MS ramachandra rao
-
బదిలీ.. దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తా
సాక్షి, హైదరాబాద్: ‘తొమ్మిదేళ్లకుపైగా ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా తీవ్ర పని ఒత్తిడితో తీరిక లేకుండా గడిపా. ఆరోగ్యం మీద ప్రభావం చూపించడంతోపాటు భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయా. పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నన్ను బదిలీ చేయడం.. కుటుంబంతో తీరికగా గడిపేందుకు దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తా’అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు పేర్కొన్నారు. యువ న్యాయవాదులకు కష్టపడితేనే విజయం సాధ్యమని, సక్సెస్‌కు షార్ట్కట్లు ఉండవని పేర్కొన్నా రు. ఇక్కడ పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు జస్టిస్ రామచందర్‌రావుకు శనివారం ఆన్లైన్లో ఘనంగా వీడ్కోలు పలికింది. ‘1990లో కేంబ్రిడ్జిలో ఎల్ఎల్ఎం కోసం లండన్‌కు వెళ్లా. భారత్‌కు వచ్చేటప్పుటికి నా ఆలోచన విధానం, ప్రవర్తన, నిబద్దత పూర్తిగా మారిపోయాయి. న్యాయవ్యవస్థలో విభజించు.. పాలించు విధానం, రాజకీయాలు సరికాదు. బార్లో కులం, ప్రాంతీయ వివక్ష చూపించరాదు. బార్ అసోసియేషన్ అంతర్గత విభేధాలను పక్కనపెట్టాలి. సమష్టిగా ఉండాలి’అని జస్టిస్ రామచందర్‌రావు పేర్కొన్నారు. జస్టిస్ రామచందర్‌రావు నుంచి ఎంతో నేర్చుకున్నానని, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఆయనతో తనకు ఎంతో అను బంధం ఉందని జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బదిలీ ఇక్కడి న్యాయవ్యవస్థకు లోటని పేర్కొన్నారు. న్యాయమూర్తిగా నిక్కచ్చిగా తీర్పులిచ్చేవారని, ఆయన తీర్పులు కొత్తతరం న్యాయవాదులకు స్ఫూర్తిదాయకమని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, పీపీ ప్రతాప్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ తిరుమల దేవి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టపరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పుడు రాష్ట్రంలో ఎక్కడా పంట నష్టం జరగలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. విపత్తులతో పంటలు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పింది. పంట నష్టం జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. నష్టాన్ని నివారించామనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలను చూపలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మూడు నెలల్లో అంచనా వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నెల రోజుల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కౌలు రైతులతో పాటు నష్టపోయిన రైతుందరికీ ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం అందించాలని ఆదేశించింది. పంట బీమా లేక తీవ్రంగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆర్థిక సాయం అందించాలని స్పష్టం చేసింది. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, ఆశాలతలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. నష్టం లేకుండా చేయడం అసాధ్యం ‘భారీ వర్షాలు పడ్డాయని, పంట పొలాల్లో భారీగా నీరు నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించింది. అయితే వెంటనే చేపట్టిన నష్టనివారణ చర్యలతో పంటలు నష్టపోలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమర్థనీయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చేమో. అంతేగానీ అసలు నష్టమే జరగకుండా చేయడం అన్నది అసాధ్యం. వాస్తవానికి భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, ఆర్థిక సాయం చేయాలంటూ సీఎం, సీఎస్ వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర ప్రతినిధి బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా చేసింది. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం పొంతన లేని వాదనలు చేస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదన్న వాదన కూడా సరికాదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్రానికి కేటాయించింది. రైతు బంధు భూమి యజమానులకు మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు సాయం అందడం లేదు. విపత్తులు సంభవించినప్పుడు సన్న, చిన్నకారు, కౌలు రైతులే తీవ్రంగా నష్టపోతారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత..’అని ధర్మాసనం పేర్కొంది. పిల్ అన్నింటికీ మాత్ర కాదు ‘ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం లేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం. గత ఏడాది.. ముందు నష్టం జరిగిందని భావించి సీఎం, సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. తర్వాత పరిశీలించగా ఎక్కడా నష్టం జరగలేదని తెలిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సాయం అందలేదు..’అని అంతకుముందు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఉంది ఏజీ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ఈ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, పిల్‌ను విచారణకు స్వీకరించిన దాదాపు 10 నెలల తర్వాత విచారణార్హం కాదనడం సరికాదని పేర్కొంది. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజన ఉందని తేల్చిచెప్పింది. ఎలాంటి సాయం అందించలేదు ‘5.97 లక్షల ఎకరాల్లో దాదాపు 33 శాతం పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం, సీఎస్ కోరారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయినా రైతులకు ఎటువంటి సాయం అందించలేదు..’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు. నష్టం జరిగిందని లేఖ రాశారు గత ఏడాది వర్షాలకు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని సీఎం కేసీఆర్, సీఎస్‌లు కేంద్రానికి గత ఏడాది అక్టోబర్ 16న లేఖలు రాసినట్లు కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం ఇచ్చేందుకు రూ.7,219.5 కోట్లు అవసరమని కోరిందని తెలిపారు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం ‘హైకోర్టు చారిత్రక తీర్పుతో లక్షలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. బేషజాలకు పోకుండా ఇప్పటికైనా తీర్పును అమలు చేయాలి. అలాగే ఈ ఏడాది వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి బాధిత రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది యాసంగికి పంటల బీమాను నోటిఫై చేయాలి..’అని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
ఆ ప్లాట్ల వేలం ఆపండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని భూముల వేలంపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పుప్పాలగూడలోని 11.02 ఎకరాల భూమిపై హక్కులు లేకపోయినా.. సంరక్షకుడిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాందిశీకుల భూములను వేలం వేయడాన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆ భూమిని వేలం వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ భూమిలో ఉన్న ప్లాట్ నంబర్లు 25 నుంచి 30 వరకు వేలం వేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సర్వే నంబర్ల జిమ్మిక్కులతో పిటిషనర్లను వేధింపులకు గురిచేయడం సరికాదని, పిటిషనర్లకు చెందిన భూమిని వేలం వేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. పుప్పాలగూడ సర్వే నంబర్ 301లోని 11.02 ఎకరాల భూమిని 2006, జూలై 31న తాము కొనుగోలు చేశామని, అయినా హెచ్ఎండీఏ ఆ భూముల్ని వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందంటూ లక్ష్మీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫున సి.నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. కాందిశీకుల చట్టం కింద నవలాల్‌మాల్ ప్రజ్వానీ అనే కాందిశీకునికి ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు రాష్ట్రపతి 1950లో ఉత్తర్వులు జారీచేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ప్రజ్వానీ వారసుల నుంచి పిటిషనర్లు భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. 42 ఎకరాల వేలానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయినా నిబంధనలకు విరుద్ధంగా 99 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేశారని మరో న్యాయవాది నివేదించారు. పిటిషనర్ల భూములు సర్వే నంబర్ 302లో ఉన్నాయని, వేలం వేస్తున్న భూములపై పిటిషనర్లకు ఎటువంటి హక్కులు లేవని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరీందర్ పరిషద్ వాదనలు వినిపించారు. ఒకే ప్లాట్ రెండు సర్వే నంబర్లలో ఉన్నట్లుగా పేర్కొన్నారని, ఇదేలా సాధ్యమని ధర్మాసనం హరీందర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
కౌంటర్ దాఖలు చేయరా?
సాక్షి, హైదరాబాద్: బీసీ జనాభాను లెక్కించి, చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే పంచా యతీ ఎన్నికలు నిర్వహించాలన్న తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలై మూడు నెలలు కావస్తున్నా, ఈ వ్యవహారంలో ఇప్ప టి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. జూన్ 14లోపు కౌంటర్ దాఖలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షం లో ఈ కేసులో విచారణ కొనసాగించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేశారు. బీసీ జనాభా లెక్క లు తేల్చి, ఆ లెక్కల ప్రకారం రిజర్వే షన్లు ఖరారు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని గతేడాది ప్రభుత్వా న్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీసీ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ రామచంద్రరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వంగా రామచంద్ర గౌడ్, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. వాదన లు విన్న న్యాయమూర్తి.. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏమిటని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావును నిలదీశారు. తదుపరి విచారణకల్లా కౌంటర్ దాఖలు చేసి తీరాలని స్పష్టం చేశారు. -
ఆక్రమణల కూల్చివేత మంచిదే
-
ఆక్రమణల కూల్చివేత మంచిదే
