సాక్షి,ప్రత్తిపాడు: అప్పటివరకూ అంతా కలిసి తిరిగారు.. ఒకే బండిపై చక్కర్లు కొట్టారు. కలిసి తాగారు. కలిసి తిన్నారు. సరదాగా గడిపారు. చివరికి క్వారీ గుంతలో గల్లంతయ్యారు. ఆ క్షణంలో ఒకరిని కాపాడేందుకు మరొకరు శతవిధాలా ప్రయత్నించారు. ఆఖరి గడియల్లోనూ స్నేహబంధాన్ని వీడలేదు.
కాళ్లకు బురదైందని..
ప్రత్తిపాడుకు చెందిన లంబు వంశీ (21), సిద్ధం శెట్టి వెంకటేష్ (21), బిళ్లా సాయి ప్రకాష్ (23), ఇగుటూరి వీరశంకర్ రెడ్డి (22), పాతపాటి యశ్వంత్, ఉదయగిరి హేమంత్ స్నేహితులు. ఆదివారం కావడంతో వీరంతా కలిసి రెండు ద్విచక్రవాహనాలపై ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం డైట్ కళాశాల సమీపంలోని కొండ క్వారీ వైపు వెళ్లారు. వర్షం పడటం వల్ల కొందరి కాళ్లకు బురద అయ్యింది.
దీంతో కాళ్లను కడుక్కునేందుకు కొండల మధ్యన ఉన్న లోతైన (సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు) క్వారీ గుంతలోకి ముందుగా శంకర్ రెడ్డి, సాయి దిగారు. రెండు మూడు అడుగులు ముందుకు వేసిన తరువాత వారు పైకి రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన వంశీ, వెంకటేష్ దిగారు. స్నేహితులను కాపాడే క్రమంలో వారితోపాటు వీరూ మునిగిపోయారు.
బంధువుల ఆర్తనాదాలు
నలుగురు యువకులు నీటి క్వారీ గుంతలో పడి గల్లంతు కావడంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మిన్నంటిపోయింది. విషయం దావానంలా వ్యాపించడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కలవారు ఘటనా స్థలానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. ఓ బిడ్డా.. నన్ను వదిలేసి వెళ్లిపోయావా.. అంటూ గల్లంతైన వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అర్ధరాత్రీ కొనసాగిన గాలింపు చర్యలు
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ క్వారీలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, ప్రత్తిపాడు ఎస్‌ఐ అశోక్, తహసీల్దార్ ఎం.పూర్ణచంద్రరావుతో పాటు అధికారయంత్రాంగమంతా అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈత రాకున్నా.. నేనున్నా నేస్తం అంటూ.
ఓ దశలో సాయిప్రకాష్ చేతులు పైకిలేపి కాపాడండి అంటూ పెద్దగా అరవడంతో ఒడ్డున ఉన్న పాతపాటి యశ్వంత్ తనకు పెద్దగా ఈత రాకపోయినా స్నేహితుడిని కాపాడేందుకు నీళ్లలోకి దిగి సాయికి చేయి అందించాడు. అతడిని బయటకు లాగేందుకు శతవిధాలా యత్నించాడు. చివరికి ఫలితం లేకపోవడంతో సాయి చేయిని విడవక తప్పలేదని యశ్వంత్ కన్నీరుమున్నీరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment