
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. రెండు రోజులుగా అలుపెరుగని సేవలు అందిస్తోన్నాయి. వరదలో నుంచి బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
నగరంలో ఎనమిది చోట్ల ఏకకాలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఫలక్ నామా, బాలాపూర్, మీర్ పేట, టోలి చౌకి, సలీం కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీ, రామాంతాపూర్, కృష్ణా నగర్, చాంద్రాయణ గుట్ట, బగల్ గూడలలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు వరుణుడు సహకరించి, నేడు వర్షం కురవకపోతేనే చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాలనుండి వరద కొనసాగుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. చదవండి: మరో 24 గంటల పాటు పోలీసు శాఖ అప్రమత్తం