కానీ చట్ట ప్రకారం వ్యవహరించండి: హైకోర్టు రాష్ట్రంలో నాలాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆక్రమించినవారిగా పేర్కొంటున్నవారికి నోటీసులు ఇవ్వకుండా, వాదనలను వినిపించే అవకాశమివ్వకుండానే కూల్చివేతలకు ఉత్తర్వులు జారీ చేయరాదని మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించింది. రెండు వారాల గడువు ఇచ్చి వారి వాదన వినాలని.. తర్వాతే కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. చట్టాల అమలు విషయంలో సమతుల్యత పాటించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు న్యాయస్థానంపై ఉందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. - సాక్షి, హైదరాబాద్ రెండో రోజు విచారణలో.. తమవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యహరిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. అయితే నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినందునే కూల్చివేస్తున్నామని జీహెచ్ఎంసీ, రెవెన్యూశాఖల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. దశల వారీగా కూల్చివేత చేపడుతున్నామని.. అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. దీంతో అందరికీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు.. ఎటువంటి సందిగ్ధతకు తావు లేకుండా శుక్రవారం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘‘జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, చెరువులను ఆక్రమించుకుని 28 వేల నిర్మాణాలు వెలిశాయన్న విషయంలో ఎటువంటి వివాదం లేదు. ఈ ఆక్రమణలున్న విషయం నిర్దిష్ట కాలం నుంచే అధికారులకు తెలుసు (పత్రికా కథనాల ప్రకారం నాలుగు సంవత్సరాలుగా). అయినా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడలేదు. మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలిసేందుకు అనుమతిచ్చారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూశాఖల్లో అవినీతి ఉందన్న విషయంలోనూ వివాదం లేదు. ఓ నిర్మాణం కూల్చివేత సమర్థనీయమా, కాదా? అది ఏకపక్షమా.., కపట ఉద్దేశాలున్నాయా? అన్న విషయాలను న్యాయస్థానాలు పట్టించుకోకుండా పక్కకు వెళ్లవు. ఇటువంటి వ్యవహారాల్లో పౌరుల వైపు నుంచి ఆలోచించాలని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలకు పౌరులు మాత్రమే ఎందుకు బాధితులుగా మారాలని, ప్రభుత్వానికి ఎందుకు బాధ్యత ఉండకూడదని ఆ తీర్పులో ప్రశ్నించింది. దశాబ్దాల తరబడి చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో... బాధితులకు న్యాయస్థానం అండగా ఉండకపోవడానికి ఎటువంటి కారణం కూడా లేదని సుప్రీం పేర్కొంది. ఆ తీర్పు ఇప్పుడు ఈ కేసులకు కూడా వర్తిస్తుంది. ఆక్రమణలంటూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో కూల్చివేతలకు దిగారు. ముందు నోటీసులు ఇవ్వడం గానీ, అధికారుల చెబుతున్న వాటితో విభేదించేందుకు అవకాశం గానీ ఇవ్వడం లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇది చెల్లుబాటు కాదు..’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి సహజ న్యాయసూత్రాలను పాటించాల్సిన అవసరం లేదని చట్టం స్పష్టంగా చెబుతుంటే తప్ప.. ఉత్తర్వులు జారీ చేసే ముందు వాదన వినిపించే అవకాశమివ్వడం తప్పనిసరని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా ఆ చర్య వల్ల వ్యక్తిగత హక్కులు, ఆస్తి, వస్తు నష్టం వంటి పరిణామాలు ఏర్పడే అవకాశమున్నన్నప్పుడు కూడా వాదనలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందని.. ఆ అత్యవసర పరిస్థితేమిటో చెప్పి సమర్థించుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తమ నిర్మాణాలు సక్రమమైనవేననే ఆధారాలు చూపే అవకాశం కూడా ఇవ్వకపోతే అధికారుల ఏకపక్ష చర్యల నుంచి ప్రజలకు రక్షణ ఉండదన్నారు. తద్వారా పౌరులకు తీరని నష్టం వాటిల్లుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కుటుంబాలతో సహా రోడ్డునపడతారు. తీవ్ర మనోవేదనకు, ఇబ్బందులకు గురవుతారు. ఆక్రమణల గురించి తెలిసీ అధికారులు ఇంత కాలం మౌనంగా ఉన్నారు. ఆక్రమణలుగా చెబుతున్న స్థలాల్లో ఉంటున్న వారి వాదనలను వినిపించేందుకు.. ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లేందుకు తగిన గడువు ఇవ్వడం ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎంతో సముచితం. నాలాలు, చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని ఎవరినైతే అనుమానిస్తున్నారో వారందరికీ నోటీసులు జారీ చేయండి. అవి అక్రమ నిర్మాణాలనేందుకు ఉన్న ఆధారాలు ఇవ్వండి. కూల్చివేతలకు దారి తీసిన పరిస్థితులను ప్రస్తావించండి. నోటీసులకు స్పందించేందుకు, స్థలాన్ని విడిచి వెళ్లేందుకు రెండు వారాల గడువు ఇవ్వండి. తరువాత తగిన నిర్ణయం వెలువరించి, కూల్చివేత ఏ విధంగా సమర్థనీయమో వివరించండి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాకే కూల్చివేతల చర్య తీసుకోండి..’’ అని అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆ స్థలంలో తదుపరి నిర్మాణాలేవీ చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేశారు. -
కూల్చివేతలపై పెద్ద సంఖ్యలో పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నాలాల ఆక్రమణలతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండటంపై హైకోర్టులో గురువారం పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో కూల్చివేతలకు సంబంధించి లంచ్మోషన్ల రూపంలో అత్యవసర విచారణ నిమిత్తం 25కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై న్యా యమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తమ నిర్మాణాలను కూ ల్చివేస్తున్నారని కొందరు పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. తమకు నోటీసులు ఇచ్చి కేవలం 24 గంటల గడువు మాత్రమే ఇచ్చారని మరికొందరు వివరించారు. తమ సొంత స్థలాల్లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేసుకున్నామని, ఇందుకు అధికారులు కూడా అనుమతులు ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పు డు వాటిని అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కూల్చివేతల వ్యవహారంలో చట్ట నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల నిర్మాణాలను కూల్చకుండా స్టే ఉత్తర్వులు జారీ చేశారు.