాంటిదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇది కరోనా వైరస్ ని ఎదుర్కొనడానికి స్వఛ్చందంగా అందే విరాళాల సేకరణ కోసం ఉద్దేశించినదని తెలిపింది. అంతే తప్ప.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేదా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లకు కేటాయించిన నిధులకు, దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. (చదవండి : జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!)
ఇక పిటిషనర్ తరపున దుశ్యంత్ దేవ్ వాదిస్తూ.. ఎన్డీఆర్ఎఫ్‌ను కాగ్ ఆడిట్ చేయగా పీఎం కేర్స్‌ను ఓ ప్రైవేటు సంస్థ ఆడిట్ చేస్తున్నట్లు ధర్మాసనానికి వివరించారు. పీఎం కేర్స్‌ను కూడా కాగ్ ఆడిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. కోవిడ్ -19 ను పరిష్కరించడానికి 2019 నవంబర్‌లో రూపొందించిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక సరిపోతుందని, కొత్త డిజాస్టర్ రిలీఫ్ ప్లాన్ అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా, పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రధాని ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉండగా రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment